హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దాదాపు రూ. 45 వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన ల్యాంకో ఇన్‌ఫ్రా సంస్థ... కష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి కనిపించటం లేదు. దివాలా పరిష్కార ప్రణాళికలో భాగంగా ఈ సంస్థను కొనుగోలు చేసేందుకు త్రివేణి ఎర్త్‌మూవర్స్ చేసిన ప్రతిపాదనకు ల్యాంకోకు రుణాలిచ్చిన బ్యాంకుల కమిటీ అంగీకరించలేదు. దీంతో పరిష్కారానికి నియమించిన నిపుణులు.. ఈ కంపెనీని మూసివేసి, మిగిలిన ఆస్తుల విక్రయానికి (లిక్విడేషన్) అవసరమైన దరఖాస్తును నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ)లో దాఖలు చేయనున్నారు.
నిజానికి లిక్విడేషన్ నుంచి ల్యాంకో బయటపడాలంటే రుణాలిచ్చిన బ్యాంకుల్లో కనీసం 75% త్రివేణీ బిడ్‌కు అనుకూలంగా ఓటేయాలి. కానీ 15 శాతమే అనుకూలంగా ఓటేసినట్లు సమాచారం. బ్యాంకుల నిరాకరణతో పాత ప్రతిపాదనకు మార్పులు చేసి ఈ నెల 1న త్రివేణి మరో బిడ్‌ను వేసింది. చివరి రోజున ఇవ్వడంతో రుణదాతల కమిటీ దీన్ని లోతుగా పరిశీలించలేక తదుపరి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఎన్‌సీఎల్‌టీని కోరింది.
నేటితో ముగియనున్న గడువు..: ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్ బెంచ్ 2017 ఆగస్టులో ల్యాంకో బోర్డు అధికారాలను రద్దు చేసి, దివాలా ప్రక్రియ కు సావన్ గోదియావాలాను నిపుణుడిగా నియమించింది. అయితే త్రివేణి మే 1న చేసిన కొత్త ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన 270 రోజుల గడువు శుక్రవారంతో(మే 4) ముగియనుంది.
దీంతో లిక్విడేషన్ లేదా ఇతర పరి ష్కారానికి నిపుణుడు ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయిం చనున్నట్టు ల్యాంకో ఎక్సే్ఛంజీలకు తెలిపింది. అప్పు ల్లో మునిగిన 12 పెద్ద కంపెనీల్లో ల్యాంకో ఒకటి. రూ.45,000 కోట్లు పలు బ్యాంకులకు బకాయి పడింది. వీటిలో ఐసీఐసీఐకి రూ.7,380 కోట్లు, ఐడీబీఐకి రూ.3,680 కోట్లు చెల్లించాల్సి ఉంది.
75 శాతం దాకా బ్యాంకులకు రానట్టే!!
ల్యాంకో లిక్విడేషన్ ప్రక్రియ మొదలై ఒక్కో ఆస్తినీ విక్రయిస్తే... బ్యాంకులకు ఇది బకాయి పడ్డ మొత్తంలో 25 శాతమే తిరిగి రావచ్చన్నది నిపుణుల అంచనా. అలోక్ ఇండస్ట్రీస్, ఏబీజీ షిప్‌యార్డ్ తరహాలో ల్యాంకో విషయంలోనూ బ్యాంకులు 75% రుణాన్ని వదులు కోవాల్సిందేనన్నది వారి అభిప్రాయం. గతవారం ఈ రెండింటికి సంబంధించిన బిడ్‌లను కూడా తిరస్కరించడం తెలిసిందే.
అలోక్ ఇండస్ట్రీస్‌కు రూ.30,000 కోట్ల రుణాలుండగా దీని ఆస్తుల్ని విక్రయిస్తే రూ.4,500 కోట్లే వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఏబీజీ షిప్‌యార్డు కూడా రూ.18,539 కోట్లు బకాయి పడింది. దీని ఆస్తుల్ని విక్రయిస్తే రూ.2,200 కోట్లు మాత్రమే వసూలవుతాయని బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. అయితే యూకేకు చెందిన లిబర్టీ హౌస్ ఈ కంపెనీని రూ.5,400 కోట్లకు కొనుగోలు చేస్తామంటూ బిడ్ వేసినా... సదరు కంపెనీకే బోలెడన్ని అప్పులుండటంతో దాని బిడ్ అర్హత పొందే అవకాశాలు కనిపించటం లేదు.
ఆఫర్ రూ.1,400 కోట్లు..?
త్రివేణి ఎర్త్‌మూవర్స్ సంస్థ ల్యాంకో ఇన్‌ఫ్రాకు రూ.1,400 కోట్ల నగదు చెల్లించటంతో పాటు రూ.38,000 కోట్ల అప్పులను చెల్లించే బాధ్యతను కూడా తీసుకుంటామని తన బిడ్‌లో పేర్కొన్నట్లు తెలియవచ్చింది. కాగా, ఈ బిడ్‌లో తాను చెల్లిస్తానన్న నగదు మొత్తం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆస్తుల అమ్మకమే మంచిదనే అభిప్రాయం మార్కెట్ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
దివాలా ప్రక్రియలో భాగంగా కంపెనీ ఆస్తులను కొనుగోలు చేసేందుకు యూఎస్‌కు చెందిన పెన్ ఎనర్జీ, ఇంజెన్ క్యాపిటల్, సోలార్ ల్యాండ్ చైనా, కళ్యాణి డెవలపర్స్, దివ్యశ్రీ డెవలపర్స్, క్యూబ్ హైవేస్ సైతం ఆసక్తి కనబరిచాయి. ల్యాంకో ఆస్తులను ఏకమొత్తంగా కాకుండా విడివిడిగా కొనుగోలు చేసేందుకు ఇవి ముందుకొచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment