బిట్‌కాయిన్స్‌తో జాగ్రత్త: ఆర్‌బీఐ
బిట్‌కాయిన్స్ వంటి వర్చువల్ కరెన్సీల ట్రేడింగ్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని యూజర్లు, ట్రేడర్లను రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించింది. బిట్‌కాయిన్ లేదా ఇతర వర్చువల్ కరెన్సీల (వీసీ) నిర్వహణ, చెలామణికి సంబంధించి ఏ కంపెనీకి కూడా లైసెన్సులు ఇవ్వలేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. వీసీలు ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో ఉంటాయి కనుక హ్యాకింగ్, మాల్‌వేర్ దాడుల బారినపడే ప్రమాదముంటుందని తెలిపింది.
ఎల్‌ఐసీ ’స్టాక్’ పెట్టుబడులు రూ.44,000 కోట్లు
ఎల్‌ఐసీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–నవంబర్ కాలానికి స్టాక్ మార్కెట్లో రూ.44,000 కోట్లు పెట్టుబడులు పెట్టింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి పెట్టిన పెట్టుబడులు రూ.29,000 కోట్లతో పోలిస్తే 52 శాతం వృద్ధి నమోదైనట్లు ఎల్‌ఐసీ చైర్మన్ వి.కె. శర్మ చెప్పారు.
మార్చి 31 వరకూ పాన్–ఆధార్ అనుసంధానం
కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆధార్‌తో పాన్ అనుసంధాన గడువును మరోసారి పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు రెండింటిని అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది. కొందరు పన్ను చెల్లింపుదారులు వారి పాన్ నంబర్‌ను ఇప్పటికీ ఆధార్‌తో అనుసంధానం చేసుకోలేదనే అంశం తమ దృష్టికి వచ్చిందని, అందుకే తాజాగా గడువును పొడిగిస్తున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
పతంజలి ’సూర్య’ మంత్ర
పతంజలి ఆయుర్వేద్ సోలార్ విద్యుత్ ఎక్విప్‌మెంట్ తయారీని లక్ష్యంగా ఎంచుకుంది. గ్రేటర్ నోయిడాలో ఇందుకు సంబంధించిన ఫ్యాక్టరీ వచ్చే కొన్ని నెలల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తుందని పతంజలి ఆయుర్వేద్ ఎండీ బాలకృష్ణ వెల్లడించారు.
ప్రభుత్వ రుణ భారం రూ.65.65 లక్షల కోట్లు
ప్రభుత్వ రుణ భారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై–సెప్టెంబర్)లో 2.53% పెరిగింది. ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో రూ.64,03,138 కోట్లున్న ప్రభుత్వ రుణ భారం, సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక కాలానికి రూ.65,65,652 కోట్లకు చేరిందని ప్రభుత్వ రుణ నిర్వహణకు సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడించింది. మొత్తం రుణ భారంలో అంతర్గత రుణ వాటా 93%. ఇందులో మార్కెట్ బాండ్ల వాటా 82.6 %.
ఎగుమతులకు మరిన్ని ప్రోత్సాహకాలు
ఎగుమతులు బలోపేతమే లక్ష్యంగా మరిన్ని ప్రోత్సాహకాలతో కేంద్ర ప్రభుత్వం విదేశీ వాణిజ్య విధానానికి (ఎఫ్‌టీపీ) తాజా మెరుగులద్దింది. 2015–20 వాణిజ్య విధానాన్ని మధ్యంతరంగా సమీక్షించి పలు ప్రోత్సాహకాలతో మళ్లీ ఆవిష్కరించింది. సరుకుల ఎగుమతుల పథకం (ఎంఈఐఎస్) ప్రోత్సాహకాన్ని 2 శాతం మేర పెంచినట్టు కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు ఎఫ్‌టీపీ విడుదల సందర్భంగా తెలిపారు. వార్షిక ప్రోత్సాహక బడ్జెట్ 34 శాతం పెంపుతో రూ.8,450 కోట్లకు చేరిందన్నారు.
రేట్లలో మార్పుల్లేవు
పెరుగుతున్న చమురు ధరలు, ఇతర అంశాల నేపథ్యంలో ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ మానిటరీ పాలసీ (ఎంపీసీ) కమిటీ సంచలనాలకు పోకుండా సాదాసీదాగా ద్రవ్యపరపతి విధాన సమీక్షను ముగించేసింది. వడ్డీ రేట్లు తగ్గించాలన్న ప్రభుత్వ, పరిశ్రమ డిమాండ్లను ప్రస్తుతానికి పక్కనపెట్టేసి కఠిన విధానానికే కట్టుబడింది. కీలకమైన రెపో రేటును 6 శాతంగా, రివర్స్ రెపోను 5.75 శాతంగా కొనసాగిస్తూ నిర్ణయాలను ప్రకటించింది. ఇక ద్రవ్యోల్బణం అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల కాలానికి 4.3–4.7 శాతానికి పెంచింది.
ప్రభుత్వం చేతికి యూనిటెక్ పగ్గాలు
రుణ సంక్షోభంలో ఇరుక్కుపోయిన రియల్టీ దిగ్గజం యూనిటెక్‌కి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) గట్టి షాకిచ్చింది. నిధుల స్వాహా, నిర్వహణ లోపాల అభియోగాలపై యూనిటెక్ బోర్డులోని మొత్తం ఎనిమిది మంది డైరెక్టర్లను సస్పెండ్ చేసింది. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం కొత్తగా పది మంది డైరెక్టర్లను నామినేట్ చేయాలని ఆదేశించింది. వారి పేర్లను తదుపరి విచారణ తేదీ డిసెంబర్ 20లోగా అందించాలని కేంద్రానికి సూచించింది.
భారత్‌కు గూగుల్ బొనాంజా!!
భారత్ తదితర మార్కెట్లలో ఇంటర్నెట్ వినియోగాన్ని మరింత పెంచే దిశగా టెక్ దిగ్గజం గూగుల్ పలు ఆవిష్కరణలు చేసింది. చౌక స్మార్ట్‌ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ ’ఓరియో గో’ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. అలాగే ద్విచక్ర వాహనదారులకూ మరింతగా ఉపయోగపడేలా మ్యాప్స్‌కి సంబంధించి బైక్ మోడ్ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. అటు రిలయన్స్ జియో స్మార్ట్ ఫీచర్ ఫోన్లలో గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ కస్టమైజ్డ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది.
ఆన్‌లైన్ ద్వారానే పీపీఎఫ్ అకౌంట్
ప్రైవేట్ రంగ దిగ్గజ ’ఐసీఐసీఐ బ్యాంక్’ తాజాగా ఆన్‌లైన్ ద్వారానే పీపీఎఫ్ ఖాతాను తెరిచేలా డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్లు తాజా డిజిటల్ సేవల్లో భాగంగా ఆన్‌లైన్లోనే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అకౌంట్‌ను తక్షణం తెరవొచ్చు. అంటే బ్యాంక్ కస్టమర్లు పీపీఎఫ్ అకౌంట్ కోసం బ్రాంచ్‌లకు వెళ్లాల్సిన పనిలేదు. ఇంటర్నెట్/మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా పీపీఎఫ్ ఖాతా తెరవొచ్చు.
పెరిగిన ఫారెక్స్ నిల్వలు
భారత విదేశీ మారక నిల్వలు పెరిగాయి. డిసెంబర్ 1తో ముగిసిన వారంలో ఇవి 1.2 బిలియన్ డాలర్లమేర పెరుగుదలతో 401.94 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ కరెన్సీ అసెట్స్‌లో పెరుగుదలే ఫారెక్స్ నిల్వల వృద్ధికి కారణమని ఆర్‌బీఐ పేర్కొంది. విదేశీ కరెన్సీ అసెట్స్ 1.15 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 377.45 బిలియన్ డాలర్లకు ఎగశాయి. గత కొన్ని నెలలుగా స్థిరంగా ఉంటూ వస్తోన్న బంగారం నిల్వల్లో 36.5 మిలియన్ డాలర్లమేర పెరుగుదల నమోదయింది. ఇవి 20.7 బిలియన్ డాలర్లకు చేరాయి.
ఆటోమొబైల్స్
♦ దేశీ వాహన తయారీ కంపెనీ ’మహీంద్రా అండ్ మహీంద్రా’ తన ప్రముఖ ఎస్‌యూవీ ’ఎక్స్‌యూవీ 500’లో పెట్రోల్ వేరియంట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఢిల్లీలో దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.15.49 లక్షలు.
♦ ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ ’యమహా మోటార్ ఇండియా’ తన సూపర్‌బైక్ ’వైజడ్‌ఎఫ్–ఆర్1’లో అప్‌డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. ఢిల్లీలో దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.20.73 లక్షలు. ఈ కొత్త బైక్‌లో 998 సీసీ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది.
♦ చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ’హువావే’.. ’హానర్ 7ఎక్స్’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఇది రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. 4 జీబీ ర్యామ్/ 32 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.12,999గా, 4 జీబీ ర్యామ్/ 64 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది.
♦ ప్రముఖ వాహన కంపెనీ ’టీవీఎస్ మోటార్’ సూపర్ ప్రీమియం బైక్స్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ’అపాచీ ఆర్‌ఆర్ 310’ పేరుతో సరికొత్త స్పోర్ట్స్ బైక్‌ను మార్కెట్‌లోకి ఆవిష్కరించింది. దీని ధర రూ.2.05 లక్షలు (ఎక్స్‌షోరూమ్). అపాచీ ఆర్‌ఆర్ 310లో 4 స్ట్రోక్, 4 వాల్వ్, సింగిల్ సిలిండర్, రివర్స్ ఇన్‌క్లైన్‌డ్, 312 సీసీ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది.
♦ టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) తన కొత్త ఎస్‌యూవీ మోడల్ ’రేంజ్ రోవర్ వెలార్’ను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.78.83 లక్షల నుంచి రూ.1.38 కోట్ల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది.
డీల్స్..
♦కస్టమర్లకు ప్రపంచ స్థాయి డిజిటల్ కంటెంట్‌ను అందించడంలో భాగంగా టెలికం దిగ్గజ కంపెనీ భారతీ ఎయిర్‌టెల్.. ఆన్‌లైన్ బుక్‌స్టోర్ జగర్‌నాట్ బుక్స్‌లో వ్యూహాత్మక వాటాను కొనుగోలు చేసింది.
♦ ఫాస్ట్‌ఫుడ్ చైన్ రెస్టారెంట్లు నిర్వహిస్తున్న హలోకర్రీ... యూకేకు చెందిన ఫుడ్ అడ్వైజర్ యాప్‌తో జత కట్టింది.
♦ టాటా ప్రాజెక్ట్స్, దక్షిణ కొరియాకు చెందిన దేవూ ఈఅండ్‌సీ కంపెనీల సంయుక్త సంస్థ రూ.5,612 కోట్ల విలువైన కాంట్రాక్టును దక్కించుకుంది. ఇందులో భాగంగా భారత్‌లో పొడవైన సముద్ర వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ప్యాకేజ్–2 రూపకల్పన, నిర్మాణం చేపడతాయి.
♦ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఇమామి.. హీలియోస్ లైఫ్ స్టైల్‌లో 30 శాతం వాటాను కొనుగోలు చేయనుంది.
♦ కస్టమర్లకు డీల్స్ అందించే సంస్థలు నియర్‌బై, లిటిల్ ఇంటర్నెట్‌లు విలీనమయ్యాయి. ఈ విలీన సంస్థలో కొంత వాటాను పేటీఎం కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment