కోటక్ బ్యాంకు ఫలితాలు భేష్
♦ జూన్ క్వార్టర్లో లాభం 1,347 కోట్లు
♦ 26 శాతం పెరుగుదల
♦ కలిసొచ్చిన సబ్సిడరీల పనితీరు
ముంబై: అనుబంధ సంస్థల చక్కని పనితీరు, కోర్ ఆదాయం పెరగడంతో జూన్ త్రైమాసికంలో కోటక్ మహీంద్రా బ్యాంకు మెరుగైన ఫలితాలను ప్రకటించింది. లాభం 26 శాతం వృద్ధితో రూ.1,346.82 కోట్లుగా నమోదైంది. స్టాండలోన్ ప్రాతిపదికన ఆర్జించిన లాభం చూసుకున్నా 23 శాతం వృద్ధితో రూ.913 కోట్లుగా నమోదయింది. నికర వడ్డీ ఆదాయం సైతం 17 శాతం పెరిగి రూ.2,246 కోట్లకు చేరింది. అయినప్పటికీ నికర వడ్డీ మార్జిన్ మాత్రం తగ్గడం గమనార్హం. 0.20 తగ్గి 4.4 శాతానికి పరిమితమైంది. వడ్డీయేతర ఆదాయం రూ.733 కోట్ల నుంచి రూ.906 కోట్లకు వృద్ధి చెందింది. వాహన రుణాల విబాగం ఆదాయం 10 శాతం పెరిగి రూ.132 కోట్లుగా నమోదైంది.
కొత్తగా యాప్ ఆధారిత డిజిటల్ సేవింగ్స్ ఖాతాలు, ఇతర సేవలకు సంబంధించి మార్కెటింగ్ కోసం చేసిన వ్యయాల రూపేణా బ్యాంకుపై రూ.63 కోట్ల భారం పడింది. చీఫ్ ఫైనాన్షియల్ అధికారి జైమిన్ భట్ మాట్లాడుతూ... ఎంసీఎల్‌ఆర్ రేటు మార్జిన్లపై ప్రభావం చూపిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర వడ్డీ మార్జిన్ 4.2–4.3 శాతానికి పరిమితం అవుతుందని చెప్పారు. రుణాల్లో 19 శాతం వృద్ధి నమోదైంది. వాణిజ్య వాహనాలు, నిర్మాణ రంగ ఎక్విప్‌మెంట్ విభాగాల్లో అధికంగా రుణాలివ్వడమే దీనికి కారణం. పెద్ద కార్పొరేట్లు, కన్జ్యూమర్ రుణాల్లోనూ వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఆస్తుల నాణ్యత విçషయానికొస్తే... స్థూల ఎన్‌పీఏలు 1.07%గా ఉన్నాయి. వీటికి కేటాయించిన నిధులు మాత్రం రూ.232కోట్లకు పెరిగాయి. దివాళా చర్యలకు ఆర్‌బీఐ గుర్తించిన 12 భారీ ఎన్‌పీఏ కేసుల్లో నాలుగింటిలో కోటక్ బ్యాంకు వాటా కూడా ఉంది.