ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: అంతకంతకూ కొండలా పేరుకుపోతున్న మొండిబకాయిలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) భారీ మొత్తంలోనే రుణాలను మాఫీ చేస్తున్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో మొత్తం పీఎస్‌బీలు రూ.81,683 కోట్ల విలువైన రుణాలను మాఫీ (రైటాఫ్) చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, బ్యాంకులు పన్ను ప్రయోజనాల కోసం, అదేవిధంగా మూలధన సద్వినియోగం కోసం బ్యాలెన్స్ షీట్ రైటాఫ్ కింద చూపిస్తాయని... సంబంధిత రుణ గ్రహీతలు ఈ బకాయిలను తిరిగి చెల్లించాల్సిందేనని జైట్లీ స్పష్టంచేశారు. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రూ.20,339 కోట్ల విలువైన రుణాలను రైటాఫ్ చేసినట్లు ఆయన తెలియజేశారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో (2017–18) సెప్టెంబర్ వరకూ పీఎస్‌బీలు రూ.28,781 కోట్ల రుణాలను రైటాఫ్ చేశాయి. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం నాలుగేళ్లకు పైబడిన మొండి బకాయిలను (పూర్తిస్థాయిలో ప్రొవిజనింగ్ చేసిన వాటితో సహా) బ్యాంకులు వాటి బ్యాలెన్స్ షీట్‌ల నుంచి తొలగిస్తాయి. దీన్నే సాంకేతికంగా రైటాఫ్ కింద పరిగణిస్తారు. అయితే, చట్టపరంగా ఈ బకాయిల వసూలు ప్రక్రియను బ్యాంకులు కొనసాగిస్తాయని, అందువల్ల రైటాఫ్‌తో రుణ గ్రహీతలకు ప్రయోజనం చేకూర్చినట్లు భావించకూడదని జైట్లీ వివరించారు.
బ్యాంకింగ్ మోసాలు ః రూ.52,717 కోట్లు
గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2013 ఏప్రిల్ 1 నుంచి) బ్యాంకింగ్ రంగ మోసాలకు సంబంధించి 13,643 కేసులు వెలుగుచూశాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్ శుక్లా పార్లమెంటులో చెప్పారు. ఈ మోసాల విలువ రూ.57,717 కోట్లుగా ఆయన తెలిపారు. ఇక బినామీ చట్టం–2018 కింద ఇప్పటివరకూ వెయ్యికిపైగా ఆస్తులను ప్రాథమికంగా జప్తు (అటాచ్) చేసినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వీటి విలువ రూ.3,800 కోట్లకు పైగానే ఉంటుందని శుక్లా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment