
న్యూఢిల్లీ: లాజిస్టిక్స్ రంగానికి కూడా మౌలిక రంగ హోదా కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక పార్కులు, కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు, రవాణా మొదలైనవన్నీ ఈ విభాగంలోకి వస్తాయి. మౌలిక రంగంలో ఉపవిభాగాల కింద ’రవాణా’కి ’లాజిస్టిక్స్’ని కూడా జోడించిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం ఈ మేరకు సవరించిన నిబంధనలపై ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.
మౌలిక రంగ హోదా లభించడంతో ఇక లాజిస్టిక్స్ సంస్థలు తక్కువ వడ్డీలకు దీర్ఘకాలిక రుణాలు పొందే వీలు కలుగుతుంది. దేశీయంగా ఎగుమతులకు సంబంధించి లాజిస్టిక్స్ వ్యయాలు భారీగా ఉంటుండటంతో... భారతీయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం కనీసం రూ.50 కోట్ల పెట్టుబడి సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండే మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రా కిందకి వస్తాయి.
అలాగే, కనీసం రూ. 15 కోట్ల పెట్టుబడి గల కోల్డ్ స్టోరేజీలు, రూ. 25 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ ఉన్న గిడ్డంగులు మొదలైన వాటికి కూడా ఇది వర్తిస్తుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న కేంద్రం.. గత కొన్నాళ్లుగా రవాణా, లాజిస్టిక్స్‌పై ప్రధానంగా దృష్టి పెట్టడం తెలిసిందే. రహదారులు.. వంతెనలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వే ట్రాక్‌లు, టన్నెల్స్ వంటివన్నీ రవాణా, లాజిస్టిక్స్‌లోకి వస్తాయి.
పరిశ్రమ వర్గాల హర్షం..
ప్రభుత్వ నిర్ణయాన్ని పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. దీంతో తక్కువ వడ్డీలకే తాము రుణాలు సమీకరించుకునేందుకు వీలు లభిస్తుందని, సరుకు రవాణా చార్జీలు తగ్గేందుకు ఇది తోడ్పడగలదని తెలిపాయి. వ్యయాల పరంగా చూస్తే లాజిస్టిక్స్ సంస్థలకు కనీసం 50 బేసిస్ పాయింట్ల మేర ప్రయోజనం చేకూరగలదని అవశ్య సీసీఐ లాజిస్టిక్స్ (ప్రైవేట్ దిగ్గజం ఆల్‌కార్గో హోల్డింగ్ సంస్థ) చీఫ్ దీపల్ షా తెలిపారు. దీనితో పారిశ్రామిక పార్కులు, వేర్‌హౌస్‌లలోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయని, వినియోగం కూడా భారీ గా పెరగగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
వృద్ధికి ఊతం..
ఇన్‌ఫ్రా హోదాతో లాజిస్టిక్స్ రంగ సంస్థలకు రుణ సౌలభ్యం మెరుగుపడగలదని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఇది తయారీ రంగ వృద్ధితో పాటు దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడగలదని తెలిపింది. ఇతర సంపన్న దేశాలతో పోలిస్తే భారత్‌లో లాజిస్టిక్స్ వ్యయాలు అత్యధికంగా ఉన్నాయని.. తాజా చర్యతో ఇటు దేశీయంగా ఈ రంగానికి తోడ్పాటు లభించడంతో పాటు అంతర్జాతీయంగాను డిమాండ్ మెరుగుపడగలదని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్‌ఫ్రా హోదా ఊతంతో.. లాజిస్టిక్స్ రంగ సంస్థలు విదేశీ వాణిజ్య రుణాలను, బీమా కంపెనీలు..పెన్షన్ ఫండ్స్ నుంచి దీర్ఘకాలిక రుణాలను సమీకరించుకోగలవని వివరించింది. ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కంపెనీ (ఐఐఎఫ్‌సీఎల్) నుంచి కూడా ఈ సంస్థలు రుణాలు తీసుకోవచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment