కోటక్ మహీంద్రా బ్యాంకు లాభం 4 రెట్లు అప్
న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల కాలానికి రూ.742 కోట్ల నికర లాభం (స్టాండోలోన్) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం రూ.190 కోట్లతో పోలిస్తే నాలుగు రెట్లు వృద్ధి సాధించినట్లు బ్యాంక్ తెలియజేసింది. గత క్యూ1లో రూ.4,584 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.5,120 కోట్లకు పెరిగింది. కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.517 కోట్ల నుంచి రెట్టింపై రూ.1,067 కోట్లకు, కన్సాలిడేటెడ్ మొత్తం ఆదాయం 6,385 కోట్ల నుంచి రూ.7,867 కోట్లకు పెరిగాయి. స్థూల మొండి బకాయిలు 2.04% నుంచి 2.2 శాతానికి, నికర మొండి బకాయిలు 0.93 శాతం నుంచి 1.06 శాతానికి పెరిగాయి. మొండి బకాయిలకు కేటాయింపులు మాత్రం రూ.322 కోట్ల నుంచి రూ.214 కోట్లకు తగ్గాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ 2.7 శాతం నష్టంతో రూ.761వద్ద ముగిసింది.