
శ్రీసిటీలో కొబెల్కొ, పైలాక్స్ అదనపు యూనిట్లు
సత్యవేడు: శ్రీసిటీలోని జపాన్ దేశానికి చెందిన కొబెల్కొ ప్లేట్ ప్రాసెసింగ్ ఇండియా లిమిటెడ్, పైలాక్స్ ఇండియా లిమిటెడ్ పరిశ్రమ అదనపు ఉత్పత్తి యూనిట్లకు బుధవారం ప్రారంభోత్సవం జరిగింది. కొబెల్కొ కొత్త యూనిట్‌ను ఆ సంస్థ డెరైక్టర్ సటొరు హొషినా ప్రారంభించగా, పైలాక్స్ అదనపు యూనిట్‌ను పైలాక్స్ గ్రూప్ ప్రెసిడెంట్ యుకిహికొ షిమాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి మాట్లాడుతూ కొబెల్కో, పైలాక్స్ రెండూ కూడా శ్రీసిటీలో అడుగు పెట్టిన మొట్టమొదటి జపాన్ పరిశ్రమలు కాగా, రెండూ తమ యూనిట్లను విస్తరించడం సంతోషదాయకమన్నారు.
కొబెల్కొకు సంబంధించి ఏడాదిలో ఇది రెండో యూనిట్ విస్తరణ అని తెలిపారు. జపాన్‌కు చెందిన కొబెల్కొ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అనుబంధ సంస్థ అయిన కొబెల్కొ ప్లేట్ ప్రాసెసింగ్ ఇండియా లిమిటెడ్‌లో స్టీల్ ప్లేట్ల తయారీ జరుగుతుంది. పైలాక్స్ జపాన్ గ్రూప్‌కు చెందిన పైలాక్స్ ఇండియా లిమిటెడ్ ఆటోమొబైల్ విడి భాగాల ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ. ఇక్కడ కార్లలో వినియోగించే కూల్ స్ప్రింగులు, ప్లాట్ స్ప్రింగులు, వైర్లు, మెటల్, ప్లాస్టిక్ ఫాస్టనర్లు తయారు చేస్తారని తెలిపారు.