గతవారం బిజినెస్‌ | Last week's business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్‌

Published Mon, Feb 26 2018 1:45 AM | Last Updated on Mon, Feb 26 2018 1:45 AM

Last week's business - Sakshi

పోంజీ స్కీములపై కొరడా
పోంజీ పెట్టుబడి పథకాలతో సామాన్య ప్రజానీకాన్ని మోసగించే, నిర్వహించే వారిని కఠినంగా శిక్షించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా చట్టవిరుద్ధంగా డిపాజిట్లు సమీకరించడాన్ని నిషేధిస్తూ సమగ్ర బిల్లును రూపొందించింది. అన్‌రెగ్యులేటెడ్‌ డిపాజిట్‌ స్కీమ్స్‌ నిషేధ బిల్లు 2018ని త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.  

‘తేజ్‌’లో యుటిలిటీ బిల్లుల చెల్లింపు  
గూగుల్‌ ఇండియా గతేడాది సెప్టెంబర్‌లో ఆవిష్కరించిన మొబైల్‌ వాలెట్‌ యాప్‌ ’తేజ్‌’ను సరికొత్త ఫీచర్‌తో అప్‌డేట్‌ చేసింది. యుటిలిటీ బిల్‌ పేమెంట్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో యూజర్లు వాటర్, ఎలక్ట్రిసిటీ, డీటీహెచ్, మొబైల్‌ బిల్లులను చెల్లించొచ్చు. అది కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్‌ చార్జీలు లేకుండా.

 మూతబడనున్న మరో టెల్కో
రుణభారంతో మూతబడుతున్న టెలికం సంస్థల జాబితాలో తాజాగా ఎయిర్‌సెల్‌ కూడా చేరబోతోంది. సుమారు రూ. 15,500 కోట్ల రుణాలు పేరుకుపోవడంతో కంపెనీ త్వరలో నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ముందు దివాలా పిటీషన్‌ దాఖలు చేయనుంది. మలేషియాకి చెందిన మాతృ సంస్థ మ్యాక్సిస్‌ గతంలో ఎయిర్‌సెల్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత వెనక్కి తగ్గినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.   
 
ప్రైవేటుకూ బొగ్గు మైనింగ్‌
ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్‌ ఇండియా గుత్తాధిపత్యానికి చెక్‌ పెడుతూ బొగ్గు రంగంలో కేంద్రం మరిన్ని సంస్కరణలకు తెరతీసింది. ఇకపై వాణిజ్య అవసరాల కోసం బొగ్గును ఉత్పత్తి చేసేందుకు ప్రైవేట్‌ కంపెనీలకు కూడా కాంట్రాక్టులివ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రైవేట్‌ కంపెనీలు సొంత అవసరాల కోసం బొగ్గును ఉత్పత్తి చేయడానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో ఇటీవల జరిగిన సమావేశంలో కేంద్ర క్యాబినెట్‌ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది.
 
షేర్ల తనఖా తగ్గింది!
ప్రమోటర్ల షేర్ల తనఖా గత ఏడాది డిసెంబర్‌ క్వార్టర్లో తగ్గింది. తనఖాలో ఉన్న ప్రమోటర్ల షేర్ల శాతం గత ఏడాది అక్టోబర్‌ క్వార్టర్లో సగటున 8.3 శాతంగా ఉంది. అది డిసెంబర్‌ క్వార్టర్లో 7.8 శాతానికి తగ్గినట్లు కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ రీసెర్చ్‌ తెలియజేసింది. డిసెంబర్‌ క్వార్టర్లో ప్రమోటర్లు రూ.1.98 లక్షల కోట్ల విలువైన షేర్లను తనఖా పెట్టారని ఇది బీఎస్‌ఈ–500 సూచీ మార్కెట్‌ క్యాప్‌లో 1.47 శాతానికి సమానమని పేర్కొంది.

పీఎఫ్‌ వడ్డీ రేటు 8.55 శాతానికి తగ్గింపు
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్‌వో 2017–18 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్‌పై వడ్డీ రేటును 8.65 శాతం నుంచి 8.55 శాతానికి తగ్గించింది. దీంతో రూ. 586 కోట్ల మేర మిగులు నమోదు కానుందని ఈపీఎఫ్‌వో ట్రస్టీల సమావేశం అనంతరం కేంద్ర కార్మిక మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం 8.65 శాతం వడ్డీ రేటునివ్వడంతో.. రూ. 695 కోట్ల మిగులు నమోదైనట్లు వివరించారు. దాదాపు 6 కోట్ల చందాదారులపై ఇది ప్రభావం చూపనుంది.   
 
భారత్‌లో పెట్టుబడులు కొనసాగిస్తాం: ఉబెర్‌

ప్రముఖ ట్యాక్సీ సేవల సంస్థ ‘ఉబెర్‌’ తాజాగా భారత్‌లో పెట్టుబడులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది.’ఇండియా మాకు చాలా ముఖ్యమైన ప్రాంతం. ప్రధానమైన మార్కెట్‌ కూడా. ఇక్కడ వచ్చే దశాబ్ద కాలంలో దాదాపు 10 రెట్ల వరకు వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’ అని ఉబెర్‌ సీఈవో డారా ఖోస్రోషాహి తెలిపారు. తొలిసారి భారత్‌లో పర్యటిస్తోన్న ఆయన.. సంస్థ ప్రధాన ఇన్వెస్టర్‌ అయిన సాఫ్ట్‌బ్యాంక్‌ సలహాలను స్వీకరించబోమనే సంకేతాలిచ్చారు.   
 
తొలి 5జీ ట్రయల్స్‌ సక్సెస్‌..
ఎయిర్‌టెల్, హువావే సంస్థలు తాజాగా భారత్‌లో తొలిసారి 5జీ నెట్‌వర్క్‌ ట్రయల్స్‌ను నిర్వహించాయి. ఇందులో 3 గిగాబైట్‌ పర్‌ సెకన్‌ (జీబీపీఎస్‌)కుపైగా డేటా స్పీడ్‌ను సాధించినట్లు ఇరు కంపెనీలు ప్రకటించాయి. గురుగావ్‌లోని మానేసర్‌ వద్ద ఉన్న ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌లో ఈ ట్రయల్స్‌ జరిగాయి.  

ఇంటర్నెట్‌ యూజర్లు @  50 కోట్లు!!
దేశంలో ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య 2018 జూన్‌ నాటికి 50 కోట్లకు చేరుతుందని అంచనా. ఐఎంఏఐ– ఐఎంఆర్‌బీ సంయుక్త సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. సర్వే ప్రకారం.. 2017 డిసెంబర్‌లో ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య వార్షిక ప్రాతిపదికన 11.34 శాతం వృద్ధితో 48.1 కోట్లకు చేరింది. పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య 2017 డిసెంబర్‌ నాటికి వార్షిక ప్రాతిపదికన 9.66 శాతం వృద్ధితో 29.5 కోట్లకు చేరి ఉంటుందని అంచనా. ఇక ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య 14.11 శాతం వృద్ధితో 18.6 కోట్లకు పెరిగి ఉండొచ్చు. భారత్‌లోని మొత్తం ఇంటర్నెట్‌ యూజర్లలో విద్యార్థులు, యువత వాటా దాదాపు 60 శాతం.  
 
ఇక క్రాస్‌ కరెన్సీ ట్రేడింగ్‌!
బాంబే స్టాక్‌ ఎక్సే్చంజ్‌లో (బీఎస్‌ఈ) క్రాస్‌ కరెన్సీ డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ మొదలవుతోంది. ఈ నెల 27 నుంచి క్రాస్‌ కరెన్సీ డెరివేటివ్స్‌ను ప్రారంభిస్తున్నామని, క్రాస్‌ ఇండియన్‌ రూపీ (ఐఎన్‌ఆర్‌) ఆప్షన్స్‌ను కూడా ఆరంభిస్తామని బీఎస్‌ఈ వెల్లడించింది. వీటివల్ల లిక్విడిటీ మరింతగా పెరుగుతుందని తెలియజేసింది. ప్రస్తుతం మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో (ఎంసీఎక్స్‌) కరెన్సీ ట్రేడింగ్‌కు అనుమతి ఉంది కానీ.. క్రాస్‌ కరెన్సీ ట్రేడింగ్‌కు అనుమతి లేదు.  

మూడేళ్లలో ఇ–రిటైల్‌లో 2.5 రెట్లు వృద్ధి!!
ఇ–రిటైల్‌ మార్కెట్‌ వచ్చే మూడేళ్లలో రెండు రెట్లకు పైగా పెరగనుందని క్రిసిల్‌ తన నివేదికలో అంచనా వేసింది. అయితే మార్కెట్‌ పరిమాణం ఎంతుంటుందో మాత్రం వెల్లడించలేదు. కంపెనీలు డిస్కౌంట్ల నుంచి ఏకీకరణ, భౌగోళిక వైవిధ్యం, వ్యాపార పునర్‌నిర్మాణం, కస్టమర్లకు చేరువ కావడం వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించాల్సి వస్తుందని తెలిపింది.


డీల్స్‌..
ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ.. మీడియా సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌లో వాటా కొంటోంది. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌లో లిస్టయిన ఈరోస్‌ ఇంటర్నేషనల్‌లో 5 శాతం వాటాను ఒక్కో షేర్‌ను 15 డాలర్లకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన అనుబంధ కంపెనీ ద్వారా కొనుగోలు చేయనుంది.  
   ప్రైవేట్‌ రంగ ఫెడరల్‌ బ్యాంక్‌.. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ రంగంలోకి ప్రవేశించింది. ఇన్వెస్ట్‌మెంట్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈక్విరస్‌ క్యాపిటల్‌లో 26 శాతం వాటాను కొనుగోలు చేశామని ఫెడరల్‌ బ్యాంక్‌ తెలిపింది.


ఆటోమొబైల్స్‌..
అల్ట్రా–లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ’రోల్స్‌రాయిస్‌’ తాజాగా 8వ జనరేషన్‌ ఫాంటమ్‌ కారును భారత్‌ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.9.5 కోట్లు.
 జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూకు చెందిన ప్రీమియం మోటార్‌సైకిల్‌ విభాగం బీఎండబ్ల్యూ మోటొరాడ్‌ తాజాగా భారత్‌లో తన బైక్స్‌ ధరలను 10 శాతం వరకు తగ్గించింది. ధరల తగ్గింపు నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. అడ్వెంచర్, స్పోర్ట్, టూరింగ్, హెరిటేజ్, రోడ్‌స్టర్‌ వంటి కేటగిరీల్లోని మోటార్‌సైకిళ్లకు తగ్గింపు వర్తిస్తుందని పేర్కొంది.  
  స్కోడా ఆటో ఇండియా తన అన్ని మోడళ్ల ధరలను వచ్చే నెల నుంచి పెంచుతోంది. బడ్జెట్లో కస్టమ్స్‌ సుంకాలను పెంచడంతో అన్ని మోడళ్ల ధరలను 1 శాతం వరకూ (రూ.10,000 నుంచి రూ.35 వేల వరకూ) పెంచుతున్నామని స్కోడా ఆటో ఇండియా తెలిపింది. కస్టమ్స్‌ సుంకం పెంపు ప్రభావాన్ని తట్టుకోవడానికి దశల వారీగా కార్ల ధరలను మరింతగా పెంచుతామని పేర్కొంది.  
 కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీ కంపెనీ ’లెనొవొ ఇండియా’ ఆండ్రాయిడ్‌ ట్యాబ్లెట్‌ వ్యాపారంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తాజాగా డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 30.8 శాతం మార్కెట్‌ వాటాతో మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కంపెనీ మొదటి స్థానంలో ఉండటం ఇది వరుసగా మూడో త్రైమాసికం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement