క్యాబ్ మాదిరి ఆన్‌లైన్లో బుక్ చేసుకోవచ్చు | Jets, helicopters booking in online | Sakshi
Sakshi News home page

క్యాబ్ మాదిరి ఆన్‌లైన్లో బుక్ చేసుకోవచ్చు

Published Wed, Mar 19 2014 1:26 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

క్యాబ్ మాదిరి ఆన్‌లైన్లో బుక్ చేసుకోవచ్చు - Sakshi

క్యాబ్ మాదిరి ఆన్‌లైన్లో బుక్ చేసుకోవచ్చు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానంలో వెళ్లాలంటే ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలి. కాకపోతే విమానం ఏ టైమ్‌కు వెళుతుందో ఆ టైమ్‌కే మీరు వెళ్లాలి. అంతేతప్ప మీకు నచ్చిన సమయంలో విమానం వెళ్లాలంటే కుదరదు. అంతేనా!! వేరే దారిలేదా?
 ‘‘ఇదిగో మేం దారి చూపిస్తున్నాంగా... మీకు కావాల్సిన విమానాన్ని... కావాల్సిన సమయంలో వెళ్లేట్టుగా మీరే బుక్ చేసుకోండి’’ అంటోంది బెంగళూరుకు చెందిన ఏంథెమ్ ఏవియేషన్ సర్వీసెస్.

అంటే! కుటుంబమంతా కలసి ఓ కారును బుక్ చేసుకున్నట్లే విమానాన్నీ, హెలికాప్టర్లనూ కూడా బుక్ చేసుకోవచ్చన్న మాట. ఇందుకు చేయాల్సిందల్లా.. జెట్‌సెట్‌గో డాట్ ఇన్ వెబ్‌సైట్లోకి వెళితే చాలు. చార్జీలు పారదర్శకంగా ఉంటాయని, తరచూ బిజినెస్ జెట్లను బుక్ చేసుకునే వ్యాపారస్తులకు ఇది చక్కని ప్రత్యామ్నాయమని కంపెనీ చెబుతోంది.
 
 అందుబాటులో 350 విమానాలు!
 భారతదేశంలోని ప్రైవేటు జెట్లు, హెలికాప్టర్లు అన్నిటినీ జెట్‌సెట్‌గో.ఇన్ తొలిసారిగా ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ప్రస్తుతం 190 మంది ఆపరేటర్లకు చెందిన 300 నుంచి 350 విమానాలు, హెలికాప్టర్ల వరకూ ఈ సైట్లో అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటినీ రేడియో క్యాబ్స్ మాదిరిగా బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఔత్సాహికులు ఎవరైనా మొదట వెబ్‌సైట్‌లోకి వెళ్లి పేరు నమోదు చేసుకోవాలి. నమోదిత వ్యక్తులు సైట్‌లోకి లాగిన్ అయి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలి, సమయం, తేదీ, ప్రయాణికుల సంఖ్యను తెలియజేయాలి. అందుబాటులో ఉన్న సర్వీసుల వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. నచ్చిన విమానాన్ని, హెలికాప్టర్‌ను ఎంచుకుని కొటేషన్ కోరితే చాలు. ఆపరేటర్లే నేరుగా కస్టమర్లను సంప్రదిస్తారు. నెట్ ప్రైస్‌కే సేవలు లభిస్తాయి. వెబ్‌సైట్‌ను ఉపయోగించుకున్నందుకు ఎటువంటి చార్జీలు ఉండవు. యాపిల్, ఆండ్రాయిడ్ ఫోన్లలో పనిచేసే యాప్స్ కూడా ఉన్నాయి.

 పారదర్శకంగా చార్జీలు..
 ప్రైవేటు జెట్లు, హెలికాప్టర్లలో ప్రయాణించాలంటే సాధారణ విమాన చార్జీల కంటే కొంచెం ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బిజినెస్ జెట్లను వినియోగిస్తున్న వారిలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బ్రోకర్లే. బ్రోకర్లు ఎంత చెబితే అంత ధర చెల్లించక తప్పదు. ‘‘అయితే మా వెబ్‌సైట్‌లో అందరు ఆపరేటర్ల విమానాలు, హెలికాప్టర్ల చార్జీలు ఉంటాయి కనక బ్రోకర్ల బెడద లేదు. కొటేషన్ ఎంత మంది ఆపరేటర్లకైనా పంపుకోవచ్చు. ఎవరు తక్కువ ధరకు సేవలు ఇస్తే వారినే ఎంచుకోవచ్చు.

ఆపరేటర్లు అందరూ ఒకే వేదికపై ఉండడం కూడా కస్టమర్లకు కలిసొస్తుంది’’ అని జెట్‌సెట్‌గో ఆపరేషన్స్ డెరైక్టర్ కనిక టేక్రివాల్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. కొటేషన్ ఆధారంగా ఏ ఆపరేటర్‌ను ఎంచుకోవాలో కస్టమర్ నిర్ణయించుకోవడం ఇక్కడ ప్రధాన సౌలభ్యమని ఆయన తెలియజేశారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నలుగురు కుటుంబ సభ్యులు వెళ్లాలంటే కనీసం రూ.40 వేలు చెల్లించాలి. ఏదైనా సదస్సుకు 168 మంది సిబ్బంది వెళ్లాల్సి ఉన్నా జెట్ బుక్ చే సుకోవచ్చు. ఇందుకోసం బల్క్ చార్టర్ ఆప్షన్ కూడా ఉంది.

 కొనుగోలు, విక్రయం..
 ప్రయాణ సేవలే కాదు. సొంతంగా విమానం, హెలికాప్టర్ కొనాలని ఉన్నా తాము సాయపడతామని దర్శన్ చెప్పారు. పాత వి, కొత్తవి ఏవి కావాలంటే అవి కస్టమర్ల ముంగిట్లోకే తెస్తామని తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కన్సల్టెంట్లు పాత విమానాల పనితీరును ఇట్టే అంచనాగట్టి ధర నిర్ణయిస్తారని, విమానం కొనుగోలు మొదలు తనిఖీ, లెసైన్సు, సిబ్బంది నియామకం, అనుమతుల వరకూ అన్నీ తామే చేసి పెడతామని చెప్పారు. విమానాల విక్రయం, లీజు సేవలను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది.

 బోలెడన్ని డిస్కౌంట్ ఆఫర్లు..
 ప్రైవేటు జెట్, హెలికాప్టర్‌లలో ప్రయాణాన్ని డిస్కౌంట్లలో అందించటం తామే దేశంలో తొలిసారి అందుబాటులోకి తెచ్చామని జెట్‌సెట్‌గో చెబుతోంది. ‘‘ఒక చోటికి వెళ్లిన జెట్, హెలికాప్టర్లు చాలా సందర్భాల్లో తిరుగు ప్రయాణంలో ఖాళీగా వస్తాయి. అలాంటి సందర్భాల్లో ఆపరేటర్లు చార్జీల్లో 75 శాతం దాకా డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. ప్రయాణించే సమయం విషయంలో ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి కంపెనీ కొంత వెసులుబాటు తీసుకుంటుంది. రోజుకు సగటున 2-3 జెట్స్, హెలికాప్టర్లు డిస్కౌంట్ ఆఫర్‌లో అందుబాటులో ఉంటున్నాయి’’ అని సంస్థ మార్కెటింగ్ డెరైక్టర్ ఆర్.దర్శన్ చెప్పారు. కొత్త అనుభూతి కోరుకునే వారికి ఇది చక్కని వేదిక అని, అదీ అందుబాటు ధరలో సేవలు లభిస్తాయని తెలియజేశారాయన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement