
న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం గ్రూప్ ఫిబ్రవరిలో సానుకూల ఫలితాన్ని ఇచ్చింది. ఈ నెలలో గ్రూప్ వృద్ధి 5.3 శాతంగా నమోదయ్యింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ)లో గ్రూప్ వాటా దాదాపు 41 శాతం. జనవరిలో ఈ ఎనిమిది పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు 6.1 శాతంకాగా, 2017 ఫిబ్రవరిలో కేవలం 0.6 శాతం. తాజా సమీక్ష గణాంకాలను చూస్తే... ఎనిమిది పరిశ్రమల్లో రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, సిమెంట్ రంగాలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. అధికారిక గణాంకాలను వేర్వేరుగా చూస్తే...
క్షీణత నుంచి భారీ వృద్ధిలోకి 3...
♦ రిఫైనరీ ప్రొడక్టులు: 2017 ఏడాది ఫిబ్రవరి నెలలోలో అసలు వృద్ధిలేకపోగా, మైనస్ 2.8 శాతం క్షీణతలో ఉన్న ఈ విభాగం 2018 ఫిబ్రవరిలో ఏకంగా 7.8 శాతం పెరిగింది.
♦ ఎరువులు: ఈ రంగం కూడా –4 శాతం క్షీణత నుంచి 5.3 శాతం వృద్ధికి చేరింది.
♦ సిమెంట్: –15.8 శాతం క్షీణత నుంచీ 22.9 శాతం వృద్ధి బాటకు మళ్లింది.
వృద్ధిలోనే 3...
♦ బొగ్గు: వృద్ధి 1.4 శాతంగా నమోదయ్యింది. అయితే 2017 ఇదే నెలలో వృద్ధి రేటు 6.6 శాతం.
♦ స్టీల్: ఈ రంగంలో కూడా వృద్ధి రేటు 8.7 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది.
♦ విద్యుత్: వృద్ధి రేటు 1.2 శాతం నుంచి 4 శాతానికి పెరిగింది.
క్షీణతలోనే 2...
♦ క్రూడ్ ఆయిల్: క్షీణతలోనే ఉంది. అయితే ఇది –3.4% క్షీణత నుంచి –2.4 శాతానికి తగ్గింది.
♦ సహజ వాయువు: –2.1 శాతం క్షీణత –1.5 శాతానికి తగ్గింది.
ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకూ డౌన్...
2017–18 ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకూ ఎనిమిది రంగాలనూ చూస్తే, వృద్ధి రేటు 4.7 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గింది.