
గురుగ్రామ్: దక్షిణ కొరియా ఆటో రంగ సంస్థ కియా మోటార్స్ తన ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘సెల్టోస్’ కారును గురువారం ఇక్కడ ప్రదర్శించింది. భారత మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ కారును రూపొందించి, అభివృద్ధి చేసినట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో కంపెనీకి ఉన్న ప్లాంట్ నుంచే మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలతో పాటు ఇతర ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తామని స్పష్టం చేసింది. ఈ ఏడాది నాల్గవ త్రైమాసికంలో కారు విడుదల కానుండగా.. ధరల శ్రేణి రూ.10 లక్షల నుంచి రూ.17 లక్షలుగా వెల్లడించింది. బీఎస్–6 ప్రమాణాలతో రూపొందించిన ఈ కారు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో లభ్యంకానుంది. మూడు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లతో పాటు సిక్స్–స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వెర్షన్లతో అందుబాటులోకి రానుంది.
భారత్‌లో రూ.13,896 కోట్ల పెట్టుబడి
సెల్టోస్ విడుదల సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హాన్–వూ పార్క్ మాట్లాడుతూ.. ‘వచ్చే రెండేళ్లలో అనంతపురం ప్లాంట్‌లో మొత్తం నాలుగు మోడళ్లు ఉత్పత్తి కానున్నాయి. వీటిలో సెల్టోస్ ఒకటి కాగా, దేశవ్యాప్తంగా 160 నగరాల్లో 265 టచ్ పాయింట్లతో మా ప్రస్థానం మొదలుకానుంది. 2020 నాటికి ఈ సంఖ్య 300 వద్దకు చేరుకోవాలనేది కంపెనీ లక్ష్యం. ఆ తరువాత 2021 నాటికి 350కి పెంచనున్నాం. భారత్‌లో ఇప్పటివరకు 2 బిలియన్ డాలర్లు (రూ.13,896 కోట్లు) మేర పెట్టుబడిపెట్టాం. ఇందులో ఒక్కప్లాంట్ కోసమే 1.1 బిలియన్ డాలర్లు (రూ.7,643 కోట్లు) పెట్టుబడిపెట్టగా.. ఏడాదికి మూడు లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఈ ప్లాంట్‌కు ఉంది’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment