విరబూసిన తెలుగు పద్మాలు | Six from Telangana to receive Padma Shri awards | Sakshi
Sakshi News home page

విరబూసిన తెలుగు పద్మాలు

Published Thu, Jan 26 2017 2:45 AM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM

విరబూసిన తెలుగు పద్మాలు

విరబూసిన తెలుగు పద్మాలు

పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
రాష్ట్రం నుంచి పద్మ అవార్డులకు ఆరుగురు
ఎంపిక  ఏపీ నుంచి ఇద్దరికి


గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రం అత్యున్నత పౌర పురస్కారాలైన ‘పద్మ’ అవార్డులను బుధవారం ప్రకటించింది. ఇందులో తెలంగాణకు ఆరు, ఏపీకి రెండు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. తెలంగాణ నుంచి దరిపల్లి రామయ్య(సామాజిక సేవ), బీవీఆర్‌ మోహన్‌రెడ్డి(వర్తకం, వాణిజ్యం), త్రిపురనేని హనుమాన్‌ చౌదరి(సివిల్‌ సర్వీస్‌), డాక్టర్‌ ఎక్కా యాదగిరిరావు(కళలు–శిల్పకళ), డాక్టర్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ వహీద్, చంద్రకాంత్‌ పితావ(సైన్స్, ఇంజనీరింగ్‌) పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఏపీ నుంచి చింతకింది మల్లేశం(సైన్స్, ఇంజనీరింగ్‌), వి.కోటేశ్వరమ్మ ఎంపికయ్యారు. వీరిలో హనుమాన్‌ చౌదరి ఏపీకి, చింతకింది మల్లేశం తెలంగాణకు చెందినవారు. కేంద్రం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో అచ్చు తప్పుల వల్ల హనుమాన్‌ చౌదరి తెలంగాణ, మల్లేశం ఏపీకి చెందిన వారని పొరపాటున వచ్చిందని సీఎం కార్యాలయం ఈ మేరకు తెలిపింది. విషయాన్ని అధికారులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. పద్మ పురస్కారాలకు ఎంపికైనవారికి సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. వారంతా తమ రంగాల్లో విశేష ప్రతిభ చూపి దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.

చేనేత ఆణిముత్యం.. మల్లేశం
సాక్షి, యాదాద్రి: టై అండ్‌ డై చేనేత పరిశ్ర మలో కార్మికుల కష్టాలను తీర్చేం దుకు ఆసుయంత్రం రూపొందించిన చిం తకింది మల్లేశం స్వస్థలం యాదాద్రి భువ నగిరి జిల్లా ఆలేరు మండలం శారాజీపేట. 1972 మే 10న లక్ష్మి, లక్ష్మీనారాయణ దంపతుల కు జన్మించిన ఈయన పదో తరగతి వరకు చదివారు. తనకు పద్మశ్రీ రావడంపట్ల సంతోషం వ్యక్తంచేశారు. అవార్డును మహి ళా చేనేత కార్మికులకు అంకితం చేస్తున్నట్టు తెలి పారు. ‘‘నేను చేనేత కార్మికుడిగా పని చేస్తున్న ప్పుడు మా అమ్మ పట్టుచీరల తయారీకి ఆసుపై చిటికీ పోసేది. ఈ సమయంలో కొన్ని వందలసార్లు చెయ్యి వెనక్కి ముందుకు ఆడిస్తూ చిటికీ పోయ డం వల్ల అనారోగ్యానికి గురవుతూ ఎంతో బాధపడేది. ఇది ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఎలాగైనా ఈ కష్టాన్ని దూరం చేయాలన్న ఆలోచన కలిగింది. మా అమ్మలాంటి ఎందరో మహిళలు ఇబ్బందిని దూరం చేయాలన్న ఆలోచనతోనే ఆలోచించి రేయింబవళ్లు కష్టపడి ఆసుయంత్రాన్ని తయారు చేశా’’ అని ఆయన వివరించారు. యంత్రాన్ని తయారు చేసేందుకు ఏడు సంవత్సరాలు పట్టిందని చెప్పారు.

తెలంగాణ అమరవీరులకు అంకితం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత శిల్ప కళకు మొట్టమొదటిసారి సముచితమైన గౌరవం లభించింది. పద్మశ్రీ రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ అవార్డును తెలంగాణ అమర వీరులకు అంకితం ఇస్తున్నాను. ఆధునిక శిల్ప రీతులకు పునాదులు వేసిన ఉస్మాన్‌ సిద్ధిఖి నా గురువు. ఆయన స్ఫూర్తితోనే నా శిల్పాల్లో భావరూపకల్పన కొనసాగించాను. నేను చెక్కిన మొట్టమొదటి శిల్పం ‘మిథుల’జాతీయ అవార్డులను అందుకుంది. ఆ తర్వాత శివరాంపల్లి పోలీసు అకాడమీలో ప్రతిష్టించిన శిల్పంలో పోలీసుల ‘దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు’ప్రతీకగా పద్మాన్ని, అభయహస్తాన్ని, ఉదయించే సూర్యుణ్ణి, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే గదతో రూపొందించాను. ఆ తర్వాత లాల్‌దర్వాజ కూడలిలో ఏర్పాటు చేసిన నెహ్రూ శిల్పం, తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన అమరవీరుల జ్ఞాపకార్ధం చెక్కిన స్థూపం నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.
పేరు: డాక్టర్‌ ఎక్కా యాదగిరిరావు

