అంతర్జాతీయ ట్రెండ్‌ ఆధారం | International Trend basis on stock markets | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ ట్రెండ్‌ ఆధారం

Published Mon, Nov 5 2018 2:01 AM | Last Updated on Mon, Nov 5 2018 2:01 AM

International Trend basis on stock markets - Sakshi

న్యూఢిల్లీ: రూపాయి రికవరీ, చమురు ధరలు దిగిరావడం, అమెరికా–చైనా మధ్య సయోధ్యకు అవకాశాలు, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆ దేశం నుంచి చమురు దిగుమతులకు భారత్‌కు అవకాశం కల్పించడం, గత వారం మార్కెట్‌ను లాభాల బాట పట్టించాయి. అయితే, ఈ వారంలో అమెరికాలో జరగబోయే ఎన్నికలు, ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయం వంటి అంశాల ఆధారంగా నెలకొనే అంతర్జాతీయ ట్రెండ్‌ మన మార్కెట్‌కు కీలకం కానుందని, అలాగే రూపాయి, చమురు ధరల కదలికలు కూడా మార్కెట్ల గమ్యాన్ని నిర్ణయించనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు సోమవారం నుంచే అమల్లోకి రానున్నాయి. కాకపోతే భారత్‌ సహా ఎనిమిది దేశాలకు అమెరికా మినహాయింపులు ఇవ్వడం కాస్త ఊరట. అయితే, దీని ప్రభావం ప్రపంచ మార్కెట్లపై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం ఒక్కరోజే రూపాయి 100 పైసలు బలపడి డాలర్‌తో 72.45కు చేరిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం రాత్రి ఆఫ్‌షోర్‌ మార్కెట్లో రూపాయి తిరిగి 73 దిగువకు పడిపోయింది. సర్వీసుల రంగంపై పీఎంఐ డేటా సోమవారం వెలువడనుంది. ఈ వారంలో స్టాక్‌ మార్కెట్‌ మూడు రోజులే పనిచేయనుంది. దీపావళి సందర్భంగా బుధవారం (7వ తేదీ), దీపావళి బలిప్రతిపాద సందర్భంగా గురువారం మార్కెట్లు పనిచేయవు.  

ఈ వారంలో కీలక పరిణామాలు
సోమవారం సేవల రంగానికి సంబంధించి పీఎంఐ గణాంకాలు విడుదల కానున్నాయి. ఇవి మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. బుధ, గురువారాల్లో జరిగే అమెరికా ఫెడ్‌ భేటీలో వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాన్ని కూడా మార్కెట్లు పరిశీలించనున్నాయి. వడ్డీ రేట్లపై నిర్ణయం మన దేశ కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి వెలువడుతుంది. ఎస్‌బీఐ, బాష్, సిప్లా, గెయిల్, ఇండియన్‌ బ్యాంకు, పవర్‌గ్రిడ్‌ తదితర కంపెనీలు ఫలితాలను ప్రకటించనున్నాయి.

‘‘ఇరాన్‌పై ఆంక్షలతో ఈ వారం ఆరంభం కానుంది. తర్వాత అమెరికా లెజిస్లేటివ్‌ ఎన్నికలు, మన కార్పొరేట్‌ ఎన్నికల ఫలితాలు వంటి అంశాలు ఉన్నాయి. దీపావళి కారణంగా మార్కెట్‌ మూడ్‌ ఉత్సాహంగానే ఉండనుంది. ఇన్వెస్టర్లు అప్రమత్తతతో వ్యవహరించాలి’’ అని ఈక్విటీ99 సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ రాహుల్‌శర్మ తెలిపారు. ‘‘అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందితే దేశీయ మార్కెట్లకు మంచి అంశం అవుతుంది. చమురు ధరలు ఇటీవల తగ్గడంతో సెంటిమెంట్‌ సానుకూలంగా మారింది. ఐఐపీ, ద్రవ్యోల్బణం గణాంకాలు ఈ నెల రెండో వారంలో రానున్నాయి. సెలవు రోజులు కావడంతో ట్రేడింగ్‌ పరిమితంగా ఉంటుంది’’ అని ఎపిక్‌ రీసెర్చ్‌ సీవో ముస్తఫా నదీమ్‌ తెలిపారు.


7న ముహూరత్‌ ట్రేడింగ్‌
దీపావళి సందర్భంగా ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ ఈ నెల 7న ముహరత్‌ ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు ఇరు ఎక్సేంజ్‌ల్లో సాధారణ రోజుల్లో మాదిరిగానే ట్రేడింగ్‌ ఉంటుంది.

ఎఫ్‌పీఐల నిధుల ఉపసంహరణ రెండేళ్ల గరిష్టానికి
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) అక్టోబర్‌ నెలలో రూ.38,900 కోట్ల మేర పెట్టుబడులను భారత క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.28,921 కోట్లు, డెట్‌ మార్కెట్ల నుంచి రూ.9,979 కోట్ల మేర ఉపసంహరించుకున్నారు. 2016 నవంబర్‌లో రూ. 39,396 కోట్ల ఉపసంహరణ తర్వాత... గరిష్ట స్థాయిలో ఉపసంహరణ గత నెలలోనే జరిగింది. ఇక ఈ ఏడాదిలో ఇప్పటి వరకు విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి వెనక్కి తీసేసుకున్న మొత్తం రూ.లక్ష కోట్లకు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement