ముంబై: అమెరికా ద్రవ్యోల్బణ 40 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడంతో యూఎస్ ఫెడ్ రిజర్వ్ అంచనాల కంటే ముందుగానే వడ్డీరేట్లను పెంచవచ్చనే భయాలతో ఈక్విటీ మార్కెట్లు వారాంతాన కుప్పకూలాయి.
దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ 21 పైసలు నష్టపోయి 7 వారాల కనిష్ట స్థాయి 75.36కు పతనమైంది. ఆయా పరిస్థితుల్లో శుక్రవారం సెన్సెక్స్ 773 పాయింట్లు క్షీణించి 58,153 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 231 పాయింట్లు నష్టపోయి 17,375 వద్ద నిలిచింది. దీంతో సూచీల మూడురోజుల వరుస లాభాలకు బ్రేక్ పడినట్లైంది.
సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లలో కేవలం షేర్లు మాత్రమే లాభపడ్డాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఐటీ, ప్రభుత్వరంగ షేర్లు అధిక నష్టాన్ని చవిచూశాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్లను విక్రయాల ఒత్తిడికి లోనుకావడంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్ ఇండెక్సులు రెండుశాతం క్షీణించాయి. ఈ జనవరి 12 తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ.108 కోట్ల షేర్లను కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు రూ.697 కోట్ల షేర్లను అమ్మేశారు. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 492 పాయింట్లు, నిఫ్టీ 142 పాయింట్లు నష్టపోయాయి. ఆసియాలో హాంగ్‌కాంగ్, కొరియా, చైనా దేశాల స్టాక్ సూచీలు ఒకశాతం నుంచి అరశాతం నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు కూడా అమ్మకాల ఒత్తిడికిలోనై అరశాతం మేర క్షీణించాయి.
ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ప్రథమార్ధంలో సెన్సెక్స్ 1012 పాయింట్లు పతనమై 57,914 వద్ద, నిఫ్టీ 302 పాయింట్లు నష్టపోయి 17,303 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. మిడ్‌సెషన్‌లో కనిష్టస్థాయిల వద్ద పలు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో అమ్మకాల ఉధృతి తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment