ఎయిర్‌టెల్ ప్రత్యేక మైక్రో-వెబ్‌సైట్
భారతీ ఎయిర్‌టెల్ కంపెనీ ప్ర త్యేకమైన మైక్రో-వెబ్‌సైట్‌ను సోమవారం ప్రారంభించింది. ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కవరేజ్ లైవ్ స్టేటస్‌ను ఈ ప్రత్యేకమైన వెబ్‌సైట్ తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ వెబ్‌సైట్ కంపెనీ సైట్ విస్తరణ ప్రాజెక్ట్ పురోగతిని వెల్లడిస్తుంది. కాల్ డ్రాప్‌ల విషయంలో విమర్శలు బాగా పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్‌టెల్ ఈ ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తుండడం విశేషం. అలాగే కంపెనీ.. తాజాగా వింక్ గేమ్స్ పేరిట గేమింగ్ యాప్‌ను ఆవిష్కరించింది.
రుణ రేటు తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
ప్రైవేటు బ్యాంకింగ్‌లో రెండో స్థానంలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్... తన కనీస రుణ (బేస్) రేటును స్వల్పంగా 0.05 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.30 శాతానికి తగ్గింది. ఇది బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రేటుకు సరిసమానం. బ్యాంకులు తమ రుణ మంజూరీలకు ఈ రేటునే బేస్‌గా తీసుకుంటాయి. ఇంతకన్నా తక్కువ రేటుకు రుణాలివ్వవు. రుణ రేటు తగ్గింపు వల్ల దీనితో అనుసంధానమైన గృహ, వాహన, విద్యా రుణ రేటు కొంతమేర తగ్గే అవకాశం ఉంది.
ప్రతిభా సింటెక్స్‌కు లక్ష డాలర్ల జరిమానా
పైరేటెడ్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించినందుకు గాను దేశీ టెక్స్‌టైల్స్ కంపెనీ ప్రతిభా సింటెక్స్ సంస్థ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కి చెందిన ఈ సంస్థను... 30 రోజుల్లోగా 1,00,000 డాలర్ల (సుమారు రూ. 66 లక్షలు) జరిమానా కట్టాలంటూ అమెరికా కోర్టు ఆదేశించింది.
రూ.40,000 కోట్లతో ఇన్‌ఫ్రా నిధి
మౌలిక రంగ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే లక్ష్యంతో కేంద్రం రూ. 40,000 కోట్ల జాతీయ పెట్టుబడి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్‌ఐఐఎఫ్)ను ఏర్పాటు చేసింది. ఎన్‌ఐఐఎఫ్‌కు బడ్జెట్ నుంచి ప్రభుత్వం రూ.20,000 కోట్ల మేర కేటాయింపులు జరపనుండగా, ప్రై వేట్ ఇన్వెస్టర్ల నుంచి మరో రూ. 20,000 కోట్లు వస్తాయని అంచనా. కొత్త వాటితో పాటు నిలిచిపోయిన ప్రాజెక్టులు, విస్తరణ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు కేంద్రం దీన్ని ఏర్పాటు చేస్తోంది.
వరంగల్‌లో ఇన్ఫోసిస్ క్యాంపస్!
టెక్నాలజీ కంపెనీ ఇన్ఫోసిస్ వరంగల్‌లో క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఫిబ్రవరిలో కంపెనీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కంపెనీకి అతిపెద్ద క్యాంపస్ అయిన పోచారం కేంద్రాన్ని అదే నెలలో ప్రారంభిస్తోంది. మైసూరు సెంటర్ మాదిరిగా ఇంజనీరింగ్ పూర్తయిన తాజా గ్రాడ్యుయేట్లకు వరంగల్ కేంద్రంలో శిక్షణ ఇస్తారు.
నాలుగు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఆమోదం
విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్(ఎఫ్‌ఐపీబీ) రూ.1,810 కోట్ల విలువైన నాలుగు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటిలో హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఫైర్ పై ్ల నెట్‌వర్క్స్ లిమిటెడ్, సాఫ్ట్‌వేర్ ఈజ్ కరెక్ట్ తదితర ప్రతిపాదనలకు కూడా ఆమోదం లభించింది.
తగ్గిన యునెటైడ్ స్పిరిట్స్ నెట్‌వర్త్
యునెటైడ్ స్పిరిట్స్ కంపెనీ నెట్‌వర్త్ నాలుగేళ్లలో సగానికి పైగా హరించుకుపోయింది. పలు కారణాల వల్ల తమ నెట్‌వర్త్ ఈ స్థాయిలో తగ్గిపోయిందని యునెటైడ్ స్పిరిట్స్ తెలిపింది. తమ ప్రమోటర్ గ్రూప్ సంస్థ యునెటైడ్ బ్రూవరీస్(హోల్డింగ్స్) రుణాలకు కేటాయింపులు జరపడం, తదితర కారణాల వల్ల తమ నెట్‌వర్త్ తగ్గిందని పేర్కొంది.
ఎస్సార్ డీలిస్టింగ్ పూర్తి
ఎస్సార్ ఆయిల్ డీలిస్టింగ్ పూర్తయింది. వాటాదారులకు డీలిస్టింగ్ ప్రక్రియ కింద రూ.3,745 కోట్లు చెల్లించామని ఎస్సార్ ఆయిల్ తెలిపింది. భారత కార్పొరేట్ చరిత్రలో ఇదే అతి పెద్ద డీలిస్టింగ్. డీలిస్టింగ్ పూర్తవడానికి 9.26 కోట్ల షేర్లు అవసరమని, ఓపెన్ ఆఫర్ ద్వారా 10.1 కోట్ల షేర్లను సమీకరించామని ఎస్సార్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ శశి రుయా చెప్పారు. 1995లో ఐపీఓకు వచ్చిన ఎస్సార్ ఆయిల్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అప్పుడు రూ.2,000కోట్లుగా ఉంది. డీలిస్టింగ్ ధర(రూ.263)ను పరిగణనలోకి తీసుకుంటే ఇప్పుడు ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.38,000 కోట్లకు పెరిగింది.
1.7 శాతం పెరిగిన విదేశీ రుణ భారం
భారత్ విదేశీ రుణ భారం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 1.7 శాతం పెరిగింది. మార్చి 2015 ముగింపుతో పోల్చితే, సెప్టెంబర్ వరకూ గడచిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరు నెలల కాలంలో విదేశీ రుణం 8 బిలియన్ డాలర్లు పెరిగి 483.2 బిలియన్ డాలర్లకు చేరిందని గురువారం విడుదలైన గణాంకాలు తెలిపాయి. వాణిజ్య రుణాల వంటి దీర్ఘకాలిక విదేశీ రుణం, ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు పెరగడం విదేశీ రుణం పెరగడానికి కారణమని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
లక్ష్యంలో 87 శాతానికి ద్రవ్యలోటు
ప్రభుత్వ ఆదాయం-వ్యయాలకు మధ్య వ్యత్యాసానికి సంబంధించిన ద్రవ్యలోటు 2015-16 బడ్జెట్ లక్ష్యంలో 87 శాతానికి చేరింది. ఈ మేరకు ఏప్రిల్-నవంబర్ మధ్య గణాంకాలను అధికార వర్గాలు విడుదల చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యం 5.55 లక్షల కోట్లు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఈ మొత్తం 3.9 శాతానికి మించకూడదన్నది విధానం.
ఎనిమిది మౌలిక రంగాల గ్రూప్ ‘మైనస్’
ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్ ఉత్పత్తి 2015 నవంబర్‌లో పూర్తి నిరాశను మిగిల్చింది. 2014 నవంబర్‌తో పోల్చిచూస్తే... ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా 1.3 శాతం క్షీణత (మైనస్)ను నమోదుచేసుకుంది. గడచిన ఏడు నెలల కాలంలో ఇంత దారుణమైన ఫలితం ఎన్నడూ రాలేదు (ఏప్రిల్‌లో 0.4 శాతం క్షీణత). మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది పరిశ్రమల గ్రూప్ వాటా దాదాపు 38 శాతం.
గ్రామాల్లోనూ బ్యాంక్ శాఖలు!
సుమారు 5,000 మంది పైగా జనాభా గల ప్రతి గ్రామంలోనూ 2017 మార్చి నాటికల్లా బ్యాంకు శాఖలు ఏర్పాటు చేయాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ఇందుకోసం తమ తమ రాష్ట్రాల్లో అటువంటి గ్రామాలను గుర్తించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ)లకు సూచించింది. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు శాఖల ఏర్పాటు అవసరమని ఆర్‌బీఐ అందులో పేర్కొంది.
డీల్..
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్... అగరె వెర్లైస్ కంపెనీలో మొత్తం వంద శాతం వాటాను కొనుగోలు చేసింది. మధ్యప్రదేశ్‌లో(చత్తీస్‌గఢ్ రాష్ట్రంతో కలుపుకొని) 4జీ స్పెక్ట్రమ్ ఉన్న అగరె వెర్లైస్ కంపెనీలో ఎయిర్‌టెల్ ఇటీవల 74 శాతం వాటాను కొనుగోలు చేయగా, తాజాగా 26 శాతం వాటాను చేజిక్కించుకుంది. దీంతో అగరె వెర్లైస్..తమ పూర్తి అనుబంధ కంపెనీగా మారిందని భారతీ ఎయిర్‌టెల్ పేర్కొంది. ఈ డీల్ విలువ రూ.150 కోట్లు ఉండొచ్చని సమాచారం.
ప్రభుత్వ రంగ అతిపెద్ద విద్యుత్ యంత్రాల తయారీ సంస్థ భెల్ సీఎండీగా అతుల్ సోబ్టి పదవీ బాధ్యతలు చేపట్టారు.
గతవారం బిజినెస్
Published Mon, Jan 4 2016 3:09 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM
Advertisement
Advertisement