గతవారం బిజినెస్ | Lastweek Bussiness | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, Sep 19 2016 2:24 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

Lastweek Bussiness

దిగ్గజ బ్యాంకుల ముందస్తు పన్నులు డౌన్
రెండవ త్రైమాసికానికి సంబంధించి ముందస్తు పన్ను చెల్లింపుల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు- ఎస్‌బీఐ, ఐసీఐసీఐలు వెనక్కు తగ్గాయి. ఎల్‌ఐసీ, ఆర్‌ఐఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, యస్ బ్యాంక్‌తోపాటు స్టీల్, సిమెంట్ తదితర రంగాలు సానుకూల ఫలితాలను నమోదు చేసుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో రూ.1,620 కోట్లు చెల్లించిన ఎస్‌బీఐ ఈ ఏడాది అంతకు 26 శాతం తక్కువతో రూ.1,200 కోట్లనే చెల్లించింది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ చెల్లింపులు 20 శాతం తక్కువగా రూ.1,500 కోట్ల నుంచి రూ.1,200 కోట్లకు పడిపోయాయి.
 
హైదరాబాద్ నుంచి గోఎయిర్
విమానయాన రంగ సంస్థ గోఎయిర్ తాజాగా తన సర్వీసులను హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తోంది. అక్టోబర్ 12 నుంచి ఈ సేవలు మొదలు కానున్నాయి. దీంతో సంస్థకు భాగ్యనగరి 23వ నగరం కానుంది. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, కోల్‌కతా నగరాలకు ప్రతిరోజూ నాన్ స్టాప్ సర్వీసులను గోఎయిర్ నడపనుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా పోర్ట్‌బ్లెయిర్‌కు ఫై్లట్స్ ప్రారంభించనుంది.
 
ఫార్చ్యూన్ జాబితాలో మనోళ్లు
ఫార్చ్యూన్ తాజాగా రూపొందించిన అమెరికాకు వెలుపల అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాలో అరుంధతీ భట్టాచార్య, చందా కొచర్, శిఖా శర్మ స్థానం పొందారు.  ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంటే,ఐసీఐసీఐ బ్యాంక్ హెడ్ చందా కొచర్ 5వ స్థానంలో నిలిచారు. యాక్సిస్ బ్యాంక్ సీఈవో శిఖా శర్మ 19వ స్థానంలో ఉన్నారు. మార్కెట్ విలువ పరంగా యూరోజోన్‌లోనే పెద్ద బ్యాంక్.. బ్యాంకో శాన్‌టండర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అన బాటిన్ జాబితాలో టాప్‌లో ఉన్నారు.
 
ఎల్‌అండ్‌టీ టెక్ ఐపీవోకు మంచి స్పందన
లార్సన్ అండ్ టూబ్రో అనుబంధ సంస్థ ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ తొలి పబ్లిక్ ఆఫర్ 2.5 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయ్యింది. రూ. 900 కోట్ల నిధుల సమీకరణకు కంపెనీ జారీ చేసిన ఇష్యూ గడువు గత గురువారంతో ముగిసింది. సంస్థాగత ఇన్వెస్టర్ల వాటాకు 5 రెట్ల స్పందన లభించగా, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన బిడ్స్ 1.73 రెట్లు ఉన్నాయి. రూ. 850-860 ప్రైస్‌బ్యాండ్‌తో ఆఫర్ జారీ అయ్యింది.
 
27% పెరిగిన పరోక్ష పన్ను వసూళ్లు
కేంద్ర ప్రభుత్వపు ఆదాయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో మంచి వృద్ధి నమోదయ్యింది. దీనికి ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు కారణంగా నిలిచాయి. ఏప్రిల్-ఆగస్ట్ మధ్య కాలంలో పరోక్ష పన్ను వసూళ్లు 27.5 శాతం వృద్ధితో రూ.3.36 లక్షల కోట్లకు, ప్రత్యక్ష పన్ను వసూళ్లు 15.03 శాతం వృద్ధితో రూ.1.89 లక్షల కోట్లకు చే రాయి. దీంతో మొత్తం ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు (ఆగస్ట్ చివరకి) రూ.5.25 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
 
ఆర్‌కామ్-ఎయిర్‌సెల్ విలీనం
టెలికం రంగంలో అతిపెద్ద డీల్ సాకారమైంది. అనిల్ అంబానీ అడాగ్ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్), ఎయిర్‌సెల్‌ల విలీన ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. వైర్‌లెస్ మొబైల్ సర్వీసుల కార్యకలాపాలను విలీనం చేస్తున్నట్లు ఇరు కంపెనీలు ప్రకటించాయి. ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు వెల్లడించాయి. తద్వారా రూ.65,000 కోట్ల విలువైన సంస్థగా ఆవిర్భవిస్తున్నట్లు వెల్లడించాయి. అంతేకాదు ఈ డీల్ పూర్తయితే.. విని యోగదారులు, ఆదాయం పరంగా ప్రతిపాదిత విలీన సంస్థ భారత్‌లో నాలుగో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా నిలుస్తుంది. ఆదాయ పరంగా 12 ప్రధాన సర్కిళ్లలో మూడో స్థానానికి చేరుతుంది.

డాయిష్ బ్యాంక్‌కు అమెరికా జరిమానా
జర్మనీ దిగ్గజం డాయిష్ బ్యాంక్ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసే పెద్ద చిక్కు వచ్చి పడింది. వివరాల్లోకి వెళితే...  2008కి ముందు రెసిడెంట్ తనఖా ఆధారిత బాండ్లను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించడం ద్వారా  ఆర్థిక సంక్షోభానికి తన వంతు కారణమయ్యిందన్న అంశంపై అమెరికా న్యాయశాఖ డాయిష్ బ్యాంకు నుంచి 14 బిలియన్ డాలర్లను డిమాండ్ చేసింది. ఇంత భారీ మొత్తంలో జరిమానా పడుతుందని డాయిష్ ఊహించలేదు. కేవలం 3.4 బిలియన్ డాలర్ల మేర మాత్రమే డిమాండ్ ఉంటుందని భావించింది.
 
50 కోట్లకు ఆన్‌లైన్ యూజర్లు!
దేశంలో ఆన్‌లైన్ యూజర్ల సంఖ్య 2020 నాటికి 50 కోట్లకు చేరుతుందని గూగుల్ ఆసియా పసిఫిక్ లాంగ్వేజ్ హెడ్ రిచా సింగ్ చిత్రాంశి అంచనా వేశారు. స్మార్ట్‌ఫోన్స్ వినియోగం పెరుగుదల, ఇంటర్నెట్ వ్యాప్తి వంటి పలు అంశాలు దీనికి కారణంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 65 శాతం మంది స్మార్ట్‌ఫోన్స్ ద్వారానే ఎక్కువగా ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపారు. 35 కోట్ల మంది ఆన్‌లైన్ యూజర్లలో 15 కోట్ల మంది స్థానిక భాషకే అధిక ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్నారు.
 
రెండేళ్ల గరిష్టానికి టోకు ధరలు
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ధరల పెరుగుదల రేటు ఆగస్టులో 3.74 శాతంగా నమోదయ్యింది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి. సూచీలో దాదాపు 60 శాతంపైగా వాటా కలిగిన తయారీ విభాగంలో కొన్ని వస్తువులు, అలాగే పప్పు దినుసుల ధరల పెరుగుదల మొత్తం సూచీపై ప్రభావం చూపింది. అదీకాక గత ఆర్థిక సంవత్సరం ఇదే నెల (ఆగస్టు) ధరల్లో అసలు పెరుగుదల లేకపోగా క్షీణతలో -5.06 శాతం వద్ద ఉండడం (బేస్ ఎఫెక్ట్) కూడా తాజా రేటు  పెరుగుదలకు కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
 
నియామకాలు
* ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా సి.హెచ్.ఎస్.ఎస్. మల్లికార్జునరావు బాధ్యతలు చేపట్టారు.
* ఇసుజు మోటార్స్ ఇండియా (ఐఎంఐ) చైర్మన్‌గా హిరోషి నకగవ నియమితులయ్యారు. ఇక ఇదివరకు ఐఎంఐ చైర్మన్ పదవిలో కొనసాగిన హిరొయసు మియురా... ఇసుజు ఇంజనీరింగ్ బిజినెస్ సెంటర్ ఇండియా (ఐఈబీసీఐ) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
* ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ఎండీగా ఉన్న వీకే శర్మ చైర్మన్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు.
 
డీల్స్..
* ఆన్‌లైన్ పేమెంట్ సేవల్లో గ్లోబల్ ప్లేయర్‌గా ఉన్న పేయూ, అదే రంగంలోని దేశీయ కంపెనీ సిట్రస్ పేను కొనుగోలు చేసింది. పూర్తిగా నగదు రూపంలో 130 మిలియన్ డాలర్లు (సుమారు రూ.870కోట్లు) చెల్లించడం ద్వారా కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది.
* జర్మనీకి చెందిన బహుళజాతి ఫార్మా, కెమికల్స్ కంపెనీ బేయర్ ఏజీ, అమెరికాకు చెందిన బయోటెక్ అగ్రగామి కంపెనీ మోన్‌శాంటో మధ్య ఎట్టకేలకు డీల్ సెట్ అయింది. ప్రపంచంలోనే అతిపెద్ద నగదు ఒప్పందం వీటి మధ్య కుదిరింది. 66 బిలియన్ డాలర్లను నగదు రూపంలో చెల్లించి మోన్‌శాంటోను కొనుగోలు చేసేందుకు బేయర్ ఏజీ ముందుకు వచ్చింది.
* డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ‘ఇట్జ్‌క్యాష్’ తాజాగా పేమెంట్ గేట్‌వే సంస్థ ‘వీసా’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా వచ్చే నాలుగేళ్లలో 10 బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలను నిర్వహించాలని ఇట్జ్‌క్యాష్ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
* మహీంద్రా గ్రూపులో భాగమైన మహీంద్రా సీఐఈ ఆటోమోటివ్... బెంగళూరుకు చెందిన బిల్‌ఫోర్జ్ కంపెనీని రూ.1,331.2 కోట్లకు కొనుగోలు చేసింది.
* అస్సెట్స్ కేర్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఎంటర్‌ప్రైజ్ (ఏసీఆర్‌ఈ)లో 13.67 శాతం వాటాను యాక్సిస్ బ్యాంకు కొనుగో లు చేయనుంది. ఐఎఫ్‌సీఐ నుంచి ఈ వాటాను రూ.22.72 కోట్లు చెల్లించడం ద్వారా సొంతం చేసుకోనుంది.
* ప్రింటర్స్ విభాగంలో హెచ్‌పీ కంపెనీ అతిపెద్ద కొనుగోలుకు తెరతీసింది. శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌కు చెందిన ప్రింటర్స్ వ్యాపారాన్ని 1.05 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement