
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘యాపిల్’ తాజాగా ఐఫోన్ ధరలను పెంచింది. దీంతో పలు మోడళ్లపై ధరలు గరిష్టంగా 4.3 శాతం వరకు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మార్ట్‌ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కంపెనీ పలు మోడళ్లపై ధరలు పెంచింది. యాపిల్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం.. ఐఫోన్ ఎక్స్ (256 జీబీ వేరియంట్) గరిష్ట విక్రయ ధర (ఎంఆర్‌పీ) రూ.3,720 పెరుగుదలతో రూ.1,05,720కి ఎగసింది.
ఐఫోన్ 8 ప్లస్ (256 జీబీ వేరియంట్) ధర రూ.2,750 మేర పెరిగింది. దీంతో దీని ధర రూ.88,750కు చేరింది. ఐఫోన్ 6 (32 జీబీ వేరియంట్) ధర కూడా రూ.1,280 పెరుగుదలతో రూ.30,780కి ఎగసింది. ధరల పెరుగదల అన్ని మోడళ్లకు వర్తిస్తుందని, అయితే ఐఫోన్ ఎస్‌ఈకి మాత్రం మినహాయింపునిచ్చామని కంపెనీ తెలిపింది. కాగా యాపిల్ కంపెనీ ఐఫోన్ ఎస్‌ఈని భారత్‌లోనే తయారుచేస్తోన్న విషయం తెలిసిందే.