గతవారం బిజినెస్ | last week Bussiness | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Sun, Apr 24 2016 11:58 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 PM

last week Bussiness

నిరుత్సాహంలో ఎగుమతులు
ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణ ధోరణి వరుసగా 16వ నెల మార్చిలోనూ కొనసాగింది. అసలు వృద్ధిలేకపోగా -5.47 శాతం క్షీణత నమోదయ్యింది. వెరసి మొత్తం ఆర్థిక సంవత్సరం (2015-16 ఏప్రిల్ నుంచి మార్చి వరకు) ఎగుమతుల్లో -16 శాతం క్షీణత నమోదయ్యింది.
 
భారీ ఐపీఓకు వొడాఫోన్ సన్నాహాలు
భారత్‌లో ఐపీఓకు రావడానికి వొడాఫోన్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఐపీఓ విలువ రూ.13,200 కోట్ల నుంచి రూ.16,500 కోట్ల రేంజ్‌లో ఉంటుందని అంచనా.
 
ఐవీఆర్‌సీఎల్‌లో పెరిగిన ఐసీఐసీఐ బ్యాంక్ వాటా
రుణభారంలో ఉన్న ఇన్‌ఫ్రా సంస్థ ఐవీఆర్‌సీఎల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ తన వాటాను 11.43శాతానికి పెంచుకుంది. వ్యూహాత్మక రుణ పునర్‌వ్యవస్థీకరణ (ఎస్‌డీఆర్)లో భాగంగా 2015 జూన్ 25 నుంచి 2016 ఏప్రిల్ 13 మధ్యకాలంలో అదనంగా మరో 7.3 శాతం వాటాలు (సుమారు 3.9 కోట్ల షేర్లు) తీసుకోవడంతో బ్యాంకు వాటా పెరిగింది.
 
అత్యంత ప్రభావిత బ్రాండ్ గూగుల్
దేశంలో అత్యంత ప్రభావితమైన బ్రాండ్‌గా గూగుల్ అవతరించింది. టాప్-10 ప్రభావిత బ్రాండ్ల జాబితాలో ఇది అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఇప్సో నివేదిక ప్రకారం.. గూగుల్ తర్వాతి స్థానాల్లో ఫేస్‌బుక్, జి-మెయిల్, మైక్రోసాఫ్ట్, శాంసంగ్, వాట్స్‌యాప్‌లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఏడవ స్థానంలో, అమెజాన్  8వ స్థానంలో ఉన్నాయి. దీని తర్వాతి స్థానాల్లో ఎస్‌బీఐ (9వ స్థానం), ఎయిర్‌టెల్ (10వ స్థానం) ఉన్నాయి.
 
ఈ-కామర్స్ ఫిర్యాదులపై కమిటీ
ఈ కామర్స్ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నది. ఈ కామర్స్ జోరుగా పెరుగుతోందని, అలాగే వినియోగదారుల ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయని, దీని నివారణ కోసం త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ చెప్పారు.
 
జన్‌ధన్ ఖాతాల్లో రూ.36,000 కోట్లు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జన్ ధన్ ఖాతాల్లోని డిపాజిట్ల విలువ రూ.36,000 కోట్లుగా ఉందని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజనా కింద 28 కోట్ల బ్యాంకు అకౌంట్ల్లు ప్రారంభమయ్యాయని, వీటి ద్వారా బ్యాంకులు రూ.36,000 కోట్ల డి పాజిట్లను స్వీకరించాయని తెలిపారు.
 
పెట్టుబడుల ఉపసంహరణ శాఖ పేరు ‘దీపం’
పెట్టుబడుల ఉపసంహరణ శాఖ (డీడీ)ను ఇకపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (డీఐపీఏఎం- దీపం)గా వ్యవహరించనున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నుంచి ఈక్విటీల్లో కేంద్రం పెట్టుబడుల నిర్వహణ వరకూ కార్యకలాపాల విస్తృతి నేపథ్యంలో దీనికి అనుగుణంగా శాఖ పేరు మార్చారు.
 
టాటా స్టీల్ యూకేలో 25% వాటా తీసుకుంటాం!
సంక్షోభంలో చిక్కుకున్న టాటా స్టీల్ యూకేను గట్టెక్కించే ప్రయత్నాల్లో అవసరమైతే 25% మేర వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బ్రిటన్ వాణిజ్య మంత్రి సాజిద్ జావిద్ తెలిపారు. కార్యకలాపాల కొనుగోలుకు ముందుకొచ్చే సంస్థలకు మిలియన్ల కొద్దీ పౌండ్ల మేర రుణపరమైన ఉపశమనం కలిగించేందుకు కూడా సుముఖంగా ఉన్నట్లు వివరించారు.
 
మార్కెట్‌లోకి బెంట్లీ ‘బెంటేగ’
అల్ట్రా లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బెంట్లీ తాజాగా తన తొలి స్పోర్ట్సు యుటిలిటీ వాహనం ‘బెంటేగ’ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.3.85 కోట్లు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). ఎక్స్‌క్లూజివ్ మోటార్స్.. బెంట్లీ కంపెనీకి భారత్‌లోని డీలర్‌గా వ్యవహరిస్తోంది. ట్విన్ టర్బో చార్జ్‌డ్ 6 లీటర్ వీ12 పెట్రోల్ ఇంజిన్ కలిగిన బెంటేగ 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.1 సెకన్లలో అందుకుంటుందని, ప్రపంచంలో ఇదే అత్యంత వేగవంతమైన లగ్జరీ ఎస్‌యూవీ అని పేర్కొంది. ఇక దీని టాప్ స్పీడ్ గంటకు 301 కిలోమీటర్లు.
 
‘సీఎన్‌ఎన్-ఐబీఎన్’ ఇక ‘సీఎన్‌ఎన్-న్యూస్18’
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన మీడియా సంస్థ ‘నెట్‌వర్క్18’ తన ఆంగ్ల న్యూస్ చానల్ ‘సీఎన్‌ఎన్-ఐబీఎన్’ను ‘సీఎన్‌ఎన్-న్యూస్18’గా రీబ్రాండ్ చేసింది. ఇందులో భాగంగా సంస్థ కొత్త పేరు, లోగో, స్టూడియోను ఆవిష్కరించింది.
 
ఐపీఓకు హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్!
హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ సంస్థ ఐపీఓ ప్రయత్నాలను ప్రారంభించింది. భారత్‌లో తొలిసారిగా ఐపీఓకు వస్తున్న తొలి జీవిత బీమా సంస్థ ఇదేకానున్నది. ఈ ఐపీఓలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్‌లో తనకున్న61.65 శాతం వాటాలో  10 శాతం వాటాను హెచ్‌డీఎఫ్‌సీ విక్రయించనున్నది. ఐపీఓ వివరాలు వెల్లడి కానప్పటికీ, ఈ కంపెనీ ఐపీఓ కనీసం రూ.2,000 కోట్లు
 ఉంటుందని అంచనా.
 
2016-17లో అరశాతం రేటు కోత!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ- మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. తగిన వర్షపాతం, ద్రవ్యోల్బణం కట్టడి వంటి అంశాలు.. రేటు మరింత తగ్గింపునకు దోహదపడతాయని పేర్కొంది.
 
డీల్స్..
* బికే బిర్లా గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్ షిప్ కంపెనీ కేశోరామ్ ఇండస్ట్రీస్‌కు హరిద్వార్‌లో ఉన్న టైర్ల తయారీ యూనిట్‌ను జేకే టైర్ పూర్తి అనుబంధ సంస్థ జేకే టైర్ అండ్ జేకే ఏషియా పసిఫిక్ రూ.2,195 కోట్లకు కొనుగోలు చేసింది.
* హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్, గూగుల్ ఇండియా హెడ్ రాజన్ ఆనందన్‌లు.. బైక్ ట్యాక్సీ అపరేటర్ ‘ర్యాపిడో’లో పెట్టుబడులు పెట్టారు. ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేసింది వెల్లడించలేదు.
* భారతీ ఎయిర్‌టెల్ తన టవర్ల విభాగమైన భారతీ ఇన్‌ఫ్రాటెల్‌లో 5 శాతం వాటాను విక్రయించాలని యోచిస్తోంది. బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా ఈ వాటా విక్రయంతో రూ.3,500 కోట్ల నుంచి రూ.4,000 కోట్లు సమీకరించాలని భారతీ ఎయిర్‌టెల్ యోచిస్తోందని సమాచారం. ఇన్‌ఫ్రాటెల్‌లో ఎయిర్‌టెల్‌కు 71.7 శాతం వాటా ఉంది.
* నియంత్రణ సంస్థల నుంచి అన్ని అనుమతులు రావడంతో టెలికం టవర్ల నిర్వహణ సంస్థ వయోమ్ నెట్‌వర్క్స్ కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు అమెరికన్ టవర్ కార్పొరేషన్ (ఏటీసీ) వెల్లడించింది. దాదాపు రూ. 7,635 కోట్లకు వయోమ్‌లో 51 శాతం వాటాలు కొనుగోలుకు గతేడాది అక్టోబర్ 21న ఏటీసీ ఒప్పందం కుదుర్చుకుంది.
* పారిశ్రామిక దిగ్గజాలు అంబానీ సోదరుల సారథ్యంలోని రెండు టెలికం సంస్థల మధ్య 9 సర్కిళ్లలో స్పెక్ట్రం షేరింగ్ ఒప్పందానికి టెలికం విభాగం (డాట్) ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (ఆర్‌జియో), అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) 9 సర్కిళ్లలో స్పెక్ట్రంను పంచుకునేందుకు వీలవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement