
ముంబై: ప్రైవేట్ రంగంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.1,624 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభంతో పోలిస్తే 28 శాతం వృద్ధి సాధించామని బ్యాంకు జాయింట్ ఎండీ దీపక్ గుప్తా చెప్పారు. అనుబంధ సంస్థలు– బ్రోకరేజ్, వాహన ఫైనాన్స్‌లు మంచి పనితీరు చూపించడంతో ఈ స్థాయి లాభాలు సాధ్యమయ్యాయన్నారు.
4.2 శాతంగా నికర వడ్డీ మార్జిన్..
స్డాండోలోన్ ప్రాతిపదికన నికర వడ్డీ ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.2,394 కోట్లకు, ఇతర ఆదాయం 14 శాతం వృద్ధితో రూ.1,040 కోట్లకు చేరుకున్నాయి. దీంతో నికర లాభం 20 శాతం వృద్ధితో రూ.1,053 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ మార్జిన్ 0.3 శాతం తగ్గి 4.2 శాతానికి చేరిందని గుప్తా తెలియజేశారు.
బ్రోకరేజ్ వ్యాపారం లాభం రూ.154 కోట్లకు, వాహన రుణాలిచ్చే కోటక్ మహీంద్రా ప్రైమ్ నికర లాభం రూ.148 కోట్లకు, ఐ–బ్యాంకింగ్ విభాగం లాభం ఆరు రెట్లు పెరిగి రూ.36 కోట్లకు ఎగిశాయని వివరించారు. ఈ క్యూ2లో 2.47 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు 2.31 శాతానికి తగ్గాయని, అలాగే నికర మొండి బకాయిలు 1.26 శాతం నుంచి 1.09 శాతానికి తగ్గాయని గుప్తా తెలిపారు.
అయితే కేటాయింపులు రూ.226 కోట్లకు పెరిగాయన్నారు. ఆర్థిక వ్యవస్థలో బ్యాంక్‌లు కీలకమని, అందుకని ఈ రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించడం సరైన చర్య కాదని ఆయన అభిప్రాయపడ్డారు. బీఎస్‌ఈలో కోటక్ షేర్ 1% లాభంతో రూ.1,060 వద్ద ముగిసింది.