హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముగిసిన 2013తో పోలిస్తే నూతన సంవత్సరం ఆశావహంగా ఉండగలదని ఐటీ ఇంజినీరింగ్ సర్వీసుల సంస్థ ఇన్ఫోటెక్ సీఎండీ బీవీఆర్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కేంద్రంలో క్రియాశీలకమైన ప్రభుత్వం ఏర్పడటం, రూపాయి స్థిరపడటం, కరెంటు ఖాతా లోటు త గ్గడం, రాష్ట్ర విభజన పరిష్కారం కావడం వంటి సానుకూల పరిణామాలు చోటుచేసుకోగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2013 భారత్ సహా, ప్రపంచ దేశాలకు మిశ్రమంగా సాగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రూపాయి పతనంతో ఎగుమతి కంపెనీలకు కాస్త లాభించినా.. దిగుమతి సంస్థలు సమస్యలు ఎదుర్కొన్నాయని, వృద్ధి గణనీయంగా క్షీణించిందని పేర్కొన్నారు. ఇటు విభజన అంశంతో రాష్ట్రంలో అనిశ్చితి తలెత్తిందని తెలిపారు. కొత్త సంవత్సరంలో సమస్యలన్నీ తొలగి సానుకూల పరిస్థితులు నెలకొనగలవని ఆకాంక్షిస్తున్నట్లు వివరించారు.