2 వేల కోట్ల ఆదాయం సాధిస్తాం
♦ కృష్ణపట్నం పోర్టు సీఈవో అనిల్ యెండ్లూరి
♦ రూ.300 కోట్లతో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్
♦ బంకరింగ్‌తో ఓడలకు నేరుగా ఇంధనం నింపొచ్చు
♦ కొత్త పోర్టులు వచ్చినా మా బిజినెస్‌కు ఢోకా ఉండదు
సాక్షి, అమరావతి : ప్రైవేటు రంగ కృష్ణపట్నం పోర్టు వేగంగా విస్తరిస్తోంది. బల్క్ కార్గోతో పాటు కంటైనర్ కార్గోలోనూ తనదైన ముద్ర వేస్తోంది. భారీ విస్తరణ ప్రణాళికల అమల్లో ఉన్న ఈ పోర్టు... తక్కువ వ్యయంతోనే ఎగుమతి, దిగుమతులకు అవకాశం కల్పించటంపైనా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో పోర్టు సీఈఓ అనిల్ యెండ్లూరి... సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా పోర్టులు వచ్చినా ఇబ్బంది లేదంటున్న అనిల్‌తో ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ...
రాష్ట్రంలో కొత్తగా మరో రెండు పోర్టులొస్తున్నాయి. ఈ పోటీని ఎలా ఎదుర్కొంటారు?
రాష్ట్రంలో పోర్టు వ్యాపారానికి అపారమైన అవకాశాలున్నాయి. ముఖ్యంగా కంటైనర్ కార్గో మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. కొత్తగా వచ్చే పోర్టుల ప్రభావం మాపై ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. కానీ వాటన్నిటికంటే ముందుగా పోర్టులతో పాటు దానికి తగ్గట్టు రోడ్లు, రైల్వే, విమానాలతో కలిసిన ఇంటిగ్రేటెడ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్ అభివృద్ధి కావాలి. తూర్పు తీర ప్రాంతానికి మన రాష్ట్రం ముఖ ద్వారంగా ఉంది. దీంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాల నుంచి వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. పోర్టులే కాకుండా వాటి పక్కనే పోర్టు ఆధారిత పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలి.
కంటైనర్ కార్గోలో ఇండియా ఎందుకు పోటీ పడలేకపోతోంది?
విదేశీ ఎగుమతుల విషయంలో కంటైనర్ కార్గో ద్వారా తక్కువ ధరతో పోటీ పడొచ్చు. కానీ ఈ రంగంలో మనం పూర్తిగా వెనుకబడి ఉన్నాం. సింగపూర్ అనే చిన్న దేశంలోని పోర్టు ఏటా 30 మిలియన్ టీఈయూ కార్గోని హ్యాండిల్ చేస్తుంటే మన దేశంలోని అన్ని పోర్టులు కలిసి 9 ఎంటీఈయూ మించి చేయడం లేదు. చివరికి కొలంబో కంటే మన దేశం వెనకబడిపోయింది. దీనిక్కారణం సరైన లాజిస్టిక్స్ లేకపోవడమే. గతంలో ఢాకా నుంచి మన దేశానికి ఏదైనా కంటైనర్ రావాలంటే 30 రోజులు పట్టేది. లక్ష రూపాయలు ఖర్చయ్యేది. ఇప్పుడు నేరుగాా ఢాకాకి కంటైనర్ కార్గో అందుబాటులోకి రావడంతో రూ.40,000 వ్యయంతో ఏడు రోజుల్లోనే కంటైనర్ పంపే వెసులుబాటు కలుగుతోంది. దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవుతున్నాయి. అందుకే కంటైనర్ కార్గోని ప్రోత్సహించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందన్న సంకేతాలు ఎగుమతి దిగుమతులపై కనిపిస్తున్నాయా?
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లావాదేవీల్లో వృద్ధి కనిపిస్తోంది. 2015-16లో మొత్తం 35.06 ఎంఎంటీల బల్క్ కార్గోను హ్యాండిల్ చేయగా ఈ ఏడాది 40 ఎంఎంటీలు దాటుతుందని అంచనా వేస్తున్నాం. కంటైనర్ కార్గోలోనూ మంచి వృది ్ధకనిపిస్తోంది. ఆదాయం విషయానికొస్తే ఈ ఏడాది రూ. 2,000 కోట్ల మార్కును చేరుకుటాం. గతేడాది ఆదాయం రూ. 1,800 కోట్లుగా ఉంది.
పోర్టు విస్తరణ ఎంతవరకూ వచ్చింది?
రెండో దశ విస్తరణ పనులు జరుగుతున్నాయి. మొత్తం రూ.20,000 కోట్ల పెట్టుబడి అంచనాతో 2007లో పనులు ప్రారంభించగా ఇప్పటి వరకు రూ. 8,000 కోట్లు వెచ్చించాం. రూ. 300 కోట్ల పెట్టుబడితో రెండు ప్రత్యేక లిక్విడ్ కార్గో బెర్తులను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ఒక బెర్తు ఎల్‌ఎన్‌జీ/ఎల్‌పీజీ కోసం కాగా మరొకటి కెమికల్ షిప్స్ కోసం. సింగపూర్ మాదిరి నేరుగా ఓడలకు ఇంథనం నింపే బంకరింగ్ సౌకర్యాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇవికాక 200 ఎంపీటీఏ సామర్థ్యంతో 42 బెర్తులు, 600 ఎకరాల్లో ప్రత్యేక కంటైనర్ టెర్మినల్‌ను అభివృద్ధి చేస్తున్నాం. తూర్పు తీరంలో కీలకమైన పోర్టుగా కృష్ణపట్నాన్ని తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం.