ఉన్నత లక్ష్యం నిద్రపోనివ్వదు | Former President Abdul Kalam | Sakshi
Sakshi News home page

ఉన్నత లక్ష్యం నిద్రపోనివ్వదు

Published Sat, Oct 26 2013 4:20 AM | Last Updated on Mon, Aug 20 2018 3:02 PM

Former President Abdul Kalam

సాక్షి, హైదరాబాద్: ‘ఉన్నత లక్ష్యం మనిషిని నిద్ర పోనివ్వదు. దాన్ని సాధించేవరకు వెంటాడుతూనే ఉంటుంది’ అని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. నానక్‌రాంగూడ ఐటీజోన్‌లోని మైక్రోసాఫ్ట్ సంస్థలో గురువా రం రాత్రి నిర్వహించిన శిక్షణా కార్యక్రమం ‘లీడర్‌షిప్’లో ఆయన ప్రసంగించారు. ఉన్నత లక్ష్యం, సాధించే తపన, మార్గాన్వేషణ, వైఫల్యాన్ని ఎదుర్కొనే ధైర్యం, నిర్ణయాధికారం, పారదర్శకత, పనిపై పరిపూర్ణ అవగాహన, ఉత్తమ నిర్వహణ, ఓర్పు... ఈ తొమ్మిది లక్షణాలున్నవారు ఉత్తమ నాయకులుగా ఎదగడానికి అవకాశముంటుందన్నారు.

సమస్యలున్నవారు ప్రపంచమంతా ఉంటారని, కానీ లక్ష్యంతో ముందుకుసాగేవారు కొంతమందే ఉంటారన్నారు. వారే విజయం సాధిస్తారన్నారు. డీఆర్‌డీఏ, ఇస్రో శాస్త్రవేత్తగా పయనం, భారత రాష్ట్రపతిగా విధి నిర్వహణ.. ఇవన్నీ యాదృశ్ఛికంగా రాలేదని, వాటి వెనుక ఎన్నో ఎదురు దెబ్బలున్నాయన్నారు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ డెవలపర్ డివిజన్ కార్పొరేట్ వైస్‌ప్రెసిడెంట్ ఎస్.సోమసెగర్ పాల్గొన్నారు.
 
అంధత్వ నివారణకు మరింత కృషిచేయాలి

బంజారాహిల్స్: శాస్త్రీయ పద్ధతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, గ్రామీణ ప్రాంతాల్లో అంధత్వ నివారణకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలో ప్రవేశపెట్టిన ‘సృ జన: ఇన్నోవేషన్ ఎల్వీపీఈఐ’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్ ఎండోమెంట్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ ఐ కేర్, ఎంఐటీ మీడియా ల్యాబ్‌ల సహకారంతో ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తేవడం అభినందనీయమని కలాం అన్నారు. దీని ద్వారా అంధత్వానికి గురవుతున్న చాలా మందికి లబ్ది చేకూరుతుందన్నారు.

నేటి విద్యార్థుల్లోని సృజన వినియోగించుకొని, వారి ఆలోచనలు అమల్లో పెట్టడం ద్వారా మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు రూపొందించిన వివిధ నమూనాలను ఆయన పరిశీలించారు. ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ చైర్మన్ గుళ్లపల్లి ఎన్. రావు మాట్లాడుతూ... ఎంఐటీలోని టాటా సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ డిజైన్, హైదరాబాద్‌లోని బిట్స్ పిలాని, పెర్కిన్స్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ ఈ వర్క్‌షాప్‌లో భాగస్వాములన్నారు. ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, సృజన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ డాక్టర్ వీరేంద్ర సంగ్వాన్, ఎంఐటీ మీడియా ల్యాబ్ అసోసియేట్ ప్రొఫెసర్ రమేష్ రస్కర్ పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement