
ఐటీ షేర్లలో అమ్మకాలు
అంచనాలను అందుకోలేని టీసీఎస్ ఫలితాల కారణంగా శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టాలయింది...
సెన్సెక్స్‌కు 224 పాయింట్లు నష్టం
- 101 పాయింట్ల నష్టంతో 8,606 పాయింట్లకు నిఫ్టీ
- మెటల్ మినహా, అన్ని సూచీలు నష్టాల్లోనే
అంచనాలను అందుకోలేని టీసీఎస్ ఫలితాల కారణంగా శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టాలయింది. టీసీఎస్‌తో మైండ్ ట్రీ ఫలితాలు కూడా నిరాశజనకంగా ఉండటంతో ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
దీంతో వరుసగా మూడో రోజూ స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ముగిసింది. టీసీఎస్ 4.2 శాతం, సన్ ఫార్మా 4.8 శాతం పతనమవడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 224 పాయింట్లు నష్టపోయి 28,442 వద్ద ముగిసింది. రెండు వారాల్లో ఇదే బలహీనమైన ముగింపు. గత మూడు రోజుల్లో సెన్సెక్స్ మొత్తం 602 పాయింట్లు నష్టపోయింది. ఇక శుక్రవారం నిఫ్టీ101 పాయింట్లు నష్టపోయి 8,606 పాయింట్ల వద్ద ముగిసింది. బ్రోకరేజ్ సంస్థలు వివిధ షేర్ల టార్గెట్ ధరలను, రేటింగ్‌లను తగ్గించడం, మార్చి క్వార్టర్ ఫలితాలు బలహీనంగా ఉంటాయన్న అంచనాల కారణంగా గత రెండు వారాల్లో లాభాల బాట నడిచిన స్టాక్ మార్కెట్‌కు ఈ వారం నష్టాలు వచ్చాయని నిపుణులంటున్నారు.
మొత్తం మీద ఈ వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 437 పాయింట్లు నష్టపోయింది. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,457 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.17,779 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.2,26,709 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.676 కోట్ల నికర అమ్మకాలు జరపగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.72 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.
4.2 శాతం నష్టపోయిన టీసీఎస్
రూ.21 వేల కోట్ల మార్కెట్ క్యాప్ ఆవిరి
ముంబై: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్చి క్వార్టర్ ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఈ షేర్ ధర శుక్రవారం 4.2 శాతం (గురువారం నాటి ముగింపుతో పోల్చితే రూ.109)క్షీణించి రూ.2,476 వద్ద ముగిసింది. ఈ ఒక్క రోజులోనే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.21,349 కోట్లు నష్టపోయి రూ.4,85,020 కోట్లకు తగ్గింది. నికర లాభం 27 శాతం తగ్గడం, ఉద్యోగులకు రూ.2,628 కోట్ల బోనస్‌ను ఇవ్వడం వంటి కారణాల వల్ల టీసీఎస్ షేర్ పతనమైందని నిపుణులంటున్నారు.
బీఎస్‌ఈఓ 3.74 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 48 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. టీసీఎస్ ప్రభావం ఇతర ఐటీ షేర్లపైనా పడింది. విప్రో 2.4 శాతం పతనమై రూ.587కు, ఇన్ఫోసిస్ 0.4 శాతం పతనమై రూ.2,182కు క్షీణించాయి. బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్ 2 శాతం నష్టపోయి 11,169 పాయింట్ల వద్ద ముగిసింది.