కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభం 35% అప్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,267 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. గత క్యూ3లో సాధించిన నికర లాభం(రూ.938 కోట్లు)తో పోల్చితే 35 శాతం వృద్ధి సాధించామని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. ఇతర ఆదాయం, నిర్వహణ లాభం అధికంగా ఉండడం, కేటాయింపులు తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల ఈ స్థాయిలో లాభం సాధించామని వివరించింది.
మొత్తం ఆదాయం రూ.6,950 కోట్ల నుంచి రూ.7,670 కోట్లకు పెరిగిందని పేర్కొంది. స్టాండెలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.635 కోట్ల నుంచి 39 శాతం వృద్ధితో రూ.880 కోట్లకు ఎగసింది. స్థూల మొండి బకాయిలు 2.01 శాతం నుంచి 2.42%కి, నికర మొండి బకాయిలు 0.85% నుంచి 1.07%కి పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం 16% పెరిగి రూ.2,050 కోట్లకు చేరగా, నికర వడ్డీ మార్జిన్ 4.49 శాతంగా ఉంది. ఫలితాలు
అంచనాలను మించడంతో బీఎస్‌ఈలో కోటక్ బ్యాంక్ షేర్ 7% వృద్ధితో రూ.795కు పెరిగింది.