సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్ ఛార్జీలను మోతెక్కిస్తున్న టెలికాం కంపెనీలు వినియోగదారుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కాల్, డేటా చార్జీలను డిసెంబర్ మూడు నుంచి 42 శాతం పెంచుతున్నట్టు వొడాఫోన్ ఐడియా ఇప్పటికే ప్రకటించగా రిలయన్స్ జియో 40 శాతం టారిఫ్ పెంపుతో న్యూ ఆల్ ఇన్ వన్ ప్లాన్‌లను ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి నూతన ప్లాన్‌లు అమల్లోకి వస్తాయని జియో పేర్కొంది. మొబైల్ చార్జీలను 40 శాతం పెంచినా వినియోగదారులకు 300 శాతం ప్రయోజనాలను వర్తింపచేస్తామని తెలిపింది.
డేటా వినియోగ వృద్ధి, డిజిటల్ వ్యాప్తిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకుండా టారిఫ్‌ల పెంపును చేపట్టామని వెల్లడించింది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశ్యంతోనే నూతన ప్లాన్‌లను ఆఫర్ చేస్తున్నామని తెలిపింది. టెలికాం టారిఫ్‌ల సవరణకు చేపట్టిన సంప్రదింపుల ప్రక్రియలో ప్రభుత్వంతో జియో కలిసి పనిచేస్తుందని పేర్కొంది. కాగా, మొబైల్ కాల్స్, డేటా చార్జీలను మంగళవారం నుంచి పెంచనున్నట్టు టెలికాం ఆపరేటర్ వొడాఫోన్-ఐడియా ప్రకటించింది. ప్రీపెయిడ్ విభాగంలో రెండు రోజులు, 28, 84, 368 రోజుల వాలిడిటీతో కూడిన ప్లాన్‌లపై చార్జీలను పెంచనున్నట్టు కంపెనీ వెల్లడించింది. గత ప్లాన్‌లతో పోలిస్తే తాజా ప్లాన్‌లు దాదాపు 42 శాతం మేరకు భారమవుతాయని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment