జియో ఫోన్ డెలివరీ డేట్ వచ్చేసింది..
న్యూఢిల్లీ: టెలికంరంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియోసంస్థ అతి తక్కువ ధర రూ. 1500కే ఫీచర్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. దీనికోసం ఆగస్టు 24న ప్రీ బుకింగ్‌లు ప్రారంభించిన జియో కంపెనీ వినియోగదారులు పొటెత్తడంతో గంటల వ్యవధిలోనే సైట్ మొరాయించి బుకింగ్స్ నిలచిపోయాయి. దీంతో ఆగస్టు 26న అధికారికంగా బుకింగ్స్‌ను కంపెనీ పూర్తిగా నిలిపివేసింది.
ఇక ఆ ఒక్క రోజే 60 లక్షల మంది జియో ఫోన్‌లు బుక్ చేసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇంకా కోటి మంది రిజిస్టర్ చేసుకొని జియో ఫోన్ల మీద ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపింది. అయితే ప్రీబుకింగ్ చేసుకున్న 60 లక్షల మందికి సెప్టెంబర్ 21 నుంచి డెలివరీ చేయనున్నట్లు రిలయన్స్ జియో పేర్కొంది. తొలుత రూ.500తో బుక్ చేసుకున్న కస్టమర్లు మిగిలిన ధర రూ.1000 చెల్లించి జియో ఫోన్ పొందాల్సి ఉంటుంది.