ఈ వాలెట్‌తో లాభమేనా? | Is wallet is profitable? | Sakshi
Sakshi News home page

ఈ వాలెట్‌తో లాభమేనా?

Published Mon, Aug 10 2015 12:50 AM | Last Updated on Fri, Sep 28 2018 3:31 PM

ఈ వాలెట్‌తో లాభమేనా? - Sakshi

ఈ వాలెట్‌తో లాభమేనా?

►  సొంత వాలెట్‌లతో ముందుకొస్తున్న ఈ-కామర్స్ సంస్థలు
ఇతర సంస్థలతో ఒప్పందంతో సెమీ క్లోజ్డ్ వాలెట్‌లు కూడా
భద్రత, ఈజీ వాడకం దృష్ట్యా మంచివేనంటున్న నిపుణులు
ఓపెన్ వాలెట్లలో తప్ప మిగతా వాటిలో విత్‌డ్రాకు వీలుండదు
డబ్బు ఎన్నాళ్లుంచినా వీటిపై పైసా కూడా వడ్డీ రాదు
దీని దృష్ట్యా అవసరం లేకున్నా డబ్బులు వేస్తే నష్టమేనని సూచన

బ్యాంకు ఖాతాలు అందరికీ తెలిసినవే. ఈ ఖాతాలో డబ్బులుంటే కావాల్సినపుడు తీసుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్ ఖాతా ఉంటే ఆ డబ్బులతో ఆన్‌లైన్ లావాదేవీలు కూడా చేసుకోవచ్చు. ఈ-వాలెట్ లేదా డిజిటల్ వాలెట్‌లు కూడా ఇలాంటివే. ఆన్‌లైన్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు సాయంతో వీటిలో కొంత డబ్బు డిపాజిట్ చేసుకుని, ఆన్‌లైన్ లావాదేవీలకు ఆ డబ్బును వాడుకోవచ్చు. ఒకవేళ ఇదే వాలెట్‌ను మొబైల్ ద్వారా వినియోగిస్తే దాన్ని మొబైల్ వాలెట్‌గా వ్యవహరిస్తారు. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం వ్యాలెట్లు మూడు రకాలు. క్లోజ్డ్... సెమీ క్లోజ్డ్, ఓపెన్.
 
ఓలా క్యాబ్‌ను బుక్ చేసినపుడు... ఓలా మనీతో చెల్లింపు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫరుంది... చెప్పాడు సురేష్.

పేటీఎం వాలెట్‌తో రీచార్జ్ చేయిస్తే 20 శాతం అదనపు టాక్‌టైమ్ ఇస్తారట... చెప్పాడు శ్రీనివాస్.
 

ఇవన్నీ వింటున్న అజయ్‌కి ముందు అర్థం కాలేదు. తనకు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్... ఇవన్నీ తెలుసు గానీ ఈ ఓలా మనీ... పేటీఎం వాలెట్ తెలీవు. శేఖర్ ఒక్కడికే కాదు. ఇప్పుడిప్పుడే బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న ఈ మొబైల్, ఇంటర్నెట్ వాలెట్‌ల గురించి చాలా మందికి తెలీదు. మరి ఈ వ్యాలెట్‌ల కథేంటి? వీటితో ఏం చేయొచ్చు? అసలు ఎన్ని రకాల వాలెట్లుంటాయి? ఇంతకీ ఇవి వాడటం లాభమేనా..? ఇవన్నీ తెలియజేసేదే ఈ ప్రాఫిట్ ప్లస్.
 
క్లోజ్డ్ వాలెట్...

క్లోజ్డ్ వాలెట్ అంటే కంపెనీలు సొంతగా అందించేవి. బిగ్ బాస్కెట్, ఓలా, ఫ్లిప్‌కార్ట్, ఉబెర్... ఇలాంటివన్నీ క్లోజ్డ్ వాలెట్లే. అంటే వీటిలో డబ్బు వేసుకుని, వాటిలో జరిపే లావాదేవీలకే వినియోగించాలి. వేరే లావాదేవీలకు ఉపయోగించటం కానీ, ఒకసారి వేసిన డబ్బును వెనక్కి తీసుకోవటం కానీ కుదరదు. ఇవి పూర్తిగా ఆయా కంపెనీల నియంత్రణలో ఉంటాయి కనక వీటికి ఆర్‌బీఐ అనుమతి కూడా అవసరం లేదు. ప్రస్తుతం చాలా కంపెనీలు ఈ క్లోజ్డ్ వాలెట్లను ఆఫర్ చేస్తున్నాయి.

