గతవారం బిజినెస్‌ | Last week Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్‌

Published Mon, Mar 20 2017 12:39 AM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM

గతవారం బిజినెస్‌

గతవారం బిజినెస్‌

ఎంఫసిస్‌ బైబ్యాక్‌కు వాటాదారుల ఆమోదం
ఎంఫసిస్‌ సంస్థ షేర్ల బైబ్యాక్‌కు వాటాదారుల ఆమోదం లభించింది. 1.73 కోట్ల షేర్లను (8.26 శాతం వాటా) బైబ్యాక్‌ చేయడానికి తమ కంపెనీ వాటాదారులు ఆమోదం తెలిపినట్లు సంస్థ ఎక్సే్చంజీలకు తెలిపింది. ఒక్కో షేర్‌ను రూ.635 ధరకు మించకుండా బైబ్యాక్‌ చేస్తామని, ఈ బైబ్యాక్‌  విలువ రూ.1,103 కోట్లని పేర్కొంది. గత ఏడాది డిసెంబర్‌ నాటికి ఈ కంపెనీలో ప్రమోటర్, ప్రమోటర్‌ గ్రూప్‌కు 60.42 శాతం వాటా ఉంది. ప్రజల వద్ద 39.58 శాతం వాటా ఉంది.  

నిఫ్టీ.. రికార్డులు చెరిగిపోయాయ్‌!
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ... మంగళవారం కొత్త రికార్డును సృష్టించింది. ఐదు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయం ముఖ్య ఇంధనంగా పనిచేయటంతో నిఫ్టీ రాకెట్‌లా దూసుకుపోయింది. సుస్థిర ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు తెస్తుందనే ఆశలతో కొనుగోళ్ల జోరు పెరిగింది. నిఫ్టీ...ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి..9,123 పాయింట్లను తాకి జీవిత కాల గరిష్ట స్థాయి.. 9,087 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్‌ రెండేళ్ల గరిష్ఠానికి ఎగసింది. 496 పాయింట్ల లాభంతో 29,443 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తమ్మీద భారతీయ స్టాక్‌ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సంపద ఈ ఒక్కరోజే ఏకంగా లక్షన్నర కోట్ల రూపాయల మేర పెరిగింది. అలాగే డాలర్‌తో పోలిస్తే తగ్గుతూ వస్తున్న రూపాయి మారకం విలువ కూడా ఒక్కసారిగా ఏడాదిన్నర గరిష్టానికి ఎగిసింది. 78 పైసలు బలపడి 65.82 వద్ద ముగిసింది.

పంట రుణాల మాఫీ సరికాదు: అరుంధతీ
రైతులకు ఇచ్చిన సాగు రుణాలను ప్రభుత్వాలు మాఫీ చేయడం మంచి సంప్రదాయం కాదని ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య అన్నారు. ఇటువంటి ప్రోత్సాహకాలు రుణాలు తిరిగి చెల్లించే తీరును దెబ్బతీసే అవకాశముందని అభిప్రాయపడ్డారు.  ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో రైతులకు రుణ మాఫీ హామీని బీజేపీ ఇచ్చిన నేపథ్యంలో అరుంధతీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ’’రుణాలను మాఫీ చేస్తే రుణాలు తిరిగి చెల్లించే అలవాటు తగ్గుతుంది. ఎందుకంటే రుణ మాఫీ పొందిన వారు భవిష్యత్తులోనూ రుణాల మాఫీపై ఆశలు పెట్టుకుంటారు. దాంతో భవిష్యత్తులో ఇచ్చే రుణాల చెల్లింపులు నిలిచిపోతాయి’’ అని భట్టాచార్య పేర్కొన్నారు.

ఎగుమతుల జోరు
ఎగుమతులు ఫిబ్రవరిలో పరుగులు తీశాయి. గత ఆరు నెలల కాలంలో అత్యధిక స్థాయిలో 17.48 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 24.5 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. పెట్రోలియం, ఇంజనీరింగ్, రసాయనాల ఎగుమతులు ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. అదే సమయంలో దిగుమతులు సైతం పెరగడంతో దేశ వాణిజ్య లోటు 8.89 బిలియన్‌ డాలర్లకు విస్తరించింది. గతేడాది సెప్టెంబర్‌ తర్వాత మొదటి సారి ఎగుమతుల్లో రెండంకెల సానుకూల వృద్ధి నమోదైందని వాణిజ్య శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఇక దిగుమతులు ఫిబ్రవరిలో 21.76 శాతం అధికంగా 33.38 డాలర్ల మేర జరిగాయి.

ఫండ్‌ పరిశ్రమ ప్రచారకర్తలుగా సెలబ్రిటీలు!
మ్యూచువల్‌ ఫండ్స్‌పై ఇన్వెస్టర్లలో అవగాహన పెంచే దిశగా స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ కొత్త అడ్వర్టై జింగ్‌ కోడ్‌కు ఆమోదముద్ర వేసింది. దీనితో ఇకపై మ్యూచువల్‌ ఫండ్స్‌ రంగానికి సెలబ్రిటీలు కూడా ప్రచారకర్తలుగా వ్యవహరించవచ్చు. అయితే ఇది మొత్తం పరిశ్రమకు ప్రచారం కల్పించేలా ఉండాలే తప్ప ఏ ఒక్క పథకాన్నో లేదా ఏ ఒక్క అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ) ప్రమోట్‌ చేసేలా ఉండకూడదు. ఇలా సెలబ్రిటీలతో జారీ చేసే ప్రకటనలకు మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ ముందుగా సెబీ ఆమోదముద్ర తీసుకోవాలి.

ఫెడ్‌ రేట్లు పావు శాతం పెంపు
అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ రేట్లు పావు శాతం పెంచింది. ఫెడ్‌ ఫండ్స్‌ వడ్డీ రేట్ల శ్రేణి 0.75–1 శాతం మేర ఉం టుందని వెల్లడించింది. ఈ ఏడాది మరో రెండు విడతలు, వచ్చే ఏడాది మూడు విడతల మేర వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని ఫెడ్‌ కమిటీ అంచనా వేసింది. మరోవైపు ద్రవ్యోల్బణం లకి‡్ష్యంచిన రెండు శాతం స్థాయికి పెరగగలదని ఫెడరల్‌ రిజర్వ్‌ పేర్కొంది. అటు జీడీపీ, ద్రవ్యోల్బణం అంచనాలు యథాతథంగా కొనసాగిస్తున్నట్లు వివరించింది. ఉద్యోగ గణాంకాలు, ఇన్వెస్టర్లు సహా వ్యాపార వర్గాల విశ్వాసం గణనీయంగా మెరుగుపడటం వంటి తదితర అంశాలు రేట్ల పెంపునకు తోడ్పడ్డాయి. కాగా, రేట్ల పెంపు అనంతరం అంచనాలకు భిన్నంగా డాలర్‌ ఇండెక్స్‌ తగ్గడం విశేషం.

ఎయిర్‌టెల్‌ రూ.10 వేల కోట్ల సమీకరణ
టెలికం దిగ్గజ కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ రూ.10,000  కోట్ల నిధుల సమీకరణకు ఆ కంపెనీ వాటాదారులు ఆమోదం తెలిపారు. సెక్యూర్డ్‌ లేదా అన్‌సెక్యూర్డ్‌ రిడీమబుల్‌ నాన్‌కన్వర్టబుల్‌ డిబెంచర్లు/బాండ్లను ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా జారీ చేయడానికి తమ వాటాదారులు ఆమోదం తెలిపారని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. అంతే కాకుండా తమ పూర్తి అనుబంధ సంస్థ, భారతీ ఎయిర్‌టెల్‌ ఇంటర్నేషనల్‌ (మారిషస్‌)లిమిటెడ్‌లోని ఇన్వెస్ట్‌మెంట్‌ను మరో అనుబంధ సంస్థ, నెట్‌వర్క్‌ ఐ2ఐలోకి బదిలీ చేసే ప్రతిపాదనకు కూడా వాటాదారులు ఆమోదం తెలిపారని పేర్కొంది.

‘యంగ్‌ గ్లోబల్‌ లీడర్స్‌’ జాబితాలో మనోళ్లు
వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) వంద మంది యంగ్‌ గ్లోబల్‌ లీడర్స్‌ జాబితా–2017లో ఐదుగురు భారతీయులు స్థానం దక్కించుకున్నారు. జాబితాలో పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ.. హాస్పిటాలిటీ బ్రాండ్‌ తమర కూర్జ్‌ డైరెక్టర్‌ శ్రుతి శిబులాల్‌ ఉన్నారు. వీరితోపాటు బ్లిప్పర్‌ వ్యవస్థాపకుడు అంబరీశ్‌ మిత్రా, ఫార్చూన్‌ ఇండియా ఎడిటర్‌ హిందోల్‌ సేన్‌గుప్తా, స్వానిటీ ఫౌండేషన్‌ సీఈవో రిత్విక భట్టాచార్య కూడా జాబితాలో స్థానం పొందారు. కాగా డబ్ల్యూఈఎఫ్‌ ప్రతి ఏడాది 40 ఏళ్లలోపు వయస్సున్న 100 మందితో ఈ జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. వినూత్నమైన ఆవిష్కరణలతో ప్రపంచంలోని క్లిష్టమైన సవాళ్లకు పరిష్కారం చూపిన వారికి సంస్థ ఈ జాబితాలో స్థానం కల్పిస్తుంది.

రూ.10 ప్లాస్టిక్‌ నోట్లు వచ్చేస్తున్నాయ్‌..!
భవిష్యత్‌లో పది రూపాయల ప్లాస్టిక్‌ నోట్లు మనకు దర్శనమివ్వనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 ప్లాస్టిక్‌ నోట్ల ప్రింట్‌కు తన అనుమతిని ఆర్‌బీఐకి చేరవేసింది. ఆర్‌బీఐ దేశంలోని ఐదు ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ నోట్ల వాడకంపై ట్రయల్స్‌ నిర్వహించనుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేగ్వాల్‌ తెలిపారు.

డీల్స్‌..
చిప్‌ తయారీ దిగ్గజం ఇంటెల్‌ తాజాగా ఇజ్రాయెల్‌కి చెందిన సెన్సర్‌ కంపెనీ మొబైల్‌ఐని కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌ విలువ సుమారు 15.3 బిలియన్‌ డాలర్లు. మొబైల్‌ఐ .. కార్ల తయారీ సంస్థలకు సెల్ఫ్‌ డ్రైవింగ్‌ సిస్టమ్స్‌ ను సరఫరా చేస్తుంది.

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌... ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌)కు చెందిన సెక్యూ రిటీస్‌ సర్వీసెస్‌ అనుబంధ కంపెనీ, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సెక్యూరిటీస్‌ సర్వీసెస్‌ (ఐఎస్‌ఎస్‌ఎల్‌)ను కొనుగోలు చేస్తోంది. ఈ సంస్థలో నూరు శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ఇండస్‌ఇండ్‌ తెలిపింది.

విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా జెట్‌ ఎయిర్‌వేస్, ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఉబెర్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం జెట్‌ ఎయిర్‌వేస్‌ యాప్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే ప్రయాణికులు ఉబెర్‌ ట్యాక్సీని కూడా బుక్‌ చేసుకోవచ్చు.

సన్‌ ఫార్మాస్యూటికల్స్‌ గ్రూప్‌కు చెందిన టారో కంపెనీ కెనడాకు చెందిన థల్లియన్‌ ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీని 27 లక్షల కెనడా డాలర్లకు కొనుగోలు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement