BVR Mohan Reddy
-
బీవీఆర్ మోహన్ రెడ్డి ‘ఇంజనీర్డ్ ఇన్ ఇండియా’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైయంట్ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్ రెడ్డి రచించిన ‘ఇంజినీర్డ్ ఇన్ ఇండియా–ఫ్రమ్ డ్రీమ్స్ టు బిలియన్ డాలర్ సైయంట్’ పుస్తకాన్ని పెంగ్విన్ ఇండియా ప్రచురించింది. ఓ వ్యాపారవేత్తగా ఎదగాలని, దేశ నిర్మాణంలో తన వంతు పాలుపంచుకోవాలని కలలుకంటూ ఐఐటీ కాన్పూర్ నుంచి 1974లో బయటకు అడుగుపెట్టిన ఓ యువకుని సాహసోపేత కథ ఇది అని పెంగ్విన్ తెలిపింది. భారత్‌లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి ముందు అనుభవలేమి, మూలధన అవసరాలను సమకూర్చుకోవడమనే అవరోధాలను సైతం అధిగమించి మోహన్ రెడ్డి సాగించిన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఇది వెల్లడిస్తుందని వివరించింది. -
రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి సీఎం జగన్ చేస్తున్న కృషి మరువలేనిది
-
నిబంధనలు సరళిస్తేనే మరిన్ని వీసాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత టెక్నాలజీ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెట్టాలన్నా, స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలన్నా నిబంధనల సరళీకరణ కీలకమని, సులభతర వ్యాపార నిబంధనలుంటేనే స్థానిక ప్రభుత్వానికి ఆదాయంతో పాటు, ఉద్యోగాలూ వస్తాయని సైయంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి చెప్పారు. భారతీయ టెక్నాలజీ కంపెనీలు యూఎస్‌లో బిలియన్ల డాలర్ల కొద్దీ పెట్టుబడులు పెట్టి లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నాయని తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సీఈఓల సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పాల్గొన్న మోహన్ రెడ్డి.. టెక్నాలజీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ట్రంప్ ముందు ప్రస్తావించారు. ఆ వివరాలు ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘హెచ్1బీ వీసాలకు సంబంధించి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) గతేడాది నవంబర్‌లో 50:50 కంపెనీ చార్జెస్ నిబంధనలను తెచ్చింది. అంటే.. అమెరికాలోని భారతీయ కంపెనీల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులుంటే.. హెచ్1బీ వీసా కింద 4 వేల డాలర్లు, ఎల్1 కింద 4500 డాలర్ల రుసుము చెల్లించాలి. నిజానికి కొత్త హెచ్1బీ లేదా ఎల్1 వీసాల జారీలో ఈ నిబంధనలు ఓకే. కానీ రెన్యువల్ వీసాలకూ ఈ రుసుములు చెల్లించాలంటున్నారు. ఇది భారతీయ కంపెనీలకు పెనుభారమే. హెచ్1బీ ఉద్యోగుల స్థానంలో అమెరికన్స్‌కే ఉద్యోగాలిద్దామంటే.. ఉద్యోగ అనుభవం అడ్డొస్తుంది. కొత్తగా వెళ్లే కంపెనీలు కూడా 50:50 కంపెనీ చార్జీల భారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడి నుంచి ఉద్యోగులను తీసుకెళ్లే బదులు స్థానిక అమెరికన్స్‌కే ఉద్యోగాలిస్తున్నాయి. ఇక హెచ్1బీ వీసా వారి గ్రీన్‌కార్డ్ కోటా తొలగించటం వంటి లెజిస్లేటివ్ నిబంధనలూ ఇలాంటివే. ఈ విషయాన్ని ట్రంప్‌తో మేం ప్రస్తావించాం’’ అని మోహన్‌రెడ్డి వివరించారు. ట్రంప్ ఏం చెప్పారంటే... వచ్చే 3–6 నెలల్లో అమెరికాలోని భారతీయ టెక్నాలజీ కంపెనీలకు సంబంధించి నియంత్రణలను సరళీకరిస్తామని ట్రంప్ హామీ ఇచ్చినట్లు మోహన్‌రెడ్డి వెల్లడించారు. ‘‘గతంలో ఏ ప్రభుత్వమూ చేయనివిధంగా ట్రంప్ సర్కారు గత మూ డేళ్లలో నియంత్రణల్ని సడలించినట్లు చెప్పారు. అడ్మినిస్ట్రేటివ్ నిబంధనల తొలగింపును ప్రారంభించామని, వాటిని నోటిఫై చేయాల్సి ఉందని చెప్పారాయన’’ అని మోహన్‌రెడ్డి వివరించారు. -
వీడిన వాళ్లకు జోక్యం చేసుకునే హక్కులేదు
బీవీఆర్ మోహన్‌రెడ్డి హైదరాబాద్: విశాల్ సిక్కా వంటి మంచి సీఈవో గొప్ప సంస్థ అయిన ఇన్ఫోసిస్‌ను వీడడం బాధాకరమని నాస్కాం మాజీ చైర్మన్, సైయంట్ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కంపెనీని వీడిన తర్వాత ప్రమోటర్లకు అట్టి సంస్థలో జోక్యం చేసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు. ఇటువంటి ఘటన పశ్చిమ దేశాల్లో జరిగితే వాటాదారులు కంపెనీపై కోర్టులో దావా వేస్తారని అన్నారు. 12.8 శాతం వాటా ఉన్నవారు సమస్య సృష్టిస్తే, 87.5 శాతం వాటాదారులు ఇబ్బంది పడతారని తెలిపారు. బైబ్యాక్ యథాతథం.. సిక్కా రాజీనామా కారణంగా కంపెనీ ప్రతిపాదించిన షేర్ల బైబ్యాక్(దాదాపు రూ.13,000 కోట్లు) ప్రణాళికల్లో ఎలాంటి మార్పులూ ఉండబోవని ఇన్ఫీ ప్రకటించింది. బైబ్యాక్‌పై నిర్ణయం కోసం కంపెనీ నేడు(శనివారం) బోర్డు సమావేశం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. చైర్మన్‌గా నీలేకని రావాలి.. ఇన్ఫోసిస్ బోర్డు తమ సీఈవోను కాపాడుకోలేకపోయిందని ది ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ (ఐఐఏఎస్) వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బోర్డులో చేరేలా ఇన్ఫీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకనిని సంస్థ ఒప్పించాలని సూచించింది. దేశ ఐటీ రంగానికి ఇన్ఫోసిస్ గుండెలాంటిది కాబట్టి నీలేకని కూడా దీన్ని కార్పొరేట్ ఉద్యోగంలాగా భావించకుండా తన వంతు కృషి చేయాలని పేర్కొంది. ‘ఎప్పటికప్పుడు టెక్నాలజీలో మారిపోయే కొత్త ధోరణులను ఆయన అందిపుచ్చుకున్నారు. దేశాన్ని డిజిటలైజ్ చేయడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు అధికారుల్లోను, అంతర్జాతీయంగా నాయకులతోనూ ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. పైగా ఇన్ఫీ ఆవిర్భావం నుంచి ఉన్నందున.. ఇటు కంపెనీ సంస్కృతితో పాటు అటు వ్యవస్థాపకుల ఆలోచనా ధోరణులపై ఆయనకు మంచి అవగాహన ఉంటుంది‘ అని ఐఐఏఎస్ తెలిపింది. ఇన్ఫీ గెలుపు.. భవిష్యత్‌లో దేశీ ఐటీ పరిశ్రమ దిశానిర్దేశాన్ని సూచించగలదని ఐఐఏఎస్ తెలిపింది. మరోవైపు, సిక్కా సారథ్యంలో కంపెనీ మెరుగ్గా రాణించినప్పటికీ.. 2020 నాటికల్లా 20 బిలియన్ డాలర్ల ఆదాయమంటూ ఆయన స్వయంగా విధించుకున్న లక్ష్యానికి దరిదాపుల్లో లేదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ హెడ్ (పీసీజీ విభాగం) వీకే శర్మ వ్యాఖ్యానించారు. అటు ప్రస్తుత పరిణామాల ప్రభావం తాత్కాలికమేనని సమస్యలను అధిగమించి ఇన్ఫీ స్టాక్ మళ్లీ పుంజుకోగలదని ఏంజెల్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్ విభాగం) సరబ్జిత్ కౌర్ నంగ్రా అభిప్రాయపడ్డారు. -
విరబూసిన తెలుగు పద్మాలు
పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం రాష్ట్రం నుంచి పద్మ అవార్డులకు ఆరుగురు ఎంపిక ఏపీ నుంచి ఇద్దరికి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రం అత్యున్నత పౌర పురస్కారాలైన ‘పద్మ’ అవార్డులను బుధవారం ప్రకటించింది. ఇందులో తెలంగాణకు ఆరు, ఏపీకి రెండు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. తెలంగాణ నుంచి దరిపల్లి రామయ్య(సామాజిక సేవ), బీవీఆర్ మోహన్‌రెడ్డి(వర్తకం, వాణిజ్యం), త్రిపురనేని హనుమాన్ చౌదరి(సివిల్ సర్వీస్), డాక్టర్ ఎక్కా యాదగిరిరావు(కళలు–శిల్పకళ), డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ వహీద్, చంద్రకాంత్ పితావ(సైన్స్, ఇంజనీరింగ్) పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఏపీ నుంచి చింతకింది మల్లేశం(సైన్స్, ఇంజనీరింగ్), వి.కోటేశ్వరమ్మ ఎంపికయ్యారు. వీరిలో హనుమాన్ చౌదరి ఏపీకి, చింతకింది మల్లేశం తెలంగాణకు చెందినవారు. కేంద్రం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో అచ్చు తప్పుల వల్ల హనుమాన్ చౌదరి తెలంగాణ, మల్లేశం ఏపీకి చెందిన వారని పొరపాటున వచ్చిందని సీఎం కార్యాలయం ఈ మేరకు తెలిపింది. విషయాన్ని అధికారులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. పద్మ పురస్కారాలకు ఎంపికైనవారికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. వారంతా తమ రంగాల్లో విశేష ప్రతిభ చూపి దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. చేనేత ఆణిముత్యం.. మల్లేశం సాక్షి, యాదాద్రి: టై అండ్ డై చేనేత పరిశ్ర మలో కార్మికుల కష్టాలను తీర్చేం దుకు ఆసుయంత్రం రూపొందించిన చిం తకింది మల్లేశం స్వస్థలం యాదాద్రి భువ నగిరి జిల్లా ఆలేరు మండలం శారాజీపేట. 1972 మే 10న లక్ష్మి, లక్ష్మీనారాయణ దంపతుల కు జన్మించిన ఈయన పదో తరగతి వరకు చదివారు. తనకు పద్మశ్రీ రావడంపట్ల సంతోషం వ్యక్తంచేశారు. అవార్డును మహి ళా చేనేత కార్మికులకు అంకితం చేస్తున్నట్టు తెలి పారు. ‘‘నేను చేనేత కార్మికుడిగా పని చేస్తున్న ప్పుడు మా అమ్మ పట్టుచీరల తయారీకి ఆసుపై చిటికీ పోసేది. ఈ సమయంలో కొన్ని వందలసార్లు చెయ్యి వెనక్కి ముందుకు ఆడిస్తూ చిటికీ పోయ డం వల్ల అనారోగ్యానికి గురవుతూ ఎంతో బాధపడేది. ఇది ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఎలాగైనా ఈ కష్టాన్ని దూరం చేయాలన్న ఆలోచన కలిగింది. మా అమ్మలాంటి ఎందరో మహిళలు ఇబ్బందిని దూరం చేయాలన్న ఆలోచనతోనే ఆలోచించి రేయింబవళ్లు కష్టపడి ఆసుయంత్రాన్ని తయారు చేశా’’ అని ఆయన వివరించారు. యంత్రాన్ని తయారు చేసేందుకు ఏడు సంవత్సరాలు పట్టిందని చెప్పారు. తెలంగాణ అమరవీరులకు అంకితం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత శిల్ప కళకు మొట్టమొదటిసారి సముచితమైన గౌరవం లభించింది. పద్మశ్రీ రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ అవార్డును తెలంగాణ అమర వీరులకు అంకితం ఇస్తున్నాను. ఆధునిక శిల్ప రీతులకు పునాదులు వేసిన ఉస్మాన్ సిద్ధిఖి నా గురువు. ఆయన స్ఫూర్తితోనే నా శిల్పాల్లో భావరూపకల్పన కొనసాగించాను. నేను చెక్కిన మొట్టమొదటి శిల్పం ‘మిథుల’జాతీయ అవార్డులను అందుకుంది. ఆ తర్వాత శివరాంపల్లి పోలీసు అకాడమీలో ప్రతిష్టించిన శిల్పంలో పోలీసుల ‘దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు’ప్రతీకగా పద్మాన్ని, అభయహస్తాన్ని, ఉదయించే సూర్యుణ్ణి, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే గదతో రూపొందించాను. ఆ తర్వాత లాల్‌దర్వాజ కూడలిలో ఏర్పాటు చేసిన నెహ్రూ శిల్పం, తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన అమరవీరుల జ్ఞాపకార్ధం చెక్కిన స్థూపం నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. పేరు: డాక్టర్ ఎక్కా యాదగిరిరావు స్వస్థలం: అలియాబాద్, హైదరాబాద్ పుట్టిన తేదీ: 21 జూలై, 1938 భార్య: శ్యామలాదేవి(చనిపోయారు) కొడుకులు: సంజయ్, విజయ్, కూతురు: సంధ్య ప్రస్తుత నివాసం: శారదానగర్, గుడి మల్కాపూర్ విద్యార్హత: ఫైన్ఆర్ట్స్లో డిప్లొమా మార్పే పురస్కారం తెచ్చింది.. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన హనుమాన్ చౌదరి చిన్నతనంలోనే కమ్యునిజం భావాలకు ఆకర్షితులయ్యా రు. ఇది సరైన మార్గం కాదని ఆ తర్వాత దేశభక్తి మార్గంలో పయనించారు. దేవుని కంటే దేశాన్ని ప్రేమించాలని నమ్మారు. టెక్నాలజీలో మార్పు తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే తనకు పద్మశ్రీ పురస్కారం లభిచేందుకు దోహదపడిందని త్రిపురనేని చెప్పారు. తనకు అవార్డు లభించడంపై సంతోషం వ్యక్తం చేశారు. పేరు: త్రిపురనేని హనుమాన్‌చౌదరి పుట్టిన తేదీ: 18 అక్టోబర్ 1931 స్వస్థలం: కృష్ణా జిల్లా అంగళూరు ప్రస్తుత నివాసం: సికింద్రాబాద్ ఖార్జానా, పీ అండ్ టీ కాలనీ భార్యపేరు: త్రిపురనేని మణి సంతానం: ప్రభాకర్ చౌదరి, మహీధర్ చౌదరి రచించిన పుస్తకాలు:20, వ్యాసాలు: 200 విద్యా ప్రదాతకు పద్మశ్రీ లబ్బీపేట (విజయవాడ): కృష్ణాజిల్లా గోసాలకు చెందిన కోనేరు వెంకయ్య, కోనేరు మీనాక్షి దంపతులకు 1925 మార్చి 5వ తేదీన కోటేశ్వరమ్మ జన్మించారు. ఆంధ్రా వర్సిటీలో ఎంఏ తెలుగు, నాగార్జున విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేశారు. 1955లో 20 మంది విద్యార్థులతో విజయవాడ బందరు రోడ్డు ఆలిండియా రేడియే స్టేషన్ ఎదుట బాలల పాఠశాల (మాంటిస్సోరి) ఏర్పాటు చేశారు. 1972లో మాంటిస్సోరి మహిళా జూనియర్, డిగ్రీ కళాశాల ప్రారంభించిన కోటేశ్వరమ్మ వెనుతిరిగి చూడలేదు. ఈమె భర్త వేగే వెంకట కృష్ణారావు, కుమార్తెలు డాక్టర్ ఎ.శశిబాల, షీలారంజని. కేంద్రం పద్మ పురస్కారం ఇచ్చినందుకు సంతోషంగా ఉందని అమె చెప్పారు. అణు పరికరాల్లో అందెవేసిన చేయి దేశంలోని అణు విద్యుత్ ప్లాంట్లకు అవసరమయ్యే కీలక పరికరాల తయారీలో చంద్రకాంత్ పితావా విశేష సేవలు అందించారు. గతంలో ముంబైలోని బాబా అటా మిక్ పరిశోధన కేంద్రం(బార్క్)లోని ఎలక్టాన్రిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగానికి డైరెక్ట ర్గా పనిచేశారు. రిటైర్మెంట్ అనంతరం ప్రస్తుతం హైదరాబాద్ ఈసీఐఎల్, బార్క్‌లో సేవలందిస్తున్నారు. తనకు పద్మశ్రీ రావడంపై ఆయన సంతోషం వ్యక్తంచేశారు. వాణిజ్య పద్మం బీవీఆర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : సైయంట్ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్‌రెడ్డిని పద్మశ్రీ పురస్కారం వరించింది. భారత ఐటీ సేవల సంస్థల్లో టాప్–15లో సైయంట్ ఒకటి. ఫార్చూన్ 100 కంపెనీల కు కీలక ఇంజనీరింగ్ సేవలను అందిస్తోంది. కంపెనీని ఈ స్థాయికి చేర్చడంలో ఆయన ఎనలేని కృషి చేశారు. ప్రపంచవ్యాప్తంగా 38 కేంద్రాల్లో 14,000 పైచిలుకు ఉద్యోగులు సంస్థలో పనిచేస్తున్నారు. టర్నోవర్ రూ.3,500 కోట్లు. ప్రతిష్టాత్మక సంస్థ నాస్కాం చైర్మన్‌గానూ ఆయన పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ గౌరవ కాన్సుల్‌గా ఉన్నారు. జర్మనీ నుంచి భారత్‌లో ఈ గౌరవం దక్కిన రెండో భారతీయుడు మోహన్‌రెడ్డి కావడం విశేషం. హైదరాబాద్ ఏంజెల్స్ వ్యవస్థాపకులు కూడా ఈయనే. దేశంలో అతిపెద్ద ఇంక్యుబేటర్ టి–హబ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ లీడర్షిప్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ అవార్డుకు ఎంపికైన తొలి భారతీయుడు మోహన్‌రెడ్డి. దేశంలో ఇంజనీరింగ్ పరిశోధన, అభివృద్ధి పరిశ్రమ ఏర్పాటుకు అందించిన సేవలకు గుర్తింపు గా ప్రభుత్వం తనను పద్మ అవార్డుకు ఎంపిక చేసిందని ఈ సందర్భంగా మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. స్థిరమైన అంతర్జాతీయ కంపెనీగా సైయంట్‌ను తీర్చిదిద్దిన తొలి తరం పారిశ్రామికవేత్తకు గుర్తింపు అని అన్నారు. యునానీ వైద్యానికి గౌరవం హైదరాబాద్‌లో వందల ఏళ్లుగా ప్రాచూర్యంలో ఉన్న యునానీ వైద్యానికి ఈ ఏడాది సముచితమైన గౌరవం లభించిందని యునానీ వైద్య రంగంలో అపారమైన అనుభవం కలిగిన డాక్టర్ మహ్మద్ అబ్దుల్ వాహెద్ అన్నారు. తనకు పద్మశ్రీ పురస్కారం లభించడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. పేరు: డాక్టర్ మహ్మద్ అబ్దుల్ వాహేద్ పుట్టిన తేదీ: 22 ఫిబ్రవరి 1955 విద్యాభ్యాసం: 1978లో ఉస్మానియా నుంచి యూనానీ మెడిసిన్ అండ్ సర్జరీ కోర్సు పూర్తి క్లీనికల్ రీసెర్చ్ చేసిన కేంద్రాలు: యూనివర్సిటీ ఆఫ్ లాస్ ఏంజెల్స్, ఎయిమ్స్, కెమ్ మెడికల్ కాలేజీ హోదా: మాజీ డైరెక్టర్ సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్(హైదరాబాద్) సమర్పించిన పరిశోధన పత్రాలు: 33 జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితం. 64 సదస్సుల్లో పేపర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ‘వనజీవి’కి వందనం సాక్షి, ఖమ్మం: చిన్నతనంలో మాస్టారు ‘మొక్కల పెంపకం.. లాభాలు’ గురించి చెప్పారు. అదే ఆయనలో కోటికి పైగా మొక్కలు నాటిన సంకల్పానికి బీజం వేసిం ది. ఆయన అడుగు పెట్టిన చోటల్లా హరితవనమే అయింది. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు పలు ప్రాంతా లు తిరుగుతూ మొక్కలు నాటించడమే ఆయన ధ్యేయం. ‘వృక్షో రక్షతి.. రక్షితః’ అనే బోర్డులు తలకు పెట్టుకొని, చేత పట్టుకొని తాను మొక్కలు నాటుతూ ప్రచా రం చేస్తారు. ఇలా ఆయన 43 ఏళ్లుగా నాటిన మొక్కలు ఖమ్మం, మహబూబా బాద్ జిల్లాలో కోటికి పైగా ఉంటాయి. ఇప్పటికే ఎన్నో అవార్డులు వరించాయి. తాజాగా పద్మశ్రీ(సామాజిక సేవ విభాగం) కూడా ఆయన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆయనే ఖమ్మం జిల్లా రెడ్డిపల్లికి చెందిన దరిపెల్లి రామయ్య. 75 ఏళ్ల వయసులోనూ భార్య జానకమ్మతో కలసి ఆయన హరితయజ్ఞం చేస్తూనే ఉన్నారు. రామయ్య స్వగ్రామం ముత్తగూడెం. పంట పొలాలు రెడ్డిపల్లిలో ఉండటంతో చిన్నప్పుడే ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. రామయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. ముత్తగూడెం పాఠశాలలోనే 5వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ సమయంలో ఉపాధ్యాయుడు మల్లేశం ప్రబోధించిన ‘మొక్కల పెంపకం’ పాఠం రామయ్యను ఎంతగానో ప్రభావితం చేసింది. అప్పట్నుంచే మొక్కల నాటడాన్ని యజ్ఞంలా ప్రారంభించారు. వృత్తిరీత్యా కుండలు చేస్తూ, పాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వన రక్షణపై ఆయన ఇప్పటికి వెయ్యికి పైగా వన సూక్తులు, 315 శిల్పాలపై మొక్కల చరిత్ర చెక్కారు. -
నాస్కామ్ చైర్మన్‌గా బీవీఆర్ మోహన్‌రెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ ఇంజనీరింగ్ సేవల సంస్థ సైయంట్ వ్యవస్థాపకుడు బీవీఆర్ మోహన్‌రెడ్డి 2015-16 సంవత్సరానికి గాను సాఫ్ట్వేర్ సంస్థల సమాఖ్య నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్‌గా బుధవారం ఎంపికయ్యారు. ఇప్పటిదాకా ఈ స్థానంలో ఆర్.చంద్రశేఖరన్ ఉన్నారు. ఏప్రిల్ 9న మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపడతారు. ఇక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా.. టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ ఎంపికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కేవలం పెద్ద సంస్థలే కాకుండా చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎస్ఎంఈ), స్టార్టప్స్‌కి ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేస్తానని మోహన్‌రెడ్డి తెలిపారు. 100 బిలియన్ డాలర్ల దేశీ ఐటీ-బీపీఎం పరిశ్రమకు నాస్కామ్ ప్రాతినిధ్యం వహిస్తోంది. -
ఇన్ఫోటెక్ ఇక సైయంట్
- 3-5 ఏళ్లలో బిలియన్ డాలర్లకు - ప్రత్యేక గుర్తింపుకై పేరు మార్పు - ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్‌ను 1991లో స్థాపించాను. పెట్టుబడి రూ.20 లక్షలు. 6 వేల మంది వాటాదారులున్నారు. నేడు కంపెనీ మార్కెట్ విలువ రూ.4,000 కోట్లకు చేరుకుంది. వాటాదారుల పెట్టుబడికి విలువ చేకూర్చాం. మూడు నుంచి ఐదేళ్లలో బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదుగుతాం. ఈ లక్ష్యంతోపాటు నిర్వహణ లాభం పెంపు, కస్టమర్లు, ఉద్యోగుల సంతృప్తి కూడా మాకు ముఖ్యం అని అంటున్నారు సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి. సంస్థ నూతన పేరు సైయంట్ లిమిటెడ్‌ను అధికారికంగా ప్రకటించిన అనంతరం బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఇన్ఫోటెక్ పేరు సాధారణంగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా నూతన అధ్యాయం రాసేందుకే పేరు మార్చినట్టు పేర్కొన్నారు. సైన్స్, క్లయింట్, ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ల సమ్మేళనమే సైయంట్‌గా అభివర్ణించారు. 12 రంగాల్లో సేవలందిస్తున్నట్టు చెప్పారు. ఇంజనీరింగ్, నెట్వర్క్స్, ఆపరేషన్స్ ఇలా ఆరు విభాగాల్లో నాయకత్వ స్థానంలో ఉన్నట్టు తెలిపారు. మొత్తం ఆదాయంలో 98 శాతం పాత క్లయింట్ల నుంచే సమకూరుతోందని వివరించారు. ఈ ఏడాదీ నియామకాలు.. గత ఆర్థిక సంవత్సరంలో సైయంట్ నికరంగా 1,500 మందిని నియమించింది. 2014-15లో 1,500-1,800 మందిని నియమించనుంది. మూడేళ్లలో కాకినాడ కేంద్రంలో ఉద్యోగుల సంఖ్యను ప్రస్తుతమున్న 1,000 నుంచి 2 వేలకు పెంచనున్నారు. వైజాగ్ కేంద్రంలో 300 మంది ఉద్యోగులున్నారు. రెండేళ్లలో 700 మందిని అదనంగా జతచేయనున్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి 500-600 మంది ఫ్రెషర్లను కంపెనీలోకి తీసుకుంటామని సైయంట్ ఎండీ, సీఈవో కృష్ణ బోదనపు సాక్షి బిజినెస్ బ్యూరోకు చెప్పారు. సిబ్బందిని ఇబ్బడిముబ్బడిగా చేర్చుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదని మోహన్‌రెడ్డి అన్నారు. ఒక ఉద్యోగి ద్వారా 30 వేల డాలర్ల ఆదాయాన్ని కంపెనీలు ఆశిస్తాయి. ఇప్పు డు ప్రపంచవ్యాప్తంగా క్లయింట్ల వ్యాపార విధానాలు మారిపోయాయి. ఏటా నికరంగా ఎంత మందిని నియమించుకునేది చెప్పలేమన్నారు. మంచి నాయకత్వంతోనే.. సాఫ్ట్వేర్ రంగం గత మూడేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా మందకొడిగా ఉంది. విభజన కారణంగా హైదరాబాద్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. విభజన ప్రక్రియ పూర్తి అయింది కాబట్టి రానున్న రోజుల్లో సాఫ్ట్‌వేర్‌కు మంచి రోజులొస్తాయి. దూరదృష్టి ఉన్న నాయకత్వంతోనే ఇది సాధ్యపడుతుందని మోహన్‌రెడ్డి అన్నారు. ‘సీమాంధ్రలో వైజాగ్‌తోపాటు ఇతర ప్రధాన నగరాలు అంతర్జాతీయంగా అనుసంధానమవ్వాలి. మంచి పాఠశాలలు, ఆధునిక వైద్యం అందుబాటులోకి రావాలి. అప్పుడే ఉద్యోగులు పనిచేసేందుకు, అలాగే పెట్టుబడి పెట్టేందుకు కంపెనీలు ముందుకు వస్తాయి. హైదరాబాద్ మాదిరిగా ఈ ప్రాంతంలోనూ అభివృద్ధి సాధ్యపడుతుంది. మాల్స్, మల్టీప్లెక్స్లున్న నగరాల్లో పని చేయడానికే ఉద్యోగులు ఉత్సాహం కనబరుస్తున్నారు. అమెరికా, యూరప్, ఆస్ట్రాలాసియా మార్కెట్లు ఇప్పుడు స్థిరంగా ఉన్నాయని మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రతిపాదిత ఐటీఐఆర్‌లో పెట్టుబడులు రావాలంటే మెట్రో రైల్ వంటి మౌలిక వసతులు అభివృద్ధి చెందాలని అభిప్రాయపడ్డారు. -
ఇన్ఫోటెక్ లాభం రూ.69.39 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన ఐటీ సేవల సంస్థ ఇన్ఫోటెక్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఆదాయంలో 22 శాతం, నికరలాభంలో 12 శాతం వృద్ధిని కనపర్చింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ.475 కోట్ల నుంచి రూ. 578 కోట్లకు చేరగా, నికరలాభం రూ. 62 కోట్ల నుంచి రూ. 69 కోట్లకు చేరింది. గత నాలుగు త్రైమాసికాలుగా ఆదాయంలో ఎటువంటి వృద్ధి లేకుండా స్థిరంగా ఉన్నప్పటికీ, ఈ త్రైమాసికంలో గణనీయమైన వృద్ధిని నమోదు చేశామని, రానున్న కాలంలో కూడా ఇదే వృద్ధిని నమోదు చేయగలమన్న ధీమాను ఇన్ఫోటెక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ బి.వి.ఆర్ మోహన్ రెడ్డి తెలిపారు. మొత్తం నాలుగు విభాగాల పనితీరు బాగున్నప్పటికీ మూడు విభాగాలు రికార్డుస్థాయి వృద్ధిని నమోదు చేశాయన్నారు. యూరప్ బాగుంది: సమీక్షా కాలంలో యూరప్ ఆదాయంలో 10 శాతం, అమెరికా ఆదాయంలో 7 శాతం వృద్ధిని ఇన్ఫోటెక్ నమోదు చేసింది. మొత్తం మీద ఆదాయంలో చూస్తే ఆమెరికా వాటా తగ్గి యూరప్ వాటా పెరిగింది. సమీక్షా కాలంలో మొత్తం ఆదాయంలో అమెరికా వాటా 61 శాతం నుంచి 57 శాతానికి తగ్గితే, యూరప్ వాటా 25 నుంచి 29 శాతానికి పెరిగింది. ఈ త్రైమాసికంలో కొత్తగా 11 మంది కస్టమర్లు వచ్చి చేరగా, 801 మంది ఉద్యోగులను తీసుకున్నట్లు మోహన్ రెడ్డి తెలిపారు. ఉద్యోగం వదిలివెళ్ళిన వారిని పరిగణనలోకి తీసుకుంటే నికరంగా 319 మందిని తీసుకున్నట్లు చెప్పారు. మార్కెట్ అంచనాలను మించి ఫలితాలను ఇవ్వడంతో గురువారం ఎన్ఎస్ఈలో ఇన్ఫోటెక్ షేరు భారీ ట్రేడింగ్ పరిమాణంతో 5 శాతం పెరిగి రూ.347 వద్ద ముగిసింది. -
ఆశావహంగా 2014
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముగిసిన 2013తో పోలిస్తే నూతన సంవత్సరం ఆశావహంగా ఉండగలదని ఐటీ ఇంజినీరింగ్ సర్వీసుల సంస్థ ఇన్ఫోటెక్ సీఎండీ బీవీఆర్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కేంద్రంలో క్రియాశీలకమైన ప్రభుత్వం ఏర్పడటం, రూపాయి స్థిరపడటం, కరెంటు ఖాతా లోటు త గ్గడం, రాష్ట్ర విభజన పరిష్కారం కావడం వంటి సానుకూల పరిణామాలు చోటుచేసుకోగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2013 భారత్ సహా, ప్రపంచ దేశాలకు మిశ్రమంగా సాగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రూపాయి పతనంతో ఎగుమతి కంపెనీలకు కాస్త లాభించినా.. దిగుమతి సంస్థలు సమస్యలు ఎదుర్కొన్నాయని, వృద్ధి గణనీయంగా క్షీణించిందని పేర్కొన్నారు. ఇటు విభజన అంశంతో రాష్ట్రంలో అనిశ్చితి తలెత్తిందని తెలిపారు. కొత్త సంవత్సరంలో సమస్యలన్నీ తొలగి సానుకూల పరిస్థితులు నెలకొనగలవని ఆకాంక్షిస్తున్నట్లు వివరించారు. -
ఉన్నత లక్ష్యం నిద్రపోనివ్వదు
సాక్షి, హైదరాబాద్: ‘ఉన్నత లక్ష్యం మనిషిని నిద్ర పోనివ్వదు. దాన్ని సాధించేవరకు వెంటాడుతూనే ఉంటుంది’ అని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. నానక్‌రాంగూడ ఐటీజోన్‌లోని మైక్రోసాఫ్ట్ సంస్థలో గురువా రం రాత్రి నిర్వహించిన శిక్షణా కార్యక్రమం ‘లీడర్షిప్’లో ఆయన ప్రసంగించారు. ఉన్నత లక్ష్యం, సాధించే తపన, మార్గాన్వేషణ, వైఫల్యాన్ని ఎదుర్కొనే ధైర్యం, నిర్ణయాధికారం, పారదర్శకత, పనిపై పరిపూర్ణ అవగాహన, ఉత్తమ నిర్వహణ, ఓర్పు... ఈ తొమ్మిది లక్షణాలున్నవారు ఉత్తమ నాయకులుగా ఎదగడానికి అవకాశముంటుందన్నారు. సమస్యలున్నవారు ప్రపంచమంతా ఉంటారని, కానీ లక్ష్యంతో ముందుకుసాగేవారు కొంతమందే ఉంటారన్నారు. వారే విజయం సాధిస్తారన్నారు. డీఆర్డీఏ, ఇస్రో శాస్త్రవేత్తగా పయనం, భారత రాష్ట్రపతిగా విధి నిర్వహణ.. ఇవన్నీ యాదృశ్ఛికంగా రాలేదని, వాటి వెనుక ఎన్నో ఎదురు దెబ్బలున్నాయన్నారు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ డెవలపర్ డివిజన్ కార్పొరేట్ వైస్‌ప్రెసిడెంట్ ఎస్.సోమసెగర్ పాల్గొన్నారు. అంధత్వ నివారణకు మరింత కృషిచేయాలి బంజారాహిల్స్: శాస్త్రీయ పద్ధతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, గ్రామీణ ప్రాంతాల్లో అంధత్వ నివారణకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలో ప్రవేశపెట్టిన ‘సృ జన: ఇన్నోవేషన్ ఎల్వీపీఈఐ’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ ఎండోమెంట్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ ఐ కేర్, ఎంఐటీ మీడియా ల్యాబ్‌ల సహకారంతో ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తేవడం అభినందనీయమని కలాం అన్నారు. దీని ద్వారా అంధత్వానికి గురవుతున్న చాలా మందికి లబ్ది చేకూరుతుందన్నారు. నేటి విద్యార్థుల్లోని సృజన వినియోగించుకొని, వారి ఆలోచనలు అమల్లో పెట్టడం ద్వారా మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు రూపొందించిన వివిధ నమూనాలను ఆయన పరిశీలించారు. ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ చైర్మన్ గుళ్లపల్లి ఎన్. రావు మాట్లాడుతూ... ఎంఐటీలోని టాటా సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ డిజైన్, హైదరాబాద్‌లోని బిట్స్ పిలాని, పెర్కిన్స్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ ఈ వర్క్‌షాప్‌లో భాగస్వాములన్నారు. ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, సృజన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ డాక్టర్ వీరేంద్ర సంగ్వాన్, ఎంఐటీ మీడియా ల్యాబ్ అసోసియేట్ ప్రొఫెసర్ రమేష్ రస్కర్ పాల్గొన్నారు.