స్వస్థలం: అలియాబాద్, హైదరాబాద్‌
పుట్టిన తేదీ: 21 జూలై, 1938
భార్య: శ్యామలాదేవి(చనిపోయారు)
కొడుకులు: సంజయ్, విజయ్,
కూతురు: సంధ్య
ప్రస్తుత నివాసం: శారదానగర్, గుడి మల్కాపూర్‌
విద్యార్హత: ఫైన్‌ఆర్ట్స్‌లో డిప్లొమా

మార్పే పురస్కారం తెచ్చింది..
వ్యవసాయ కుటుంబంలో జన్మించిన హనుమాన్‌ చౌదరి చిన్నతనంలోనే కమ్యునిజం భావాలకు ఆకర్షితులయ్యా రు. ఇది సరైన మార్గం కాదని ఆ తర్వాత దేశభక్తి మార్గంలో పయనించారు. దేవుని కంటే దేశాన్ని ప్రేమించాలని నమ్మారు. టెక్నాలజీలో మార్పు తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే తనకు పద్మశ్రీ పురస్కారం లభిచేందుకు దోహదపడిందని త్రిపురనేని చెప్పారు. తనకు అవార్డు లభించడంపై సంతోషం వ్యక్తం చేశారు.

పేరు: త్రిపురనేని హనుమాన్‌చౌదరి
పుట్టిన తేదీ: 18 అక్టోబర్‌ 1931
స్వస్థలం: కృష్ణా జిల్లా అంగళూరు
ప్రస్తుత నివాసం: సికింద్రాబాద్‌ ఖార్జానా, పీ అండ్‌ టీ కాలనీ
భార్యపేరు: త్రిపురనేని మణి
సంతానం: ప్రభాకర్‌ చౌదరి, మహీధర్‌ చౌదరి
రచించిన పుస్తకాలు:20,
వ్యాసాలు: 200

విద్యా ప్రదాతకు పద్మశ్రీ
లబ్బీపేట (విజయవాడ): కృష్ణాజిల్లా గోసాలకు చెందిన కోనేరు వెంకయ్య, కోనేరు మీనాక్షి దంపతులకు 1925 మార్చి 5వ తేదీన కోటేశ్వరమ్మ జన్మించారు. ఆంధ్రా వర్సిటీలో ఎంఏ తెలుగు, నాగార్జున విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశారు. 1955లో 20 మంది విద్యార్థులతో విజయవాడ బందరు రోడ్డు ఆలిండియా రేడియే స్టేషన్‌ ఎదుట బాలల పాఠశాల (మాంటిస్సోరి) ఏర్పాటు చేశారు. 1972లో మాంటిస్సోరి మహిళా జూనియర్, డిగ్రీ కళాశాల ప్రారంభించిన కోటేశ్వరమ్మ వెనుతిరిగి చూడలేదు. ఈమె భర్త వేగే వెంకట కృష్ణారావు, కుమార్తెలు డాక్టర్‌ ఎ.శశిబాల, షీలారంజని. కేంద్రం పద్మ పురస్కారం ఇచ్చినందుకు సంతోషంగా ఉందని అమె చెప్పారు.

అణు పరికరాల్లో అందెవేసిన చేయి
 దేశంలోని అణు విద్యుత్‌ ప్లాంట్లకు అవసరమయ్యే కీలక పరికరాల తయారీలో చంద్రకాంత్‌ పితావా విశేష సేవలు అందించారు. గతంలో ముంబైలోని బాబా అటా మిక్‌ పరిశోధన కేంద్రం(బార్క్‌)లోని ఎలక్టాన్రిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగానికి డైరెక్ట ర్‌గా పనిచేశారు. రిటైర్మెంట్‌ అనంతరం ప్రస్తుతం హైదరాబాద్‌ ఈసీఐఎల్, బార్క్‌లో సేవలందిస్తున్నారు. తనకు పద్మశ్రీ రావడంపై ఆయన సంతోషం వ్యక్తంచేశారు.

వాణిజ్య పద్మం బీవీఆర్‌
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో : సైయంట్‌ వ్యవస్థాపకులు బీవీఆర్‌ మోహన్‌రెడ్డిని పద్మశ్రీ పురస్కారం వరించింది. భారత ఐటీ సేవల సంస్థల్లో టాప్‌–15లో సైయంట్‌ ఒకటి. ఫార్చూన్‌ 100 కంపెనీల కు కీలక ఇంజనీరింగ్‌ సేవలను అందిస్తోంది. కంపెనీని ఈ స్థాయికి చేర్చడంలో ఆయన ఎనలేని కృషి చేశారు. ప్రపంచవ్యాప్తంగా 38 కేంద్రాల్లో 14,000 పైచిలుకు ఉద్యోగులు సంస్థలో పనిచేస్తున్నారు. టర్నోవర్‌ రూ.3,500 కోట్లు. ప్రతిష్టాత్మక సంస్థ నాస్కాం చైర్మన్‌గానూ ఆయన పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ఫెడరల్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ జర్మనీ గౌరవ కాన్సుల్‌గా ఉన్నారు. జర్మనీ నుంచి భారత్‌లో ఈ గౌరవం దక్కిన రెండో భారతీయుడు మోహన్‌రెడ్డి కావడం విశేషం. హైదరాబాద్‌ ఏంజెల్స్‌ వ్యవస్థాపకులు కూడా ఈయనే. దేశంలో అతిపెద్ద ఇంక్యుబేటర్‌ టి–హబ్‌ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్స్‌ లీడర్‌షిప్‌ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ అవార్డుకు ఎంపికైన తొలి భారతీయుడు మోహన్‌రెడ్డి. దేశంలో ఇంజనీరింగ్‌ పరిశోధన, అభివృద్ధి పరిశ్రమ ఏర్పాటుకు అందించిన సేవలకు గుర్తింపు గా ప్రభుత్వం తనను పద్మ అవార్డుకు ఎంపిక చేసిందని ఈ సందర్భంగా మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. స్థిరమైన అంతర్జాతీయ కంపెనీగా సైయంట్‌ను తీర్చిదిద్దిన తొలి తరం పారిశ్రామికవేత్తకు గుర్తింపు అని అన్నారు.

యునానీ వైద్యానికి గౌరవం
హైదరాబాద్‌లో వందల ఏళ్లుగా ప్రాచూర్యంలో ఉన్న యునానీ వైద్యానికి ఈ ఏడాది సముచితమైన గౌరవం లభించిందని యునానీ వైద్య రంగంలో అపారమైన అనుభవం కలిగిన డాక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ వాహెద్‌ అన్నారు. తనకు పద్మశ్రీ పురస్కారం లభించడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

పేరు: డాక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ వాహేద్‌
పుట్టిన తేదీ: 22 ఫిబ్రవరి 1955
విద్యాభ్యాసం: 1978లో ఉస్మానియా నుంచి యూనానీ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ కోర్సు పూర్తి
క్లీనికల్‌ రీసెర్చ్‌ చేసిన కేంద్రాలు: యూనివర్సిటీ ఆఫ్‌ లాస్‌ ఏంజెల్స్, ఎయిమ్స్, కెమ్‌ మెడికల్‌ కాలేజీ
హోదా: మాజీ డైరెక్టర్‌ సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యునానీ మెడిసిన్‌(హైదరాబాద్‌)
సమర్పించిన పరిశోధన పత్రాలు: 33 జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితం. 64 సదస్సుల్లో పేపర్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు.

‘వనజీవి’కి వందనం
సాక్షి, ఖమ్మం:  చిన్నతనంలో మాస్టారు ‘మొక్కల పెంపకం.. లాభాలు’ గురించి చెప్పారు. అదే ఆయనలో కోటికి పైగా మొక్కలు నాటిన సంకల్పానికి బీజం వేసిం ది. ఆయన అడుగు పెట్టిన చోటల్లా హరితవనమే అయింది. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు పలు ప్రాంతా లు తిరుగుతూ మొక్కలు నాటించడమే ఆయన ధ్యేయం. ‘వృక్షో రక్షతి.. రక్షితః’ అనే బోర్డులు తలకు పెట్టుకొని, చేత పట్టుకొని తాను మొక్కలు నాటుతూ ప్రచా రం చేస్తారు. ఇలా ఆయన 43 ఏళ్లుగా నాటిన మొక్కలు ఖమ్మం, మహబూబా బాద్‌ జిల్లాలో కోటికి పైగా ఉంటాయి. ఇప్పటికే ఎన్నో అవార్డులు వరించాయి. తాజాగా పద్మశ్రీ(సామాజిక సేవ విభాగం) కూడా ఆయన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆయనే ఖమ్మం జిల్లా రెడ్డిపల్లికి చెందిన దరిపెల్లి రామయ్య. 75 ఏళ్ల వయసులోనూ భార్య జానకమ్మతో కలసి ఆయన హరితయజ్ఞం చేస్తూనే ఉన్నారు. రామయ్య స్వగ్రామం ముత్తగూడెం. పంట పొలాలు రెడ్డిపల్లిలో ఉండటంతో చిన్నప్పుడే ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. రామయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. ముత్తగూడెం పాఠశాలలోనే 5వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ సమయంలో ఉపాధ్యాయుడు మల్లేశం ప్రబోధించిన ‘మొక్కల పెంపకం’ పాఠం రామయ్యను ఎంతగానో ప్రభావితం చేసింది. అప్పట్నుంచే మొక్కల నాటడాన్ని యజ్ఞంలా ప్రారంభించారు. వృత్తిరీత్యా కుండలు చేస్తూ, పాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వన రక్షణపై ఆయన ఇప్పటికి వెయ్యికి పైగా వన సూక్తులు, 315 శిల్పాలపై మొక్కల చరిత్ర చెక్కారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement