
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరోసారి సంచలనానికి సిద్ధమైంది. ఇప్పటికే కాల్స్, డేటా, ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను చవక ధరలకే అందిస్తూ మిగతా టెలికాం సంస్థల పోటీదారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. సామాన్యుడి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్ ఉండాలనే ఉద్దేశంతో జియోఫోన్‌లు ప్రవేశపెట్టగా వాటిని వినియోగించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దసరా, దీపావళి పండగలను దృష్టిలో పెట్టుకుని జియో మరో భారీ ఆఫర్‌తో ముందుకొచ్చింది. రూ.1500 విలువ చేసే జియో ఫోన్‌ను కేవలం రూ.699కే అందించనుంది. దీనికోసం పాత ఫోన్‌ను తిరిగి ఇచ్చేయాల్సిన పనిలేకుండా నేరుగా రూ.699కే కొత్త ఫోన్‌ను పొందవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు జియో సంస్థ మంగళవారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
పండగ సీజన్‌ను పురస్కరించుకుని జియోఫోన్ దివాళి ఆఫర్‌ను ప్రకటించగా.. ఫోన్ ధరను సగానికి పైగా తగ్గించింది. అంతేకాకుండా నూతనంగా కొనుగోలు చేసే జియోఫోన్‌పై రూ.700 విలువ చేసే డాటాను అందించనుంది. ఇందులో భాగంగా వినియోగదారుడి చేసుకునే ఒక్కో రీచార్జ్‌కు అదనంగా రూ.99 విలువైన డాటాను జియో అందిస్తుంది. ఇది మొదటి ఏడు రీచార్జ్‌లకు వర్తిస్తుంది. ఫోన్ కొనుగోలుపై రూ.800, ఏడు రీచార్జీల డేటా విలువ రూ.700 కలిపి వినియోగదారుడు రూ.1500 ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ దసరా నుంచి దీపావళి వరకు మాత్రమే వర్తిస్తుంది.