మాల్యా కేసులో 8 మంది అరెస్ట్
వ్యాపారవేత్త విజయ్ మాల్యా రుణాల ఎగవేత కేసుకు సంబంధించి... ఐడీబీఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్ యోగేష్ అగర్వాల్ సహా 8 మందిని సీబీఐ గత సోమవారం అరెస్ట్ చేసింది. వీరిలో ఐడీబీఐ బ్యాంకు మాజీ ఉద్యోగులు ముగ్గురు, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన నలుగురు ఉన్నారు. సరైన తనఖాలు లేకుండా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కు రూ.950 కోట్లు రుణమిచ్చారని యోగేశ్ తదితరులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాల్యా నివాసం సహా బెంగళూరులోని యూబీ టవర్స్‌లో, అగర్వాల్ తదితరుల నివాసాల్లో సీబీఐ సోమవారం తనిఖీలు చేశాక అరెస్ట్‌లు జరిగాయి.
బీఎస్‌ఈ ఐపీఓకు భారీ స్పందన
బీఎస్‌ఈ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు అనూహ్య స్పందన లభించింది. దేశంలో తొలి స్టాక్ ఎక్సే్చంజ్ ఐపీఓ, ఈ ఏడాది తొలి ఐపీఓ కూడా అయిన బీఎస్‌ఈ ఐపీఓ 51 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓలో భాగంగా రూ.2 ముఖవిలువ గల 1.54,27,197(28.26 శాతం వాటా) షేర్లను జారీ చేయనున్నారు. యాంకర్ ఇన్వెస్టర్లకు మినహా జారీ చేయనున్న 1,07,99,039 షేర్లకు గాను 55,23,34,986 కోట్ల షేర్లకు బిడ్‌లు వచ్చాయి. బుధవారం ముగిసిన రూ.805–806 ఇష్యూ ధరగా ఉన్న ఈ రూ.1,243 కోట్ల ఐపీఓకు రూ.44,000 కోట్ల విలువైన బిడ్‌లు వచ్చాయి. డిమోనేటైజేషన్ తర్వాత వచ్చిన తొలి ఐపీఓ ఇది. లిస్టైన కంపెనీల సంఖ్య పరంగా చూస్తే ప్రపంచంలోనే అతి పెద్ద స్టాక్ ఎక్సే్చంజ్ బీఎస్‌ఈనే. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా చూస్తే ప్రపంచంలో పదవది. త్వరలో ఎన్ ఎస్‌ఈ రూ.10,000 కోట్ల ఐపీఓ రానుంది.
భారత్‌లో త్వరలో ఐఫోన్స్ తయారీ!
అమెరికా, చైనాలో ఐఫోన్ ల అమ్మకాలు మందగిస్తున్న నేపథ్యంలో టెక్నాలజీ దిగ్గజం యాపిల్ భారత మార్కెట్‌పై ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. వ్యయాలు తగ్గించుకునే దిశగా ఇప్పటికే భారత్‌లో ఐఫోన్ల తయారీపై ఆసక్తి వ్యక్తం చేసిన యాపిల్.. తాజాగా ఇందుకు సంబంధించిన ముసాయిదాను కూడా సిద్ధం చేసుకుంది. పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం కార్యదర్శి రమేశ్ అభిషేక్ సారథ్యంలోని అంతర్ మంత్రిత్వ శాఖల బృందంతో భేటీ అయిన కంపెనీ వర్గాలు ఈ విషయాలు వివరించాయి.
తెలుగులో భీమ్ యాప్
డిజిటల్ చెల్లింపులకు ఉపయోగపడే భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ (భీమ్) యాప్‌నకు సంబంధించి అప్‌డేటెడ్ వెర్షన్ ను విడుదల చేసినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్ పీసీఐ) వెల్లడించింది. అప్‌డేటెడ్ వెర్షన్ 1.2లో కొత్తగా తెలుగు, తమిళం, కన్నడం సహా ఏడు ప్రాంతీయ భాషలు కూడా చేర్చినట్లు పేర్కొంది. ఇప్పటిదాకా ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే ఇది లభిస్తోంది. డిసెంబర్ 30న ప్రవేశపెట్టినప్పట్నుంచీ భీమ్ యాప్‌నకు ఇది రెండో అప్‌డేట్.
డాక్టర్ రెడ్డీస్‌పై కొరియా కంపెనీ దావా
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే డాక్టర్ రెడ్డీస్‌కు మరో చిక్కు వచ్చి పడింది. డాక్టర్ రెడ్డీస్‌పై దక్షిణ కొరియాకు చెందిన బయోటెక్ కంపెనీ మెజియాన్ ఫార్మా కోర్టుకెక్కింది. ఉత్తమ తయారీ విధానం మార్గదర్శకాల (సీజీఎంపీ) విషయంలో పెద్ద ఎత్తున లోపాలను దాచిపెట్టి డాక్టర్ రెడ్డీస్ మోసానికి పాల్పడిందని ఆరోపిస్తూ అమెరికాలోని న్యూజెర్సీ స్టేట్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. నిబంధనల అమలులో తప్పుదోవ పట్టించి, మోసపూరితంగా విషయాలను దాచిపెట్టిన డాక్టర్ రెడ్డీస్ నుంచి మిలియన్ల డాలర్లను నష్టాల కింద వసూలు చేయాలని కోరింది.
పీవీఆర్ స్క్రీన్ల వేట
మల్టీప్లెక్స్ చెయిన్ ఆపరేటర్, పీవీఆర్ మరిన్ని ‘స్క్రీన్ల’ను చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా 30 స్క్రీన్లను కొనుగోలు చేయనున్నామని పీవీఆర్ తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 70–80 స్క్రీన్లను కొనుగోలు చేస్తామని కంపెనీ జాయింట్ ఎండీ సంజీవ్ కుమార్ బిజ్లి చెప్పారు. కొనుగోలు చేయడానికి పలు స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయని, కానీ తమకు తగినవి మాత్రమే కొనుగోలు చేయాలనుకుంటున్నామని, ఈ విషయమై కసరత్తు జరుగుతోందని వివరించారు. స్క్రీన్ల కొనుగోళ్ల కోసం ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోబోమని, అంతర్గత వనరుల నుంచే నిధులు సమకూర్చుకుంటామని వివరించారు. ప్రస్తుతం పీవీఆర్ సంస్థ 48 నగరాల్లో 122 ప్రోపర్టీల్లో 562 స్క్రీన్లను నిర్వహిస్తోంది.
మారుతీ కార్లు ప్రియం
మారుతీ సుజుకీ ఇండియా కార్ల ధరలు పెరిగాయి. అన్ని మోడళ్ల కార్ల ధరలను రూ.1,500 రూ.8,014 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)వరకూ పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. కమోడిటీ, రవాణా, నిర్వహణ వ్యయాలు పెరగడంతో ధరలను పెంచక తప్పడం లేదని వివరించింది. ఈ కంపెనీ రూ.2.45 లక్షల ధర ఉన్న ఆల్టో 800 నుంచి రూ.12.03 లక్షలు ధర ఉన్న ఎస్–క్రాస్ మోడల్ వరకూ వివిధ రకాల మోడళ్లను విక్రయిస్తోంది. గత ఏడాది ఆగస్టులో ఈ కంపెనీ కొన్ని రకాల మోడళ్ల కార్ల ధరలను రూ.1,500 నుంచి రూ.5,000 రేంజ్‌లో పెంచింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విటారా బ్రెజా ధరను రూ.20,000, ప్రీమియమ్ హ్యాచ్‌బాక్ బాలెనో ధరను రూ.10,000 చొప్పున పెంచింది.
గతవారం బిజినెస్
Published Mon, Jan 30 2017 12:54 AM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM
Advertisement
Advertisement