మళ్లీ లాభాల్లోకి..
♦ యూరో ప్యాకేజీతో ఎగసిన స్టాక్ సూచీలు
♦ 95 పాయింట్ల లాభంతో 24,718కు సెన్సెక్స్
♦ 24 పాయింట్ల లాభంతో 7,510కు నిఫ్టీ
ముంబై: ఒక రోజు నష్టాల తర్వాత మళ్లీ స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టింది. ఒకింత ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో స్టాక్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మళ్లీ 7,500 పాయింట్ల ఎగువ న ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 95 పాయింట్లు లాభపడి 24,718 పాయింట్ల వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు లాభపడి 7,510 పాయింట్ల వద్ద ముగిశాయి.
అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటంతో ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో కొనుగోళ్లు జోరుగా జరిగాయి. గ్యాస్ అన్వేషణకు ప్రభుత్వం కొత్త ధరల విధానాన్ని ప్రకటించడం, జనవరి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెల్లడికానున్నందున ఇన్వెస్టర్లు ఆశావహంగా కొనుగోళ్లు జరపడం, అంచనాలను మించిన యూరోప్ ప్యాకేజీ, ముడి చమురు ధరల్లో ర్యాలీ.. సబ్సిడి బిల్లును 20 శాతం వరకూ తగ్గించే ఆధార్ బిల్లును లోక్‌సభ ఆమోదించడం, ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియడం, యూరప్ మార్కెట్లు లాభాల్లోనే ప్రారంభం... ఈ అంశాలన్నీ సానుకూల ప్రభావం చూపాయి.
మార్కెట్ ముగిసిన తర్వాత ఐఐపీ గణాంకాలను ప్రభుత్వం విడుదల చేసింది. విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ కొనుగోళ్లు జరుపుతుండటంతో స్టాక్ మార్కెట్ లాభాల బాట పడుతోందని జియోజిత్ బీఎన్‌పీ పారిబా హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. మొత్తం మీద ఈ వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 72 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 25 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగియడం ఇది వరుసగా రెండో వారం. లుపిన్ 2 శాతం, హిందూస్తాన్ యూనిలివర్ 1.8 శాతం, అదానీ పోర్ట్స్ 1.8 శాతం చొప్పున లాభపడ్డాయి. టాటా మోటార్స్, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, విప్రో, బజాజ్ ఆటో, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ, సన్ ఫార్మా షేర్లు పెరిగాయి. బ్యాంకింగ్ షేర్లు భారీగా నష్టపోయాయి.