హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మసీ స్టూడెంట్స్‌కు ఎదురయ్యే ప్రధాన సమస్య... ల్యాబ్స్, రసాయనాలు అందుబాటులో ఉండకపోవటం. గ్రామీణ, పట్టణాల్లోని కాలేజీల్లో అయితే మరీనూ! నెల్లూరులో బీ–ఫార్మసీ చదివిన బ్రహ్మం పెద్దపోతులకూ ఇదే సమస్య. కానీ, తాను మాత్రం అక్కడితో ఆగిపోకుండా దీనికో పరిష్కారం చూపించాడు. రసాయనాలు, ల్యాబ్ పరికరాలు, వైద్య ఉపకరణాలను విక్రయించేందుకు ‘వైట్‌అప్రాన్. ఇన్’ ప్రారంభించాడు. మరిన్ని వివరాలు ‘స్టార్డప్ డైరీ’తో ఆయన మాటల్లోనే... ‘‘మాది వైఎస్‌ఆర్ కడప జిల్లా పులివెందుల. నెల్లూరులో బీఫార్మసీ పూర్తయ్యాక.. చదువుకునేటపుడు నాకెదురైన ఇబ్బందులను పరిష్కారం చూపించాలని నిర్ణయించుకున్నా. కానీ, సొంతంగా కంపెనీ పెట్టే ఆర్థిక స్థోమత లేకపోవటంతో ఉద్యోగంలో చేరా. జువెంటస్ లైఫ్ సైన్సెస్‌లో ఏడాది పాటు ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేశా. తర్వాత 104లో చేరా. అక్కడి నుంచి సొంతంగా కంపెనీ పెట్టాలని ఈ ఏడాది జనవరిలో రూ.2 లక్షల పెట్టుబడితో తిరుపతి కేంద్రంగా వైట్‌అప్రాన్ ఈ–ఎడ్యు కామర్స్ ప్రై.లి. ప్రారంభించాం. మాది ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ (ఏపీఐఎస్) ఇంక్యుబేట్ స్టార్టప్. ఫార్మా విద్యార్థులు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఆసుపత్రులు, ల్యాబ్స్‌కు రసాయనాలు, ల్యాబ్, వైద్య పరికరాలను విక్రయించడం మా ప్రత్యేకత.
హైదరాబాద్ వాటా 20 శాతం..
వైట్‌అప్రాన్‌లో రసాయనాలు, ల్యాబ్, వైద్య పరికరాలుంటాయి. అల్యూమినియం అమ్మోనియం, కాల్షియం కార్బైడ్, గ్లూకోమీటర్స్, ఈసీజీ కేబుల్స్, టెస్ట్ ట్యూబ్స్, హెచ్‌పీఎల్‌సీ, సర్జికల్ సెట్స్ వంటి సుమారు 10 వేల వరకు ఉత్పత్తులన్నాయి. వీటి ప్రారంభ ధర రూ.100. ప్రస్తుతం నెలకు రూ.30 లక్షల విలువ చేసే ఆర్డర్లు వస్తున్నాయి. ప్రతి ఆర్డర్‌పై 7–12 శాతం వరకు కమిషన్ ఉంటుంది. మా మొత్తం ఆర్డర్లలో 20 శాతం హైదరాబాద్ వాటా. తెలుగు రాష్ట్రాలతో పాటూ బిహార్, హిమాచల్ ప్రదేశ్ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి.
రూ.50 కోట్ల ఆదాయం లక్ష్యం..
ప్రస్తుతం రసాయనాలు, ల్యాబ్, వైద్య పరికరాల విభాగంలో 60 మంది వర్తకులు నమోదయ్యారు. వచ్చే ఏడాది నాటికి వెండర్స్ సంఖ్యను వెయ్యికి చేరుస్తాం. బిట్స్ పిలానీ, గీతం, నైపర్, ఎస్‌వీఎస్ వంటి 25 యూనివర్సిటీలు, కాలేజీలు మా కస్టమర్లుగా ఉన్నాయి. గత నెలలో రూ.12 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. వచ్చే ఏడాది కాలంలో రూ.50 కోట్ల ఆదాయాన్ని లకిష్యంచాం.
రూ.15 లక్షల సమీకరణ..
ప్రస్తుతం తిరుపతి, హైదరాబాద్‌లో కార్యాలయాలున్నాయి. వచ్చే ఏడాది కాలంలో లక్ష ఉత్పత్తులతో పాటూ కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, ముంబై మార్కెట్లలో విస్తరించాలన్నది లక్ష్యం. ఆర్డర్ల డెలివరీ కోసం బెంగళూరుకు చెందిన షిప్‌కరో లాజిస్టిక్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలోనే పోస్టల్ విభాగంతోనూ ఒప్పందం చేసుకుంటాం. ప్రస్తుతం మా కంపెనీలో ఆరుగురు ఉద్యోగులున్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఇన్వెస్టర్ నుంచి రూ.15 లక్షల నిధులను సమీకరించాం’’ అని బ్రహ్మం వివరించారు.
ఫార్మా హబ్ వైట్ అప్రాన్!
Published Sat, Dec 22 2018 12:49 AM | Last Updated on Sat, Dec 22 2018 12:51 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment