ఎల్ అండ్ టీ సీఈవోగా సుబ్రమణ్యన్
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్‌అండ్‌టీ కొత్త సీఈవోగా ఎస్‌ఎన్ సుబ్రమణ్యన్ నియమితులయ్యారు. జూలై 1 నుంచి ఆయన సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం సుబ్రమణ్యన్ డిప్యూటీ ఎండీగా ఉన్నారు. 1984లో ఎల్‌అండ్‌టీలో చేరిన ఆయన వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఇటు భారత్ అటు మధ్యప్రాచ్యంలో పలు ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను పర్యవేక్షించారు. మరోవైపు, దాదాపు 17 ఏళ్లుగా సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏఎం నాయక్.. సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 1 నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
మూడేళ్ల పాటు ఆయన ఈ హోదాలో కొనసాగుతారని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. సుమారు 52 ఏళ్లుగా ఎల్‌అండ్‌టీలో నాయక్ వివిధ హోదాల్లో పనిచేశారు. 1999లో సీఈవో, ఎండీగా నియమితులైన ఆయన .. 2003లో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. నాయక్ సారథ్యంలో ఎల్‌అండ్‌టీ గ్రూప్ 16 బిలియన్ డాలర్ల దిగ్గజంగా ఎది గింది. ఇంజనీరింగ్, నిర్మాణ రంగాలతో పాటు టెక్నాలజీ, తయారీ, ఆర్థిక సేవల రంగాల్లోకి కూడా ప్రవేశించింది. 30 పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 1999లో రూ. 4,400 కోట్లుగా ఉన్న కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ. 1.58 లక్షల కోట్లకు చేరింది.