గతవారం బిజినెస్ | Last week Bussiness | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, Feb 8 2016 1:34 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM

Last week Bussiness

మందగించిన వాహన విక్రయాలు
వాహన విక్రయాలు జనవరిలో మందగించాయి. దేశీయ విక్రయాల్లో మారుతీ సుజుకీ స్వల్ప వృద్ధిని సాధించగా, హ్యుందాయ్, ఫోర్డ్, మహీంద్రా కంపెనీలు ఒక్క అంకె వద్ధినే సాధించాయి. మరోవైపు టాటా మోటార్స్, హోండా కార్ప్ దేశీయ అమ్మకాలు క్షీణించాయి.
 
కీలక రంగాల వృద్ధి 0.9 శాతం
ఎనిమిది కీలక రంగాల గ్రూప్ 2015 డిసెంబర్‌లో కేవలం 0.9 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. 2014 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 3.2 శాతం. అయితే 2015 నవంబర్‌లో అసలు ఈ గ్రూప్‌లో అసలు వృద్ధి లేకపోగా క్షీణత (ఎనిమిది నెలల కనిష్టం, -1.3 శాతం క్షీణత) నమోదయ్యింది.  ఈ ఎనిమిది రంగాల్లో బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువులు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ ఎనిమిది రంగాల వాటా 38 శాతం.
 
యాపిల్‌ను దాటిన గూగుల్ ‘ఆల్ఫాబెట్’
మెరుగైన ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ గల కంపెనీగా టెక్ సంస్థ యాపిల్‌ను అధిగమించింది. సోమవారం మార్కెట్ ముగిసిన తర్వాత జరిగిన లావాదేవీల్లో షేరు ధర ప్రకారం ఆల్ఫాబెట్ మార్కెట్ విలువ ఏకంగా 570 బిలియన్ డాలర్లకు ఎగసింది. యాపిల్ మార్కెట్ విలువ 535 బిలియన్ డాలర్లు.
 
నేడు క్విక్ హీల్ ఐపీఓ
సాఫ్ట్‌వేర్ సంస్థ క్విక్ హీల్ టెక్నాలజీస్ తన ఐపీఓకు రూ.311-321ను ధరల శ్రేణిగా నిర్ణయించింది. ఈ నెల 8న ప్రారంభమై, 10న ముగిసే ఈ ఐపీఓ ద్వారా రూ.250 కోట్లు సమీకరించాలని క్విక్ హీల్ టెక్నాలజీస్ యోచిస్తోంది. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జెఫరీస్ ఇండియా, జేపీ మోర్గాన్ ఇండియాలు, రిజిష్ట్రార్‌గా లింక్ ఇన్‌టైమ్ ఇండియాలు  వ్యవహరిస్తున్నాయి.
 
ప్రభుత్వ బ్యాంకులకు రూ.5,000 కోట్లు!
ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకులకు ప్రస్తుత త్రైమాసికంలో (జనవరి-మార్చి) ప్రభుత్వం రూ.5,000 కోట్లు తాజా మూలధనంగా ఇవ్వనుంది. ఆర్థిక సేవల కార్యదర్శి ఏసీ దుగ్గల్  ఈ విషయం తెలిపారు. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ల పటిష్టత లక్ష్యంగా కేంద్రం ఈ చర్య తీసుకోనుందని ఆయన వెల్లడించారు.
 
పాలసీ రేట్లు యథాతథం
అందరి అంచనాలకు అనుగుణంగానే ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్.. కీలక పాలసీ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులూ చేయకుండా యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. రాను న్న బడ్జెట్‌లో నిర్మాణాత్మక సంస్కరణలపై ప్రభుత్వం చేపట్టే చర్యలు, స్థూల ఆర్థిక అంశాలకు అనుగుణంగా భవిష్యత్తులో వడ్డీరేట్ల తగ్గింపు ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. వృద్ధి మందగమనం, ద్రవ్యోల్బణం పెరుగుదల రిస్కులు కూడా ఆర్‌బీఐ తాజా నిర్ణయానికి కారణాలుగా నిలిచాయి.
 
అత్యంత శక్తివంతమైన బ్రాండ్ టీసీఎస్
ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బ్రాండ్‌గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)నిలిచింది. అంతర్జాతీయ ప్రముఖ బ్రాండ్ వేల్యూయేషన్ కంపెనీ బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన 2016 వార్షిక జాబితాలో తమకు ఈ ఘనత దక్కిందని టీసీఎస్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వేలాది బ్రాండ్లను పరిగణనలోకి తీసుకొని ఈ జాబితాను బ్రాండ్ ఫైనాన్స్ తయారు చేసింది.
 
ఆసియా షేర్ల జాబితాలో 3 దేశీ షేర్లు
సిటీ రీసెర్చ్ సంస్థ రూపొందించిన ఆసి యా షేర్ల జాబితాలో మూడు భారత షేర్లకు చోటు దక్కింది. ఈ ఏడాది దృష్టి పెట్టాల్సిన ఆసియా షేర్ల జాబితాను సిటీ రీసెర్చ్ తయారు చేసింది. 13 షేర్లతో రూపొందించిన ఈ జాబితాను 18 షేర్లకు విస్తరించామని సిటీ రీసెర్చ్ పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, అరబిందో ఫార్మా..  షేర్లకు ఈ జాబితాలో చోటు దక్కింది.
 
ప్రాణాధార ఔషధ దిగుమతులపై కొరడా!
లైఫ్ సేవింగ్స్ డ్రగ్స్ (ప్రాణాధార ఔషధాలు) దిగుమతులపై కేంద్రం కస్టమ్స్ సుంకాల మినహాయింపుల్ని ఉపసంహరించుకుంది. ఈ ఔషధాలపై 16 నుంచి 20% వరకూ కస్టమ్స్ సుంకాలను విధించనున్నట్లు కూడా సమాచారం. ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా దేశంలోనే కీలక ఔషధాల ఉత్పత్తి వృద్ధి లక్ష్యంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
 
డీల్స్..
* వర్చువల్ ఎగ్జిబిషన్ల నిర్వహణ నిమిత్తం ప్రాపర్టీ పోర్టల్ హౌసింగ్.కామ్ సంస్థ ఐసీఐసీఐ ప్రాపర్టీ సర్వీసెస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
* తక్షణ నగదు బదిలీ సేవల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒమన్ యూఏఈ ఎక్స్చేంజ్ చేతులు కలిపింది. ఒమన్‌లో నివసించే ఖాతాదారులు.. భారత్‌లోని ఏ ఎస్‌బీఐ ఖాతాకైనా తక్షణం నగదును బదిలీ చేసేందుకు ఉపయోగపడేలా ఫ్లాష్‌రెమిట్ సర్వీసులు ఉపయోగపడతాయని ఒమన్ యూఏఈ ఎక్స్చేంజ్ తెలిపింది.
* విద్యుత్ ఆదా చేసే ఎల్‌ఈడీ బల్బులను రూ. 99కే విక్రయించే దిశగా ప్రభుత్వ రంగ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ (ఈఈసీఎల్)తో ఆన్‌లైన్ రిటైల్ సంస్థ స్నాప్‌డీల్ ఒప్పందం కుదుర్చుకుంది.
* చిత్ర నిర్మాణం కోసం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్.. నీరజ్ పాండే, శీతల్ భాటాయాల ఫ్రైడే ఫిల్మ్‌వర్క్స్ ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ప్లాన్ సి స్టూడియోస్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ జేవీలో ఇరు సంస్థలకు 50:50 శాతం వాటాలున్నాయి.  
* ఎస్సార్ కంపెనీ ముంబైలోని బిజినెస్ పార్క్‌ను విక్రయిం చింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లో 1.25 మిలియన్‌ల చదరపుటడుగుల విస్తీర్ణమున్న ఈక్వినాక్స్ బిజి నెస్ పార్క్‌ను బెంగళూరుకు చెందిన  రియల్టీ సంస్థ ఆర్‌ఎంజీ కార్ప్‌కు విక్రయించామని ఎస్సార్ కంపెనీ తెలిపింది.  ఈ డీల్ విలువ రూ.2,400 కోట్లు.
* అమెరికాకు చెందిన ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబెర్, ఆర్థిక సంస్థలు, బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.  తమ భాగస్వామ్య డ్రైవర్లకు వాహన రుణాల కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఉబెర్ తెలిపింది.
* ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ, పర్యాటక సేవలు అందించే థామస్ కుక్ కంపెనీతో జతకట్టి... ‘థామస్ కుక్  హాలిడే అకౌంట్’ పేరిట కొత్త రికరింగ్ డిపాజిట్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.
* అమెరికాకు చెందిన జీఈ అప్లయెన్సెస్ వ్యాపారాన్ని చైనాకు చెందిన హయర్ గ్రూప్ కొనుగోలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement