ఈ ఏడాది జోరుగా ఐపీఓ మార్కెట్
న్యూఢిల్లీ: భారత ఐపీఓ మార్కెట్ ఈ ఏడాది జోరుగా ఉంది. ఈ ఏడాది 83 కంపెనీలు ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా 380 కోట్ల డాలర్ల నిధులు సమీకరించాయి. ఇన్వెస్టర్ల విశ్వాసం అధికంగా ఉండడం, నిబంధనల్లో సంస్కరణల కారణంగా ఈ ఏడాది ఐపీఓ మార్కెట్ జోరుగా ఉందని ఎర్నస్ట్ అండ్ యంగ్(ఈవై) తాజా నివేదిక పేర్కొంది. మదుపు వాతావరణంలో మార్పులు కొనసాగుతుండడం, జీఎస్‌టీ అమలుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, సానుకూల రాజకీయ పరిస్థితులు, ఆర్థిక సెంటిమెంట్ బలపడడం, వ్యాపార విశ్వాసం మెరుగుపడడం, ద్రవ్యోల్బణ ఒత్తిడులు తగ్గడం, విదేశీప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం నిలకడగా ఉండడం.. వీటన్నింటి ఫలితంగా వచ్చే ఏడాది ఐపీఓ మార్కెట్ మరింత జోరుగా ఉండనున్నదని ఈ నివేదిక వివరించింది. ఈవై గ్లోబల్ ఐపీఓ ట్రెండ్స్: 2016 (క్యూ4) పేరుతో ఎర్నస్ట్ యంగ్ రూపొందించిన నివేదిక ప్రకారం..
ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో ఐపీఓల పనితీరు జోరుగా ఉంది. అంతర్జాతీయంగా చూస్తే, ఐపీఓ మార్కెట్ సమస్యాత్మకంగానే ఉంది. రాజకీయ, ఆర్థిక అనితులే దీనికి కారణం. ఫలితంగా ఈ ఏడాది ఇప్పటివరకూ ఐపీఓల సంఖ్య 16 శాతం తగ్గి 1,055కు పడిపోయింది. ఈ ఐపీఓల ద్వారా సమీకరించిన నిధులు గత ఏడాది నిధులతో పోల్చితే 33 శాతం తగ్గి 13,250 కోట్ల డాలర్లకు పడిపోయాయి. రంగాల వారీగా చూస్తే, పారిశ్రామిక, టెక్నాలజీ, ఫార్మా రంగాల్లో అత్యధికంగా ఐపీఓలు వచ్చాయి.