ముంబై: బంగారం వ్యాపారులు మరోసారి సమ్మెకు పిలుపునిచ్చారు. 2016 ఆర్థిక బడ్జెట్ లో బంగారు ఆభరణాలపై అమ్మకం పన్ను విధించడానికి వ్యతిరేకంగా మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. బంగారు ఆభరణాలపై నాలుగు సంవత్సరాల తరువాత మళ్లీ అమ్మకపు పన్ను విధించడాన్ని వర్తక సంఘం వ్యతిరేకించింది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేటి నుంచి దేశవ్యాప్త సమ్మె చేయనున్నట్టు తెలిపారు. కేంద్రం నిర్ణయంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగార వినియెగాదారుగా ఉన్న ఇండియాపై దీని ప్రభావం మరింతగా పడనుందని వాదిస్తున్నారు.
ఇప్పటికే బంగారం ధరలు బాగా పెరగడంతో గత రెండు మూడు నెలలుగా డిమాండ్ బాగా తగ్గిందన్నారు. కొనుగోళ్లు పడిపోవడంతో నష్టాలను చవి చూస్తున్నామని, ఈ పరిస్థితుల్లో అమ్మకంపన్ను విధించడంతో తమపై మరింత ప్రభావం పడుతుందని వ్యాపారులు తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భారతదేశం బులియన్ మరియు జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రతినిధి కేతన్ ష్రాఫ్ విజ్ఞప్తి చేశారు.
కాగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్ సభలో కేంద్ర బడ్జెట్ 2016 లో బంగారం, వజ్రాల ఆభరణాల 1 శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధించిన విషయం తెలిసిందే.