అప్పు దొరక్క ఆస్తులు అమ్ముకుంటున్న పాకిస్థాన్‌! | Pakistan Cabinet Approved Ordinance to Sell Assets to Foreign | Sakshi
Sakshi News home page

విదేశాలకు ఆస్తులు అమ్ముకుంటున్న పాకిస్థాన్‌.. అత్యవసరంగా ఆర్డినెన్స్‌!

Published Sun, Jul 24 2022 10:05 AM | Last Updated on Sun, Jul 24 2022 10:05 AM

Pakistan Cabinet Approved Ordinance to Sell Assets to Foreign - Sakshi

విదేశాలకు ఆస్తులు విక్రయించేందుకు అత్యవసరంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు పాకిస్థాన్‌ క‍్యాబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. 

ఇస్లామాబాద్‌: ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన పాకిస్థాన్‌లో దుర్భర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో దేశాన్ని సమస్యల నుంచి బయటపడేసేందుకు విదేశాలకు ఆస్తులు అమ్ముకుంటోంది. ఆస్తులు విక్రయించేందుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తూ అత్యవసరంగా ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం. అన్ని ప్రక్రియలను పక్కనపెట్టి.. రెగ్యులేటరీ తనిఖీలను సైతం తొలగించింది. ఎగవేతదారు అనే ముద్ర పడకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ‘ఇంటర్‌ గవర్నమెంటల్‌ కమర్షియల్‌ ట్రాన్సాక్షన్స్‌ ఆర్డినెన్స్-2022’ను గురువారం ఫెడరల్‌ క్యాబినెట్‌ ఆమోదించింది. దేశంలోని ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ సంస్థల షేర్లను విదేశాలకు విక్రయించటంపై దాఖలయ్యే పిటిషన్లు విచారించకుండా కోర్టులకు సైతం అవకాశం లేదని ద ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ న్యూస్‌పేపర్‌ వెల్లడించింది. 

2.5 బిలియన్‌ డాలర్ల సమీకరణ..
చమురు, గ్యాస్‌ కంపెనీలు, ప్రభుత్వ అధీనంలోని విద్యుత్తు కేంద్రాల్లో వాటాను యూఏఈకి విక్రయించేందుకు ఈ అత్యవసర ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు. సుమారు 2 బిలియన్ల నుంచి 2.5 బిలియన్ల డాలర్లు వీటి ద్వారా పొందాలని భావిస్తోంది పాకిస్థాన్‌ ప్రభుత్వం. ఈ ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. అయితే.. ఈ ఆర్డినెన్స్‌పై పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ ఇంకా సంతకం చేయకపోవటం గమనార్హం. 

గతంలోనూ రుణాలు చెల్లించే స్థితిలో పాకిస్థాన్‌ లేకపోవటం వల్ల కొత్త రుణాలు ఇచ్చేందుకు ఈ ఏడాది మే నెలలో తిరస్కరించింది యూఏఈ. అయితే.. తమ కంపెనీలు పాక్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాలని పేర్కొంది. మరోవైపు.. దేశంలోని ఏదైన సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు సుమారు 471 రోజుల సమయం పడుతుందని పాకిస్థాన్‌ ఆర్థిక మంత్రి మిఫ్తాహ్‌ ఇస్మాయిల్‌ ఇటీవల పేర్కొనటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. నిధుల సేకరణకు ప్రభుత్వం  రోజుల వ్యవధిలోనే ఒప్పందాలు పూర్తి చేయాలని సూచించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్‌) నుంచి 1.17 బిలియన్‌ డాలర్ల రుణాలు పొందటంలో విఫలమైంది. ఆర్థిక అంతరాన్ని తగ్గించేందుకు మిత్ర దేశాల నుంచి 4 బిలియన్‌ డాలర్లు సేకరించాలని ఐఎంఎఫ్‌ సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆస్తులను విక్రయించి నిధులు సమీకరించేందుకు ప్రయత్నిస్తోంది పాకిస్థాన్‌.

ఇదీ చూడండి: Pakistan: ‘మహిళలు పర్యాటక ప్రదేశాల్లోకి రావొద్దు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement