మళ్లీ కిసాన్ వికాస పత్రాలు
న్యూఢిల్లీ: కిసాన్ వికాస పత్రాలను (కేవీపీ) స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం మళ్లీ ప్రారంభిస్తోంది. ఇన్వెస్ట్ చేసిన మొత్తం 8 సంవత్సరాల 4 నెలల్లో రెట్టింపయ్యే ఈ కిసాన్ వికాస పత్రాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు(మంగళవారం) మళ్లీ ఆవిష్కరిస్తారు. ఇవి రూ.1,000, 5,000, 10,000, 50,000 పత్రాలు లభ్యమవుతాయి. వీటిల్లో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. గతంలో ఈ కిసాన వికాస పత్రాలను పోస్ట్ ఆఫీసుల్లోనే విక్రయించేవాళ్లు. ఇప్పడు వీటిని ఎంపిక చేసిన జాతీయ బ్యాంకు బ్రాంచీలలో అందుబాటులో ఉంచుతారు.
కేవీపీల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు రెండున్నర సంవత్సరాలు లాకిన్ పీరియడ్ ఉంటుంది. చిన్న ఇన్వెస్టర్లకు కిసాన్ వికాస పత్రాలు సురక్షితమైనవి, భద్రమైనవని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీటి వల్ల దేశంలో పొదుపు రేటు పెరుగుతుందని వివరించింది. ఒక వ్యక్తి లేదా సంయుక్తంగా వ్యక్తులకు వీటిని జారీ చేస్తారని, వీటిని ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేసుకోవచ్చని వివరించింది. బ్యాంకుల్లో వీటిని తనఖాగా ఉంచుకొని రుణాలు పొందవచ్చని పేర్కొంది. 1988లో కిసాన్ వికాస పత్రాలను మొదటిసారిగా జారీ చేశారు. అప్పట్లో ఇవి ఐదున్నర సంవత్సరాలకు రెట్టింపయ్యేవి. వీటిని 2011 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.