మరోసారి ‘కింగ్ ఫిషర్’ వేలం వెలవెల
ముంబై: మరోసారి కింగ్ ఫిషర్ ట్రేడ్ మార్క్, లోగోల వేలానికి స్పందన కరువైంది. రిజర్వ్ ధర తగ్గించినా ఒక్క బిడ్ కూడా రాలేదు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు రూ.9వేల కోట్ల రుణాలిచ్చిన బ్యాంకులు వేలం ద్వారా కొద్ది మొత్తమైనా రాబట్టుకోవాలని భావించగా... తాజా పరిణామంతో మరోసారి నిరాశే ఎదురైంది. తాజా వేలంలో కింగ్‌ఫిషర్ లోగోతో పాటు ఒకప్పుడు దాని ట్యాగ్ లైన్ ‘ఫ్లై ద గుడ్ టైమ్స్’ను విక్రయానికి ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని 17 బ్యాంకుల కన్సార్టియం విక్రయానికి పెట్టింది.
వీటితోపాటు ప్రధాన కార్యాలయం కింగ్‌ఫిషర్ హౌస్‌లో ఉన్న రూ.13,70 లక్షల విలువైన చరాస్తుల(కార్లు ఇతరత్రా)ను ఫన్‌లైనర్, ఫ్లై కింగ్‌ఫిషర్, ఫ్లయింగ్ బర్డ్‌లను కూడా వేలానికి ఉంచాయి. గత వేలంలో రిజర్వ్ ధర రూ.366.70 కోట్లుగా ఉండడంతో ఒక్క బిడ్ కూడా రాలేదని పది శాతం తగ్గించి రూ.330.03 కోట్లుగా నిర్ణయించినప్పటికీ ఈ సారి కూడా ఒక్కరూ ముందుకు రాలేదు.