IPL 2023 Live Streaming Details: How To Watch IPL Matches Live Online, More Details Inside - Sakshi
Sakshi News home page

‘పదహారేళ్ల’ పండుగ... ఐపీఎల్‌కు మోగిన విజిల్‌

Published Fri, Mar 31 2023 5:01 AM | Last Updated on Fri, Mar 31 2023 10:00 AM

The 16th season of IPL starts today - Sakshi

ధోని చెన్నైలో ఆఖరిసారిగా ఆడి ఇక గుడ్‌బై చెబుతాడా? ఎన్నో రికార్డులు అందుకున్నా ఇంకా చెంత చేరని ఐపీఎల్‌ ట్రోఫీని ఈ సారైనా కోహ్లి టచ్‌ చేయగలడా? ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన తర్వాత గత ఏడాది అనూహ్యంగా ఆఖరి స్థానానికి పరిమితమైన ముంబైని ఈసారి రోహిత్‌ ఎంతవరకు తీసుకెళ్లగలడు? వరుసగా రెండో ఏడాది గుజరాత్‌ సత్తా చాటగలదా? పదిహేనేళ్లు ఆడినా టైటిల్‌ అందని ద్రాక్షగానే ఉన్న ఉత్తరాది టీమ్‌ల ఢిల్లీ, పంజాబ్‌ టీమ్‌ల అదృష్టం ఎలా ఉంటుంది?

రేసులో మిగిలిన నాలుగు జట్లు హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, రాజస్తాన్‌లు ఏమాత్రం పోటీనివ్వగలవు? ఈ అన్నింటికి సమాధానం అందించే ధనాధన్‌ పండుగకు మళ్లీ రంగం సిద్ధమైంది. వేసవి వినోదంలో ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడా సంబరంగా నిలిచిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌ 16వ సీజన్‌ వచ్చేసింది. క్రికెట్‌ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న లీగ్‌–2023కి నేడు అహ్మదాబాద్‌లో గుజరాత్‌ టైటాన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో తెర లేవనుంది.   

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ కొత్త సీజన్‌కు విజిల్‌ మోగింది. మే 28 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 74 మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. అన్నింటికి మించి 2019 తర్వాత అన్ని జట్లకూ సొంతగడ్డపై మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తోంది. కరోనా కారణంగా గత మూడు సీజన్ల పాటు వేదికల విషయంలో షరతుల కారణంగా అందరికీ తమ సొంత మైదానాల్లో ఆడే అవకాశం రాలేదు.

ఇప్పుడు భారీ స్థాయిలో, స్థానిక అభిమానుల మద్దతుతో పది జట్లూ హంగామాకు సిద్ధమయ్యాయి. మారిన ఆటగాళ్లు, నిబంధనల్లో స్వల్ప మార్పులతో పదహారో సీజన్‌ లీగ్‌ కాస్త కొత్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జాతీయ జట్లకు ఆడుతున్న కారణంగా దక్షిణాఫ్రికా, శ్రీలంకలకు చెందిన ఆటగాళ్లు కాస్త ఆలస్యంగా తమ ఐపీఎల్‌ టీమ్‌లతో చేరతారు. గురువారం అహ్మదాబాద్‌లో ఐపీఎల్‌ ట్రోఫీతో అన్ని జట్ల కెప్టెన్‌ల ఫొటో సెషన్‌ నిర్వహించారు. అస్వస్థత కారణంగా ఈ కార్యక్రమానికి ముంబై ఇండియన్స్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ హాజరుకాలేదు.  

కొన్ని మార్పులు... 
‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ పేరుతో కొత్త నిబంధనను లీగ్‌ కౌన్సిల్‌ తీసుకొచ్చింది. దీని ప్రకారం తాము ముందుగా ప్రకటించిన నలుగురు సబ్‌స్టిట్యూట్‌ ఆటగాళ్లలో ఒకరిని మ్యాచ్‌ మధ్యలో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా బరిలోకి దిగవచ్చు. అంటే బ్యాటింగ్‌ ఒకరు చేసిన తర్వాత అతని స్థానంలో తర్వాతి ఇన్నింగ్స్‌లో మరో బౌలర్‌ను తీసుకునే అవకాశం జట్టుకు ఉంది. అంటే పరిస్థితులను బట్టి ప్లేయర్‌ను మార్చుకునే ఈ సౌకర్యం జట్టుకు అదనపు ప్రయోజనాన్ని ఇస్తుంది.

టాస్‌ తర్వాత తుది జట్టును ప్రకటించడం కూడా తొలిసారి అమలు చేస్తున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికా టి20 లీగ్‌లో దీనిని వాడారు. అంటే టాస్‌ గెలిస్తే ఒక రకమైన టీమ్, టాస్‌ ఓడితే మరో రకమైన టీమ్‌తో సిద్ధమై కెప్టెన్‌ టాస్‌కు వెళ్లవచ్చు. అలాగే మహిళల ప్రీమియర్‌ లీగ్‌ తరహాలో వైడ్‌లు, నోబాల్స్‌ కోసం కూడా డీఆర్‌ఎస్‌ను వాడుకోవచ్చు.  

ఫార్మాట్‌ ఇలా... 
లీగ్‌ దశలో ప్రతీ టీమ్‌ 14 మ్యాచ్‌లు ఆడుతుంది. అయితే పది జట్లు ఉండటంతో గత ఏడాదిలాగే కాస్త భిన్నమైన ఫార్మాట్‌ను అమలు చేస్తున్నారు. 10 టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతీ టీమ్‌లో తమ గ్రూప్‌లోని మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్‌ చొప్పున... మరో గ్రూప్‌లోనే ఐదు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్‌ ‘ఎ’ లో ముంబై, కోల్‌కతా, రాజస్తాన్, ఢిల్లీ, లక్నో ఉన్నాయి.

ఉదాహరణకు ముంబై తమ గ్రూప్‌లోనే కోల్‌కతా, రాజస్తాన్, ఢిల్లీ, లక్నోలతో ఒకేసారి తలపడుతుంది. గ్రూప్‌ ‘బి’లో ఉన్న చెన్నై, బెంగళూరు, గుజరాత్, పంజాబ్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌లను రెండేసి సార్లు ఎదుర్కొంటుంది. అయితే ఎలా ఆడినా ప్రతీ టీమ్‌కు సొంతగడ్డపై 7 మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తోంది.  

డిజిటల్‌ మీడియా మారింది... 
గత సీజన్‌ వరకు మొబైల్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూసేందుకు స్టార్‌ స్పోర్ట్స్‌కే చెందిన ‘హాట్‌ స్టార్‌’లో అవకాశం ఉండేది. అయితే ఈసారి మీడియా హక్కులు మారాయి. టీవీ ప్రసారాలు స్టార్‌ స్పోర్ట్స్‌లోనే వస్తాయి. డిజిటల్‌ హక్కులు మాత్రం అంబానీకి చెందిన వయాకామ్‌ 18 గ్రూప్‌ కొనుక్కుంది. దాంతో ఈసారి మొబైల్‌లో ‘జియో సినిమా’లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూడవచ్చు.  

ప్రారంబోత్సవ వేడుకలు... 
ఐపీఎల్‌లో చివరిసారిగా 2018లో ప్రారంబోత్సవ వేడుకలు జరిగాయి. పుల్వామాలో దాడి కారణంగా 2019లో నిర్వాహకులు వేడుకలు రద్దు చేశారు. ఈసారి ఆటతో పాటు తొలిరోజు పాట, నృత్యాల సంబరం కూడా ఉంది. ప్రముఖ గాయకుడు అరిజిత్‌ సింగ్‌ పాటతో పాటు కత్రినా కైఫ్, టైగర్‌ ష్రాఫ్, రష్మిక మంధాన, తమన్నా డ్యాన్స్‌లతో అలరిస్తారు.   

బుమ్రా మినహా... 
ఈసారి లీగ్‌లో భారత రెగ్యులర్‌ ఆటగాళ్లతో పాటు అంతర్జాతీయ స్టార్లు బరిలోకి దిగుతున్నారు. స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, కాన్వే, రూట్, హ్యారీ బ్రూక్‌ తదితరులు సత్తా చాటేందుకు సిద్ధమ య్యారు. అయితే గాయంతో అనూహ్యంగా దూరమైన వారిలో బుమ్రా అందరికంటే కీలక ఆటగాడు. అతను లేకుండా ముంబై బరిలోకి దిగుతుండగా, గాయంతో శ్రేయస్‌ అయ్యర్‌ కూడా తప్పుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement