33 శాతం పెరిగిన ఇన్ఫోటెక్ లాభం
33 శాతం పెరిగిన ఇన్ఫోటెక్ లాభం
Published Fri, Oct 18 2013 5:31 AM | Last Updated on Fri, Sep 1 2017 11:44 PM
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్ సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో నికర లాభం 33 శాతం పెరిగి రూ.72.5 కోట్లుగా నమోదయ్యింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ రూ.50.31 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. ఈ సమీక్షా కాలంలో ఆదాయం 14% వృద్ధితో రూ.477 కోట్ల నుంచి రూ.549 కోట్లకు చేరింది. ఒక త్రైమాసికంలో ఆదాయం రూ.500 కోట్లు దాటడం, అలాగే ఆరు నెలల్లో రూ.1,000 కోట్లు దాటడం ఇదే ప్రథమం అని కంపెనీ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రూపాయి క్షీణత వలన మార్జిన్లు పెరిగాయని, ఆ మేరకు లాభాలు పెరిగినట్లు ఇన్ఫోటెక్ సీఎఫ్‌వో అజయ్ అగర్వాల్ పేర్కొన్నారు.
అలాగే ఈ మూడు నెలల కాలంలో 1,195 మంది ఉద్యోగులను నియమించుకోవడం ద్వారా కంపెనీ మరో రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ గత కొన్ని త్రైమాసికాలుగా స్థిరమైన వృద్ధిరేటును నమోదు చేస్తున్నామని, వచ్చే ఆరు నెలల కాలంలో కూడా ఇదే విధమైన వృద్ధిని నమోదు చేయగలమన్న ధీమాను ఇన్ఫోటెక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ బి.వి.ఆర్.మోహన్ రెడ్డి వ్యక్తం చేశారు. ఈ మూడు నెలల కాలంలో కొత్తగా 15 కస్టమర్లు వచ్చి చేరగా ఇందులో రెండు ఖాతాలు 20 మిలియన్ డాలర్ల విలువైనవని కంపెనీ ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రతీ షేరుకు రూ.2 (40 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటిస్తూ కంపెనీ బోర్డు డైరక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
Advertisement