
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో టారిఫ్ రేట్ల పెరుగుదల టెలికం పరిశ్రమకు మంచిదని ఫిలిప్ క్యాపిటల్ నివేదిక పేర్కొంది. టారిఫ్‌ల పెంపు వల్ల జియోకి ఒక యూజర్‌పై వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) 20 శాతం వరకు పెరుగుతుందని అంచనా వేసింది. ఇది టెలికం రంగానికి శుభపరిణామమని పేర్కొంది. ‘జియో రూ.399 ప్లాన్ వాలిడిటీని 84 రోజుల నుంచి 70 రోజులకు తగ్గించింది.
దీంతో ఏఆర్‌పీయూ 20 శాతంమేర పెరగొచ్చు. ఇక 84 రోజుల వాలిడిటీతో కూడిన ఇదివరకటి రూ.399 ప్లాన్ ఇప్పుడు రూ.459 అయ్యింది. ఇక్కడ ఏఆర్‌పీయూ 15 శాతంమేర పెరుగుతుంది. అంటే జియో సబ్‌స్క్రైబర్లపై ఏఆర్‌పీయూ 15–20 శాతంమేర పెరుగుతుంది’ అని వివరించింది. ఇక ఇంటర్‌కనెక్షన్ యూసేజ్ చార్జీల తగ్గుదల కూడా జియోకి కలిసొచ్చే అంశమని తెలిపింది. కాగా మరొకవైపు జియో టారిఫ్ ధరలు ఇప్పటికీ తక్కువగానే ఉన్నట్లు క్రెడిట్ సూసీ అభిప్రాయపడింది.