ఐవోసీ లాభం రూ. 2,523 కోట్లు
న్యూఢిల్లీ: ఆయిల్ రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో రూ. 2,523 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో రూ. 3,093 కోట్ల నికర నష్టాలు నమోదయ్యాయి. ప్రధానంగా విదేశీ మారక లాభాలు నష్టాల నుంచి బయటపడేందుకు కారణమైనట్లు కంపెనీ చైర్మన్ బి.అశోక్ చెప్పారు.
గతంలో ఈ పద్దుకింద రూ. 4,024 కోట్ల నష్టం నమోదుకాగా, తాజాగా రూ. 128 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు తెలిపారు. కాగా, ఈ కాలంలో పన్నులకు రూ. 1,028 కోట్లను కేటాయించామని, గతంలో వీటికి ఎలాంటి కేటాయింపులు చేపట్టలేద ని తెలిపారు. అయితే ఆర్‌బీఐ కరెన్సీ స్వాప్ విండో ద్వారా రూ. 745 కోట్లు, రైట్‌బ్యాక్ ద్వారా రూ. 348 కోట్లు, రూ. 556 కోట్లమేర వడ్డీ వ్యయాల్లో ఆదా వంటి అంశాలు లాభాలను సాధించేందుకు దోహదపడినట్లు వివరించారు.
రూ. 15,328 కోట్ల ఆదాయ నష్టాలు
ప్రస్తుత సమీక్షా కాలంలో ప్రభుత్వ నియంత్రిత ధరల్లో డీజిల్, ఎల్‌పీజీ, కిరోసిస్ అమ్మకాలవల్ల రూ. 15,328 కోట్ల ఆదాయ నష్టాలు వాటిల్లినట్లు కంపెనీ తెలిపింది. అయితే ఇందుకు ప్రభుత్వం నుంచి రూ. 6,076 కోట్లు, ఓఎన్‌జీసీ వంటి ఉత్పాదక సంస్థల నుంచి రూ. 8,107 కోట్లు సబ్సిడీగా లభించినట్లు వెల్లడించింది.
సబ్సిడీలు సకాలంలో అందడంతో కొంతమేర రుణాలను తిరిగి చెల్లించడం ద్వారా రూ. 556 కోట్లమేర వడ్డీ వ్యయాలను తగ్గించుకున్నట్లు అశోక్ చెప్పారు. వెరసి కంపెనీ రుణభారం రూ. 86,263 కోట్ల నుంచి రూ. 68,953 కోట్లకు తగ్గినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కంపెనీ షేరు 3.6% ఎగసి రూ. 341 వద్ద ముగిసింది.