క్షీణతలోనే టోకు ద్రవ్యోల్బణం
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 12వ నెలలోనూ అసలు పెరక్కపోగా... మైనస్‌లోనే కొనసాగింది. అక్టోబర్‌లో -3.81 శాతంగా నమోదయ్యింది. సెప్టెంబర్‌లో ఈ రేటు -4.54 శాతం. 2014 ఇదే నెలలో ఈ రేటు 1.66 శాతంగా ఉంది. దేశంలో టోకు ధరల సూచీ అసలు పెరక్కపోవడానికి కారణాల్లో అంతర్జాతీయ కమోడిటీ ధరలు కనిష్ట స్థాయిల్లో ఉండడం ఒకటి.
త్వరలో ఎస్‌బీఐ ‘బటువా’ వాలెట్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) త్వరలో సాధారణ మొబైల్ ఫోన్లలో పనిచేసే మొబైల్ వాలెట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. బిల్లు చెల్లింపులు, నగదు బదిలీ వంటి అన్ని రకాల నగదు చెల్లింపుల లావాదేవీలను నిర్వహించుకునే విధంగా ‘బటువా’ పేరుతో ఈ వాలెట్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎస్‌బీఐ ఎండీ (నేషనల్ బ్యాంకింగ్ గ్రూప్) రజనీష్ కుమార్ తెలిపారు.
ఎగుమతులు పదకొండవ‘సారీ’
ఎగుమతుల క్షీణ ధోరణి వరుసగా 11వ నెలా కొనసాగింది. వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం.. 2014 అక్టోబర్ ఎగుమతుల విలువతో పోల్చితే 2015 అక్టోబర్‌లో ఎగుమతులు అసలు పెరక్కపోగా 17.5 శాతం క్షీణించాయి. విలువలో 25.89 బిలియన్ డాలర్ల నుంచి 21.36 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంతర్జాతీయంగా డిమాండ్ మందగమనం దీనికి ప్రధాన కారణం.
మ్యాగీ నూడుల్స్‌పై సుప్రీంకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ
మ్యాగీ నూడుల్స్ నిషేధ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న నెస్లే ఇండియాను.. సమస్యలు మళ్లీ చుట్టుముడుతున్నాయి. మ్యాగీ నూడుల్స్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తూ బాంబే హైకోర్టు ఉత్తర్వులివ్వడాన్ని సవాలు చేస్తూ ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాల నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ.. తాజాగా సుప్రీం కోర్టుకు వెళ్లింది.
పరీక్షల కోసం ల్యాబొరేటరీలకు కంపెనీ ఇచ్చిన శాంపిల్స్ నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేసింది. పైగా.. తాజా శాంపిల్స్‌ను అందించే పనిని హైకోర్టు తటస్థ సంస్థకు కాకుండా వాటిని తయారు చేసే నెస్లేకు అప్పగించడాన్ని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తన పిటీషన్‌లో సవాలు చేసింది.
పెరుగుతున్న ఈక్విటీ ఎంఎఫ్ ఖాతాలు
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల కాలంలో కొత్తగా 24 లక్షల మంది ఇన్వెస్టర్లు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్లు ప్రారంభించారని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 25 లక్షల కొత్త ఈక్విటీ
మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్లు మాత్రమే ప్రారంభమయ్యాయని పేర్కొంది. కాగా ఈ ఏడాది అక్టోబర్ 31నాటికి డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య 1.02 కోట్లకు పెరిగిందని సీడీఎస్‌ఎల్ తెలిపింది.
జెట్, ఇండిగో, స్పైస్‌జెట్‌లకు జరిమానా
విమానయాన రంగంలో అనుచిత వ్యాపార విధానాలపై కొరడా ఝుళిపిస్తూ.. కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ).. మూడు దిగ్గజ సంస్థలపై భారీ జరిమానా విధించింది. సరకు రవాణాకు సంబంధించి ఇంధన సర్‌చార్జి నిర్ణయించడంలో కుమ్మక్కయ్యాయన్న ఆరోపణల మీద జెట్ ఎయిర్‌వేస్, ఇండి గో, స్పైస్‌జెట్ సంస్థలు మొత్తం రూ. 258 కోట్లు పెనాల్టీ కట్టాలని ఆదేశించింది.
కొత్త మొబైల్ కనెక్షన్లలో భారత్ టాప్
దేశంలో మొబైల్ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇతర ప్రపంచ దేశాల కన్నా అధికంగా, భారత్‌లో మొబైల్ వినియోగదారుల సంఖ్య జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో నికరంగా కొత్తగా 1.3 కోట్లు పెరిగింది. ఈ పెరుగుదల చైనాలో 70 లక్షలుగా, అమెరికాలో 60 లక్షలుగా, మయన్మార్‌లో 50 లక్షలుగా, నైజీరియాలో 40 లక్షలుగా ఉంది.
ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా 8.7 కోట్ల మంది కొత్తగా మొబైల్ కనెక్షన్లను తీసుకున్నారు. కాగా దేశంలో టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 102.26 కోట్లకు చేరినట్లు ట్రాయ్ తెలిపింది.
బెయిలవుట్ నిధుల కోసం గ్రీస్ డీల్
దాదాపు 12 బిలియన్ యూరోల బెయిలవుట్ రుణ మొత్తం విడుదలకు సంబంధించి రుణదాతలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు గ్రీస్ వెల్లడించింది. దీని కింద మరో 48 సంస్కరణలను గ్రీస్ అమలు చేయాల్సి ఉంటుంది. వీటిని గ్రీస్ పార్లమెంటు గురువారం ఆమోదించిన వెంటనే బెయిలవుట్ మొత్తాన్ని విడుదల చేయడం జరుగుతుందని యూరోగ్రూప్ చీఫ్ జెరోన్ తెలిపారు.
కోల్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్‌కు ఓకే
దాదాపు రూ. 69,500 కోట్ల బృహత్తర డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని సాధించే దిశగా కోల్ ఇండియాలో 10 శాతం వాటాల విక్రయానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం కోల్ ఇండియా మార్కెట్ విలువ ప్రకారం.. దీని ద్వారా కేంద్ర ఖజానాకు కనీసం రూ. 21,138 కోట్లు సమకూరగలవని కేంద్ర బొగ్గు, విద్యుత్ శాఖల మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. కంపెనీలో ప్రభుత్వానికి 79.65 శాతం వాటాలు ఉన్నాయి. మరోవైపు, రూ. 10 ముఖవిలువ గల 3,39,84,000 ఈక్విటీ షేర్లతో కొచ్చిన్ షిప్‌యార్డు (సీఎస్‌ఎల్) ఐపీవో ప్రతిపాదనకు క్యాబినెట్ ఓకే చేసింది.
పసిడి పథకానికి స్పందన అంతంతే..
కేంద్రం ఇటీవల అట్టహాసంగా ప్రారంభించిన బంగారం డిపాజిట్ పథకానికి అంతంత మాత్రం స్పందనే కనిపిస్తోంది. దీని కింద ఇప్పటిదాకా 400 గ్రాముల మేర మాత్రమే పసిడి డిపాజిట్లు వచ్చాయి. వజ్రాభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి జీజేఈపీసీ ఉత్తరాది రీజియన్ చైర్మన్ అనిల్ శంఖ్వాల్ ఈ విషయం తెలిపారు. ప్రస్తుతమున్న 13,000 మంది బీఐఎస్ సర్టిఫైడ్ జ్యుయలర్లందరూ కూడా పసిడి కలెక్షన్ ఏజెంట్లుగా వ్యవహరించేందుకు అనుమతులిస్తే ఈ ప్రయోగం విజయవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
వ్యవసాయ రుణ లక్ష్యం 11.57 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు తమ వద్ద ఉండే నిధుల్లో కనీసం 11.57 శాతం మొత్తాన్ని.. నేరుగా కార్పొరేట్‌యేతర రైతులకు రుణాలుగా ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. 20 పైగా శాఖలు ఉన్న విదేశీ బ్యాంకులు ఎప్పటిలాగే ఆర్‌బీఐ ఆమోదం మేరకు తమ తమ ప్రణాళికలను అమలు చేయాల్సి ఉంటుంది. ప్రాధాన్యత రంగానికి నిర్దేశించిన రుణ వితరణ లక్ష్యాన్ని సాధించని బ్యాంకులపై జరిమానాలు ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది.
విదేశీ మారక నిల్వలు పెరిగాయ్..
భారత్ విదేశీ మారకపు నిల్వలు నవంబర్ 13తో ముసిగిన వారాంతానికి 352.515 బిలియన్ డాలర్లకు ఎగశాయి. అంతక్రితం వారం (నవంబర్ 6)తో పోల్చితే 781 మిలియన్ డాలర్లు పెరిగాయి. నవంబర్ 6తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వలు 1.9 బిలియన్ డాలర్లు తగ్గి, 351.734 బిలియన్ డాలర్లకు పడ్డాయి.
కార్పొ ట్యాక్స్ తగ్గింపునకు రోడ్‌మ్యాప్
వచ్చే నాలుగేళ్లలో కార్పొరేట్ ట్యాక్స్‌ను క్రమేపీ 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించడానికి... ఇతర పన్ను మినహాయింపుల్ని రద్దుచేయడానికి సంబంధించిన ముసాయిదాను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు విడుదల చేసింది.
చిన్నతరహా పరిశ్రమలకు కొత్త ఫండ్
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తమ ఉత్పత్తిలో పర్యావరణ కాలుష్యానికి తావులేని అత్యాధునిక సాంకేతిక పరికరాల కొనుగోలుకు కేంద్రం ఒక ప్రత్యేక ఫండ్‌ను ఏర్పాటు చేసింది.
డీల్స్..
భారత్ ప్రముఖ టైర్ల తయారీ సంస్థ అపో లో టైర్స్.. జర్మనీలోని ప్రముఖ టైర్ పంపిణీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన రిఫిన్‌కమ్ జీఎం బీహెచ్‌ను కొనుగోలు చేసింది. ఒప్పందం విలువ దాదాపు రూ.301 కోట్లు (45.6 మిలియన్ యూరోలు).
* మౌలిక రంగ దిగ్గజం రిలయన్స్ ఇన్‌ఫ్రా (ఆర్‌ఇన్‌ఫ్రా) సంస్థ .. ముంబై పరిసర ప్రాంతానికి సంబంధించిన తమ విద్యుత్ వ్యాపార విభాగంలో 49 శాతం వాటాలను కెనడాకు చెందిన పీఎస్‌పీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి విక్రయించనుంది. డీల్ విలువ సుమారు రూ. 3,500 - రూ. 4,000 కోట్ల దాకా ఉంటుందని అంచనా.
* జీవిత బీమా వ్యాపార విభాగం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్‌లో ఆరు శాతం వాటాలను రూ. 1,950 కోట్లకు విక్రయించాలని ఐసీఐసీఐ బ్యాంక్ నిర్ణయించింది. ఇందులో 4 శాతం వాటాలను ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు, రెండు శాతం వాటాలను కంపాస్‌వేల్ ఇన్వెస్ట్‌మెంట్స్ సంస్థకు విక్రయించనున్నట్లు పేర్కొంది.
* అంతర్జాతీయ ఆతిథ్య రంగంలో భారీ డీల్‌కు తెరతీసింది మారియట్ ఇంటర్నేషనల్ సంస్థ. 12.2 బిలియన్ డాలర్లకు స్టార్‌వుడ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ వరల్డ్‌వైడ్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.
* మొబైల్ యాప్ సంస్థ టాస్క్‌బక్స్‌లో టైమ్స్ గ్రూప్‌లో భాగమైన టైమ్స్ ఇంటర్నెట్.. మెజారిటీ వాటాలు దక్కించుకుంది. ఇందుకోసం 15 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 99 కోట్లు) ఇన్వెస్ట్ చేసినట్లు టైమ్స్ ఇంటర్నెట్ తెలిపింది.
* రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ మ్యూచువల్ ఫండ్ వ్యాపారం నుంచి వైదొలుగుతోంది. రెలిగేర్ ఇన్వెస్కో ఏంఎసీలో తనకున్న 51 శాతం వాటాను విదేశీ భాగస్వామి ఇన్వెస్కోకు విక్రయించనున్నది.
గతవారం బిజినెస్
Published Mon, Nov 23 2015 3:38 AM | Last Updated on Sun, Sep 3 2017 12:51 PM
Advertisement
Advertisement