ఇన్ఫోటెక్ లాభం రూ.69.39 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన ఐటీ సేవల సంస్థ ఇన్ఫోటెక్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఆదాయంలో 22 శాతం, నికరలాభంలో 12 శాతం వృద్ధిని కనపర్చింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ.475 కోట్ల నుంచి రూ. 578 కోట్లకు చేరగా, నికరలాభం రూ. 62 కోట్ల నుంచి రూ. 69 కోట్లకు చేరింది. గత నాలుగు త్రైమాసికాలుగా ఆదాయంలో ఎటువంటి వృద్ధి లేకుండా స్థిరంగా ఉన్నప్పటికీ, ఈ త్రైమాసికంలో గణనీయమైన వృద్ధిని నమోదు చేశామని, రానున్న కాలంలో కూడా ఇదే వృద్ధిని నమోదు చేయగలమన్న ధీమాను ఇన్ఫోటెక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ బి.వి.ఆర్ మోహన్ రెడ్డి తెలిపారు. మొత్తం నాలుగు విభాగాల పనితీరు బాగున్నప్పటికీ మూడు విభాగాలు రికార్డుస్థాయి వృద్ధిని నమోదు చేశాయన్నారు.
యూరప్ బాగుంది: సమీక్షా కాలంలో యూరప్ ఆదాయంలో 10 శాతం, అమెరికా ఆదాయంలో 7 శాతం వృద్ధిని ఇన్ఫోటెక్ నమోదు చేసింది. మొత్తం మీద ఆదాయంలో చూస్తే ఆమెరికా వాటా తగ్గి యూరప్ వాటా పెరిగింది. సమీక్షా కాలంలో మొత్తం ఆదాయంలో అమెరికా వాటా 61 శాతం నుంచి 57 శాతానికి తగ్గితే, యూరప్ వాటా 25 నుంచి 29 శాతానికి పెరిగింది. ఈ త్రైమాసికంలో కొత్తగా 11 మంది కస్టమర్లు వచ్చి చేరగా, 801 మంది ఉద్యోగులను తీసుకున్నట్లు మోహన్ రెడ్డి తెలిపారు. ఉద్యోగం వదిలివెళ్ళిన వారిని పరిగణనలోకి తీసుకుంటే నికరంగా 319 మందిని తీసుకున్నట్లు చెప్పారు.
మార్కెట్ అంచనాలను మించి ఫలితాలను
ఇవ్వడంతో గురువారం ఎన్‌ఎస్‌ఈలో ఇన్ఫోటెక్
షేరు భారీ ట్రేడింగ్ పరిమాణంతో 5 శాతం పెరిగి
రూ.347 వద్ద ముగిసింది.