మార్కెట్లో భారీ హెచ్చుతగ్గులు! | Large fluctuations in stock market | Sakshi
Sakshi News home page

మార్కెట్లో భారీ హెచ్చుతగ్గులు!

Published Sun, Dec 21 2014 11:40 PM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

మార్కెట్లో భారీ హెచ్చుతగ్గులు! - Sakshi

మార్కెట్లో భారీ హెచ్చుతగ్గులు!

డెరివేటివ్స్ ముగింపు నేపథ్యం

కీలకంకానున్న విదేశీ అంశాలు
ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులే
మార్కెట్ నడకపై నిపుణుల అంచనాలు

 
ముంబై: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్‌ల(డెరివేటివ్స్) ముగింపు నేపథ్యంలో ఈ వారం దేశీ మార్కెట్లు భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశముందని స్టాక్ నిపుణులు అంచనా వేశారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా గురువారం(25న) మార్కెట్లు పనిచేయవు.  దీంతో ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్ట్‌ల గడువు బుధవారమే(24న) ముగియనుంది. వెరసి ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ఇక మరోవైపు  పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సైతం రెండు రోజుల్లో ముగియనున్నాయి. ఈ రెండు రోజుల్లోనూ కీలక బిల్లుల ఆమోదంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వీటితోపాటు, రష్యాలో జరిగే పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు వంటి అంశాలు సెంటిమెంట్‌ను ప్రభావితం చేయగలవని వివరించారు.

బీమా బిల్లుపై దృష్టి
పార్లమెంట్ సమావేశాలకు రెండు రోజులే గడువున్న కారణంగా బీమాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పెంపు వంటి బిల్లుల ఆమోదం కీలకంగా నిలవనున్నట్లు రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ పేర్కొన్నారు. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు బిల్లులు ఆమోదంపొందే అంశంపై దృష్టిపెడతారని తెలిపారు. ఇటీవల కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పతనమవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విధంగా డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ రూపాయి సైతం 13 నెలల కనిష్టాన్ని తాకింది. ఇలాంటి పలు అంశాల నేపథ్యంలో మార్కెట్లు ఈ వారం భారీ ఒడిదుడుకులను చవిచూస్తాయని పలువురు నిపుణులు చెప్పారు.

ప్రపంచ పరిణామాలు
జపాన్ మాంద్య పరిస్థితులు, చైనా, యూరప్ దేశాల ఆర్థిక మందగమనం వంటి విదేశీ పరిణామాలు మార్కెట్ల నడకను నిర్దేశిస్తాయని జియోజిత్ బీఎన్‌పీ పరిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ అభిప్రాయపడ్డారు. గ్లోబల్ స్థాయిలో కనిపిస్తున్న రిస్క్ పరిస్థితులు, ప్రత్యేకంగా ఆయిల్ ఉత్పాదక దేశాలు(ఒపెక్) ఎదుర్కొంటున్న సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు రేపుతున్నట్లు వివరించారు. ఇక దేశీయంగా చూస్తే వస్తు, సేవల పన్ను చట్టాన్ని(జీఎస్‌టీ) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం ఆశ్చర్యకర పరిణామమని వ్యాఖ్యానించారు. మొత్తంగా పన్నుల విధానాన్ని సంస్కరించే జీఎస్‌టీని కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గడిచిన శుక్రవారం(19న) లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం విదితమే.

ఈ నెలలో రూ. 14,000 కోట్ల పెట్టుబడులు
దేశీ క్యాపిటల్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకూ(డిసెంబర్1-19) రూ. 14,239 కోట్లు(2.3 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. వీటిలో ఈక్విటీలకు రూ. 3,430 కోట్లు(57 కోట్ల డాలర్లు), రూ.10,808 కోట్ల(1.75 బిలియన్ డాలర్లు) విలువైన రుణ సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. దీంతో ఈ ఏడాది జనవరి మొదలు డిసెంబర్19 వరకూ దేశీ క్యాపిటల్ మార్కెట్లలోకి ప్రవహించిన విదేశీ పెట్టుబడులు రూ. 2.6 లక్షల కోట్లను(42.6 బిలియన్ డాలర్లు) తాకాయి. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకావడం, సంస్కరణలను వేగవంతం చేయడం వంటి అంశాలు ఈక్విటీలలో పెట్టుబడులకు ప్రోత్సాహానిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement