ఆర్థిక ఫలితాలపై ఇన్వెస్టర్ల దృష్టి
మార్కెట్‌కు దిశా నిర్దేశం
* ఇన్ఫోసిస్ శుభారంభం
* నేడు టీసీఎస్ ఫలితాలు...
* ఈ వారంలోనే విప్రో,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు కూడా...
న్యూఢిల్లీ: కంపెనీల గత ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. వీటితో పాటు సోమవారం వెలువడే టోకు ధరల(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, రూపాయి, ముడి చమురు ధరల కదలికలు కూడా తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు.
మహావీర్ జయంతి సందర్భంగా మంగళవారం(ఏప్రిల్ 19) సెలవు కావడంతో ఈ వారంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానున్నది. అంబేద్కర్ జయంతి సందర్బంగా గురు, శ్రీరామ నవమి సందర్భంగా శుక్రవారం సెలవు కావడంతో గత వారంలో మూడు రోజులే ట్రేడింగ్ జరిగింది.
ఇన్ఫోసిస్, టీసీఎస్‌లపై దృష్టి
అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించినందున ఇన్ఫోసిస్, వ్యాపార రహస్యాల చోరీ కేసులో అమెరికా ఫెడరల్ కోర్ట్ రూ.6,000 కోట్ల జరిమానా నిర్ణయం, క్యూ4 ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో టీసీఎస్ షేర్లపై సోమవారం అందరి దృష్టి పడనున్నదని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ఇక ఈ వారంలోనే విప్రో(ఏప్రిల్ 20), ఇండస్‌ఇంద్ బ్యాంక్(21న), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(22న)లు క్యూ4 ఫలితాలను ప్రకటిస్తాయి.
వెలుగులో వ్యవసాయ షేర్లు
రానున్న రోజుల్లో కంపెనీల ఆర్థిక ఫలితాలే మార్కెట్‌కు కీలకమని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా పేర్కొన్నారు. సగటు కంటే అధికంగానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాల కారణంగా వ్యవసాయ షేర్లపై దృష్టి ఉంటుందని వివరించారు. వర్షాలు బాగా కురుస్తాయన్న అంచనాలు, రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం, ప్రోత్సాహకర పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, చైనా గణాంకాలు ఆశావహంగా ఉండడం, రష్యా, సౌదీ అరేబియాల మధ్య చమురు ఉత్పత్తి నియంత్రణ నిమిత్తమై ఒప్పందం నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడం.. గత వారంలో మార్కెట్ సెంటిమెంట్‌పై సానుకూల ప్రభావం చూపాయని నిపుణులు పేర్కొన్నారు.
మూడు రోజులే ట్రేడింగ్ జరిగిన గత వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీలు 4 శాతం వరకూ పెరిగాయి. సెన్సెక్స్ 953 పాయింట్లు (3.86 శాతం)లాభపడి 25,627 పాయింట్లు, నిఫ్టీ 295 పాయింట్లు(3.91 శాతం) లాభపడి 7,850 పాయింట్ల వద్ద ముగిశాయి.
వంద కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు...
భారత మార్కెట్‌పై విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు వరుసగా రెండో నెలలో కూడా కొనసాగుతోంది. ఈ నెలలో ఇప్పటిదాకా మన క్యాపిటల్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు 130 కోట్ల డాలర్లకుపైగా పెట్టుబడులు పెట్టారు.