 
సెమీ క్లోజ్డ్...

ఈ-వాలెట్లలో డబ్బులు డిపాజిట్ చేసుకున్నాక వీటిని ఇతర ఆన్‌లైన్ సైట్లలో కూడా పరిమితంగా వినియోగించుకునే అవకాశముంటుంది. కాకపోతే సదరు వాలెట్‌ను నిర్వహిస్తున్న సంస్థకు ఏఏ కంపెనీలతో ఒప్పందాలున్నాయో ఆ కంపెనీలు మా త్రమే ఈ వాలెట్లను అనుమతిస్తాయి. వాటితో జరిపే లావాదేవీలకు మాత్రమే చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది. మొబిక్విక్, పేయు, పేటీఎం, సిట్రస్ క్యాష్ తదితర వాలెట్లన్నీ ఇలాంటివే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధనల ప్రకారం సెమీ క్లోజ్డ్ వాలెట్ల ద్వారా యుటిలిటీ బిల్లులు, అత్యవసర సర్వీసులకు మాత్రమే చెల్లింపులు చేయొచ్చు. పెపైచ్చు ఈ చెల్లింపుల పరిమితి కూడా రూ.10వేల లోపే. వీటిలో కూడా ఒకసారి డిపాజిట్ చేసిన సొమ్మును లావాదేవీలకు వాడుకోవాలే తప్ప విత్‌డ్రా చెయ్యలేం.
 
ఓపెన్...

ఒక ఓపెన్ వాలెట్ల విషయానికొస్తే వీటి ద్వారా డబ్బులు వెయ్యటం, విత్‌డ్రా చెయ్యటం సహా బిల్లుల చెల్లింపు, ఈ-కామర్స్ లావాదేవీలు ఏవైనా చేసుకోవచ్చు. వీటిలో ఉన్న సొమ్మును ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇలాంటి వాలెట్లను బ్యాంకులు మాత్రమే జారీ చేస్తాయి. ఉదాహరణకు వొడాఫోన్ ఎంపైసా. దీన్ని ఐసీఐసీఐ బ్యాంకుతో కలసి ఈ సంస్థ ఆఫర్ చేస్తోంది. అయితే వొడాఫోన్ ఎంపైసాను సెమీక్లోజ్డ్ వాలెట్ రూపంలో కూడా ఆఫర్ చేస్తోంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఓపెన్ వ్యాలెట్ల ద్వారా నిర్వహించే లావాదేవీ విలువ రూ.50వేలు మించకూడదు. ఇక ఈ ఓపెన్ డిజిటల్ వాలెట్లు పేమెంట్ బ్యాం కుల్లాంటివేనా... అంటే కాదనే చెప్పాలి.  ఎందుకంటే ఇవి రుణాలివ్వటం, డిపాజిట్లు సేకరించటం కానీ చెయ్యలేవు. డెబిట్ కార్డులు కూడా జారీ చేయవు. పెపైచ్చు వీటిలో రూ.లక్ష కన్నా ఎక్కువ ఉంచలేం. ఎయిర్‌టెల్ మనీ, ఎయిర్‌సెల్ మొబైల్ మనీ, టాటా టెలీ ఎం-రుపీ ఇలాంటివే.
 
డిజిటల్ వాలెట్లతో లాభాలివీ...

భద్రత:
  నెట్‌బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీ జరిపిన ప్రతిసారీ అలా జరిపిన వ్యక్తి తాలూకు ఐడెంటిటీ బయటపడుతుంటుంది. కార్డులు, ఖాతాల నంబర్లు తెలుస్తుంటాయి. డిజిటల్ వాలెట్లతో ఆ సమస్య ఉండదు. ఒకవేళ డిజిటల్ వాలెట్ పాస్‌వర్డ్ వేరొకరికి తెలిసిపోయినా జరిగే నష్టం... అందులో ఉన్న సొమ్ముకు మాత్రమే పరిమితమవుతుంది.
 
సులువు: ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం డిజిటల్ చెల్లింపులు చేసేటపుడు ఒన్‌టైమ్ పాస్‌వర్డ్ లేదా వెరిఫికేషన్ కోడ్ అవసరం. వీటివల్ల లావాదేవీలు ఈజీ అవుతున్నాయి. యాపిల్ పే మాటల్లో చెప్పాలంటే... స్టోర్లలో, ఆన్‌లైన్లో చెల్లింపులు ఇప్పుడున్నంత ఈజీగా ఇంతకు ముందెన్నడూ లేవు.

వినూత్న డిస్కౌంట్లు: వీటిని ఆఫర్ చేస్తున్న కంపెనీలు చాలా సందర్భాల్లో ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావటంతో పాటు లాయల్టీ పాయింట్ల వంటివి ఆ వాలెట్లలోనే స్టోర్ అయి ఉంటాయి కనక... దేన్ని కొనుగోలు చేయడానికి ఏ కార్డు వాడితే బెటరనే ఆలోచన అవసరం లేదు.
 
నష్టాలూ ఉన్నాయ్!

- ఓపెన్ వాలెట్లకు ఆర్‌బీఐ అనుమతి ఉంటుంది. వాటిలో డబ్బులు అవసరమైతే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక సెమీక్లోజ్డ్‌గానీ, క్లోజ్డ్ గానీ ఏ వాలెట్లోనైనా డబ్బులు వేస్తే మళ్లీ తీసుకునే వీలుండదు. పెపైచ్చు ఈ వాలెట్లలో దేన్లో డబ్బులు వేసినా ఎలాంటి వడ్డీ రాదన్నది గుర్తుంచుకోవాలి. అందుబాటులో ఉన్నాయి కదా అని వివిధ రకాల వ్యాలెట్లలో డబ్బులు వేసేస్తే... అవసరం పడేంత వరకూ ఆ డబ్బులు వృథాగా పడి  ఉంటాయన్నది గుర్తుంచుకోవాలి.
 
- ఒకోసారి మన వాలెట్లో డబ్బులున్న కంపెనీకి బదులు వేరే కంపెనీ సేవల్ని  వినియోగించుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు మీకు ఓలా మనీలో డబ్బులున్నాయి. కానీ మీకు క్యాబ్ కావాల్సి వచ్చినపుడు దగ్గర్లో ఓలా క్యాబ్‌లు లేవనుకుందాం. మరో కంపెనీ క్యాబ్‌ను అప్పటికప్పుడు బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మీ ఓలా మనీ అక్కరకు రానట్టే కదా!!. అంతెందుకు! ఓలా ఇటీవల కొనుగోలు చేసిన ట్యాక్సీ ఫర్ స్యూర్ తాలూకు క్యాబ్‌లన్నీ ఓలా యాప్‌లోనే ఉంటాయి. వాటిని ఆ యాప్ నుంచే బుక్ చేసినా... చివరికి డబ్బులివ్వాల్సి వచ్చినపుడు మాత్రం ఓలా మనీ నుంచి ఇస్తామంటే కుదరదు. నేరుగా డబ్బులు ఇవ్వాల్సిందే. ఇక ఈ-కామర్స్ సంస్థల విషయానికొస్తే మీకు ఒక కంపెనీ వాలెట్లో డబ్బులున్నాయి. ఏదైనా కొనాలనుకున్నపుడు వివిధ ఈకామర్స్ సైట్లను చూడటం అందరూ చేసేదే. అపుడు మనకు డబ్బులున్న సంస్థ కాకుండా వేరే సంస్థ తక్కువ ధరకు ఆఫర్ చేస్తే పరిస్థితేంటి?
 

డిజిటల్ వాలెట్లలో డిపాజిట్ చేసేముందు అవి ఎంతవరకూ అవసరమవుతాయన్నది ప్రధానంగా చూసుకోవాలి. ఎప్పుడో ఒకసారి పడే అవసరం కోసం ముందే డబ్బులు వేసుకుని ఉంచటం తెలివైన పని కాదనేది నిపుణుల మాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement