infotech
-
వర్చువల్ గలాక్సీ ఐపీవో బాట
న్యూఢిల్లీ: బీఎఫ్‌ఎస్‌ఐపై ప్రత్యేక దృష్టిపెట్టిన సాస్(ఎస్ఏఏఎస్) సేవల సంస్థ వర్చువల్ గలాక్సీ ఇన్ఫోటెక్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు వీలుగా స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ ఎమర్జ్‌కు ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది.ఐపీవోలో భాగంగా 66 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. నిధుల్లో రూ. 34 కోట్లు అదనపు అభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు, రూ. 19 కోట్లు ప్రస్తుత ప్రొడక్టుల ఆధునీకరణ, విస్తరణ తదితరాలకు వినియోగించనుంది. మరో రూ. 14 కోట్లు బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్ కార్యకలాపాలపై వెచ్చించనుంది.ఇదీ చదవండి: ఎన్ఎస్ఈ కొత్త యాప్.. తెలుగులోనూ వెబ్సైట్కాగా.. జులైలో ప్రీఐపీవో నిధుల సమీకరణలో భాగంగా సుప్రసిద్ధ ఇన్వెస్టర్ల నుంచి రూ. 21.44 కోట్లు సమకూర్చుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి ఆరు నెలల్లో(ఏప్రిల్–సెప్టెంబర్) రూ. 72 కోట్ల ఆదాయం, రూ. 19 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
17 నుంచి గుంటూరులో అగ్రి ఇన్ఫోటెక్–2021
సాక్షి, అమరావతి: వ్యవసాయంలో అత్యాధునిక సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్రంలోనే తొలిసారిగా అగ్రి ఇన్ఫోటెక్ భారీ ప్రదర్శనను నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలు సంయుక్తంగా నిర్ణయించాయి. ఈ నెల 17వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనకు గుంటూరు లాంలోని విశ్వవిద్యాలయ ప్రాంగణం వేదిక కానుంది. సుమారు 200లకు పైగా అగ్రి ఇన్ఫోటెక్ సంస్థలు ఇందులో పాల్గొననున్నాయి. టెక్నాలజీ ఆవిష్కరణ, వ్యవసాయ మెళకువలు, వాతావరణ మార్పు వంటి అంశాలు సాగు తీరుపై ఎలా ప్రభావం చూపుతాయో, వాటికి పరిష్కార మార్గాలేమిటో చెప్పడమే ఈ ప్రదర్శన లక్ష్యం. ఈ ప్రదర్శన నిర్వహణకు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి నాయకత్వంలో ఇప్పటికే ఓ కమిటీ ఏర్పాటైంది. ► అగ్రి ఇన్ఫోటెక్–2021లో పాల్గొనే వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పంటలపై అవగాహన కల్పిస్తుంది. సాగు రంగం దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సూచనలు, సలహాలు ఇస్తుంది. ► ఎరువుల నాణ్యత, వినియోగం, సేంద్రియ పద్ధతుల ఆచరణ వంటి అంశాలపై రైతుల సందేహాలను నివృత్తి చేసేలా ఈ ప్రదర్శన ఉంటుంది. ► సమీకృత పోషకాలు, తెగుళ్ల నివారణ వంటి వాటికి పరిష్కారాలను ఈ ప్రదర్శన ద్వారా అన్వేషించే ప్రయత్నం జరుగుతుంది. ► ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్, సహజ వనరుల నిర్వహణ, పర్యావరణ అనుకూలమైన వ్యవసాయ ఉత్పాదకాలు, వ్యవసాయ కూలీల కొరత వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చకు రానున్నాయి. -
ఐపీఓ పత్రాలను సమర్పించిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్
న్యూఢిల్లీ: ఎల్ అండ్ టీ ఐటీ సేవల అనుబంధ కంపెనీ ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ త్వరలో ఐపీఓకు రానున్నది. ఐపీఓ సంబంధిత ముసాయిదా పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ఈ సంస్థ సోమవారం సమర్పించింది. జీఎన్ఏ యాక్సిల్స్: ఈ కంపెనీ ఐపీఓ ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. నారాయణి స్టీల్స్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నారాయణి స్టీల్స్ కంపెనీ, ముంబైకు చెందిన గంగా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫారమ్‌లో లిస్ట్ కావడానికి సంబంధిత పత్రాలను బీఎస్ఈకి సమర్పించాయి. నారాయణి స్టీల్స్ కంపెనీ రూ.11.52 కోట్లు సమీకరించనున్నదని సమాచారం. -
మహిళా ఉద్యోగులకు కార్పొరేట్ అలర్ట్స్
ఉబర్ క్యాబ్ ఘటన నేపథ్యంలో ఈ-మెయిల్స్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహిళా ఉద్యోగుల భద్రతకు పెద్దపీట వేస్తున్న కార్పొరేట్ సంస్థలు.. అటు స్వీయ జాగ్రత్తలూ పాటించాలంటూ ఉద్యోగులకు సూచనలిస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన ఉబర్ క్యాబ్ సంఘటన నేపథ్యంలో కొన్ని కంపెనీలు మహిళా ఉద్యోగులకు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ల రూపంలో సందేశాలను చేరవేశాయి. కంపెనీ సమకూర్చే క్యాబ్స్‌ను మాత్రమే ప్రయాణానికి వినియోగించాలని ఆ సందేశాల్లో సూచిస్తున్నాయి. ఒకవేళ ఇతర వాహనాల్లో ప్రయాణించాల్సి వస్తే వాహనం నంబరును రాసుకుని, సంబంధీకులకు ఆ నంబరును చేరవేయాలని గుర్తు చేశాయి. అయితే భద్రత ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించడమేగాక, ఉద్యోగులకు తరచూ సూచనలిస్తున్నట్టు కొన్ని కంపెనీలు వెల్లడించాయి. ఈ-మెయిల్ సందేశాలు.. మహిళా ఉద్యోగులు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్యానాసోనిక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోటెక్, ఆర్పీజీ గ్రూప్, ఏజిస్, జెన్సర్ టెక్నాలజీస్ తదితర సంస్థలు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ సందేశాలను పంపించాయి. కొన్ని కంపెనీలైతే సమావేశ మందిరాల్లో ఉద్యోగులకు సూచనలు చేస్తున్నాయి. రాత్రి వేళ త్వరగా పని ముగించుకుని, అవసరమైతే మర్నాడు ముందుగా రావాలని ఉద్యోగులకు సూచిస్తున్నట్టు హైసియా ప్రెసిడెంట్, ప్రోగ్రెస్ సాఫ్ట్వేర్ ఇండియా ఎండీ రమేశ్ లోగనాథన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. భద్రత చర్యలు, స్వీయ రక్షణ గురించి హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) తరఫున అన్ని వేదికలపైనా చెబుతున్నామని అన్నారు. ‘కొన్ని క్యాబ్ కంపెనీలను నిషేధిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇంత వరకు బాగానే ఉంది. వేలాది అనధికార క్యాబ్స్ రోడ్లపై తిరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశమే’ అని అన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడాలని అభిప్రాయపడ్డారు. అలర్ట్స్ కొత్తేమీ కాదు.. భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు ఉద్యోగులకు గుర్తు చేస్తున్నట్టు ఎయిర్టెల్ తెలిపింది. ప్రతి శుక్రవారం అందరు ఉద్యోగులకు భద్రతపరమైన సందేశాలు పంపిస్తున్నామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ‘రాత్రి 8 లోపే పనులను ముగిం చుకోవాలని మహిళా ఉద్యోగులకు చెబుతున్నాం. రాత్రి 8 తర్వాత వెళ్లేవారికి కంపెనీ కారులో గార్డు రక్షణతో పంపిస్తున్నాం. 10 ఏళ్ల నుంచి ఒకే క్యాబ్ ఆపరేటర్ సేవలందిస్తున్నారు. వాహనాలు, భద్రత ఏర్పాట్లను క్యాబ్ ఆపరేటర్‌తో కలసి తరచూ సమీక్షిస్తున్నాం’ అని వెల్లడించారు. ఉద్యోగుల భద్రత చర్యలు నిరంతర ప్రక్రియ అని టీఎంఐ గ్రూప్ డీజీఎం అపర్ణా రెడ్డి తెలిపారు. స్వీయ రక్షణ విషయంలో ఉద్యోగులకు కంపెనీ నుంచి అలర్ట్స్ కొత్తేమీ కాదన్నారు. -
సైయంట్ నికర లాభం రూ. 68 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ సర్వీసుల కంపెనీ సైయంట్ (గతంలో ఇన్ఫోటెక్) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసిక నికర లాభంలో 26 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2013-14 తొలి త్రైమాసికంలో రూ.54 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ. 68 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఆదాయం 28 శాతం వృద్ధితో రూ. 483 కోట్ల నుంచి రూ. 621 కోట్లకు పెరిగింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా త్రైమాసిక ఆదాయం 100 మిలియన్ డాలర్ల మార్కును అందుకుందని, కొత్త కంపెనీలను టేకోవర్ చేయడం వంటివి లేకుండానే ఈ మార్కును అందుకున్నామని సైయంట్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో కృష్ణ భోధనపు పేర్కొన్నారు. ఈ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని యూనిట్లు మంచి పనితీరు కనపర్చాయని, ముఖ్యంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 12.3 శాతం వృద్ధి నమోదయ్యిందన్నారు. సమీక్షాకాలంలో నిర్వహణా లాభం తగ్గడంపై కృష్ణ స్పందిస్తూ డాలరు విలువ క్షీణత, జీతాల పెంపుతో మార్జిన్లపై ఒత్తిడి ఉందని, రానున్న కాలంలో మార్జిన్లు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమీక్షా కాలంలో నికరంగా 445 మంది ఉద్యోగులను చేర్చుకోగా, ఇంజనీరింగ్ విభాగంలో ఆరుగురు, డీఎన్‌వో విభాగంలో ముగ్గురు క్లెయింట్లు చేరారు. విమాన విడిభాగాల ప్రదర్శన కేంద్రం అతర్జాతీయంగా విమాన ఇంజన్ల తయారీలో పేరొందిన ప్రాట్ అండ్ విట్నీ(పీడబ్ల్యూ)తో కలిసి సైయంట్ హైదరాబాద్‌లో విమాన విఢిభాగాల ప్రదర్శన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎక్స్పీరియన్స్ కేంద్రంలో పీడబ్ల్యూ 4090 భారీ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్‌తో పాటు, వివిధ కంపెనీలకు చెందిన విమాన తయారీ యంత్రాలను ప్రదర్శనకు ఉంచారు. మణికొండలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సైయంట్ చైర్మన్ బి.వి.ఆర్.మోహన్ రెడ్డితో పాటు, పీడబ్ల్యూ వైస్ ప్రెసిడెంట్ జయంత్ సబనీస్లు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ పూర్తిస్థాయి విమాన విడిభాగాలను నేరుగా చూడటం ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులు మరింతగా నాలెడ్జ్‌ను పెంచుకునే అవకాశం కలుగుతుందన్నారు. -
ఆశావహంగా 2014
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముగిసిన 2013తో పోలిస్తే నూతన సంవత్సరం ఆశావహంగా ఉండగలదని ఐటీ ఇంజినీరింగ్ సర్వీసుల సంస్థ ఇన్ఫోటెక్ సీఎండీ బీవీఆర్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కేంద్రంలో క్రియాశీలకమైన ప్రభుత్వం ఏర్పడటం, రూపాయి స్థిరపడటం, కరెంటు ఖాతా లోటు త గ్గడం, రాష్ట్ర విభజన పరిష్కారం కావడం వంటి సానుకూల పరిణామాలు చోటుచేసుకోగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2013 భారత్ సహా, ప్రపంచ దేశాలకు మిశ్రమంగా సాగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రూపాయి పతనంతో ఎగుమతి కంపెనీలకు కాస్త లాభించినా.. దిగుమతి సంస్థలు సమస్యలు ఎదుర్కొన్నాయని, వృద్ధి గణనీయంగా క్షీణించిందని పేర్కొన్నారు. ఇటు విభజన అంశంతో రాష్ట్రంలో అనిశ్చితి తలెత్తిందని తెలిపారు. కొత్త సంవత్సరంలో సమస్యలన్నీ తొలగి సానుకూల పరిస్థితులు నెలకొనగలవని ఆకాంక్షిస్తున్నట్లు వివరించారు.