టారిఫ్‌ల పెంపుతో ఏఆర్‌పీయూ జూమ్‌ | Industry ARPU to exceed decadal high of Rs 225 in FY26 driven by 5G usage, tariff hike | Sakshi
Sakshi News home page

టారిఫ్‌ల పెంపుతో ఏఆర్‌పీయూ జూమ్‌

Published Wed, Jul 17 2024 12:06 PM | Last Updated on Wed, Jul 17 2024 12:29 PM

Industry ARPU to exceed decadal high of Rs 225 in FY26 driven by 5G usage, tariff hike

    2025–26లో రూ.225కు చేరొచ్చు 

    కంపెనీల రుణ పరపతి పెరుగుతుంది 

    క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా

ముంబై: టారిఫ్‌ల పెంపు టెలికం కంపెనీలకు మరింత ఆదాయన్ని తెచి్చపెట్టనుంది. ప్రతి యూజర్‌ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) 2025–26లో దశాబ్ద గరిష్ట స్థాయి రూ.225–230కు చేరుకుంటుందని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏఆర్‌పీయూ రూ.182తో పోల్చి చూస్తే 25 శాతం వృద్ధి చెందుతుందని తెలిపింది. అధిక లాభాలు, తక్కువ మూలధన వ్యయాలతో టెలికం కంపెనీల పరపతి సైతం మెరుగుపడుతుందని పేర్కొంది.

 రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా టెలికం చార్జీలను 20 శాతం మేర పెంచడం తెలిసిందే. ఈ రేట్లు ఈ నెల 3 నుంచి అమల్లోకి వచ్చినట్టు క్రిసిల్‌ తన నివేదికలో గుర్తు చేసింది. అయితే, తదుపరి రీచార్జ్‌ల నుంచే పెంచిన చార్జీలు చెల్లించాల్సి వస్తుంది కనుక, దీని అసలు ప్రతిఫలం వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే కనిపిస్తుందని వివరించింది. 5జీ సేవలతో డేటా వినియోగం పెరుగుతుందని, ఇది కూడా ఏఆర్‌పీయూ పెరిగేందుకు మద్దతుగా నిలుస్తుందని క్రిసిల్‌ రేటింగ్స్‌ చీఫ్‌ రేటింగ్‌ ఆఫీసర్‌ మనీష్‌ గుప్తా తెలిపారు. వీడియో స్ట్రీమింగ్‌ సేవల కోసం కస్టమర్లు అధిక డేటా ప్లాన్లకు మారుతున్నట్టు క్రిసిల్‌ తన నివేదికలో తెలిపింది.  

మూలధన వ్యయ భారం తగ్గుతుంది.. 
తాజా చార్జీల పెంపుతో టెలికం పరిశ్రమ రిటర్న్‌ ఆన్‌ క్యాపిటల్‌ ఎంప్లాయిడ్‌ (ఆర్‌వోసీఈ) 2023–24లో ఉన్న 7.5 శాతం నుంచి 2025–26లో 11 శాతానికి పెరుగుతుందని క్రిసిల్‌ అంచనా వేసింది. ఆదాయంలో మూలధన వ్యయాల (పెట్టుబడులు) శాతం 2023–24లో 28 శాతంగా ఉంటే, 2025–26లో 19 శాతానికి దిగొస్తుందని తెలిపింది. చాలా వరకు టెలికం సంస్థలు 5జీ సేవలను అమల్లోకి తెచ్చాయని.. అలాగే, స్పెక్ట్రమ్‌పై అధిక వ్యయాలు 2022–23లోనే చేసినట్టు గుర్తు చేసింది. దీంతో కంపెనీల రుణ భారం 6.4 లక్షల కోట్ల నుంచి రూ.5.6 లక్షల కోట్లకు దిగొస్తుందని వివరించింది. కంపెనీలు మరో విడత రేట్లను పెంచితే, తమ తాజా అంచనాలకు ఇంకా మెరుగుపడతాయని తెలిపింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement